కోనసీమలో వికసించి కనువిందు చేసిన బ్రహ్మకమలం..!

ఉత్తరాఖండ్ వంటి శీతల ప్రాంతాలలో పెరిగే బ్రహ్మకమలాలు ప్రస్తుతం అన్ని ప్రాంతాలలో కూడా వికసిస్తూ సందడి చేస్తున్నాయి.సంవత్సరానికి ఒకసారి మాత్రమే అది కూడా రాత్రి సమయంలో వికసించే బ్రహ్మకమలం చూడటానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపిస్తారు. ఎక్కడో ఉత్తరాఖండ్లో పెరిగే ఈ పుష్పాలు తాజాగా కోనసీమ లో కూడా సందడి చేశాయి. తూర్పుగోదావరి జిల్లాలోని రావులపాలెంకు చెందిన ధర్మరాజు నరసింహ రాజు ఇంట్లో శుక్రవారం రాత్రి బ్రహ్మకమలాలు వికసించాయి.

ఈ విధంగా శుక్రవారం రాత్రి బ్రహ్మకమలాలు వికసించడంతో ఆ బ్రహ్మ కమలాలను చూడటానికి చుట్టుపక్కల ప్రజలు ఎంతో ఆసక్తిగా అక్కడికి చేరుకున్నారు.ఆ పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన బ్రహ్మకమలాలు ఏడాది కాలంలో ఒకే సారి మాత్రమే వికసిస్తాయి. అదే విధంగా బ్రహ్మ కమలాలు పగలు కాకుండా రాత్రి మాత్రమే వికసించి మరుసటి రోజుకి మొగ్గలా ముడుచుకుపోవడం ఈ పుష్పాల ప్రత్యేకత.

ఎంతో అద్భుతమైన తెలుపు వర్ణంలో, ఎంతో పెద్దగా వికసించే ఈ బ్రహ్మకమల పుష్పాలు గత కొన్ని సంవత్సరాల నుంచి నరసింహ ఇంటి ఆవరణంలో వినిపిస్తున్నాయని ఈ సందర్భంగా నరసింహ తెలియజేశారు. ఈ పుష్పాలను కోసి గ్రామంలో ఉన్నటువంటి శివాలయంలో శివునికి సమర్పిస్తామని ఈ సందర్భంగా నరసింహ తెలిపారు.