Chandrabose : అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం.. చంద్రబోస్.

ప్రతి అక్షరానికి సరైన అర్ధం చెప్పగల నేర్పరి అతను. అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం.  ఆ అక్షరాల ఆత్మీయతను అంతరంగగా ఆస్వాదిస్తారు..వాటితో అనంతమైన విన్యాసాలు చేస్తారు. అక్షరాలతో గారడీ చేసి వాటిని ఓ గమ్యానికి చేర్చి ప్రతి ఒక్కరు హక్కున చేర్చుకునే విధంగా చేయడం ఆయన స్పెషాలిటే. ఆయనే లిరిసిస్ట్ చంద్రబోస్. తెలుగు ఇండస్ట్రీకి లభించిన అద్భుతం ఈయన. ఈయన కలం నుంచి జాలువారిన ఎన్నో పాటలు ప్రేక్షకుల హృదయాలను తాకాయి. నవ్వు, ఏడుపు, బాధ, విశ్వాసం, సందేశాత్మకం ఇలా ఏ భావాన్నైనా తన కలం నైపుణ్యంతో స్వరాలను పేర్చగల నేర్పరి చంద్రబోస్‌. 

Chandrabose : అక్షరాలే ఆయన ఆరాధ్యం, అక్షరాలే ఆయన ఆయుధం.. చంద్రబోస్.

కొన్ని పాటలు ప్రేక్షకుల పెదాలపై కదలాడుతుంటే, కొన్ని పాటలు విమర్శకులకు సైతం సవాళ్లను విసురుతుంటాయి. ఇండస్ట్రీలో ప్రారంభంలో ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నా తాను నమ్ముకున్న కలమే తనని శిఖర స్థాయిలో నిలబెట్టాయి. కొన్ని పాటలు ప్రేమ భావాన్ని తెలిపేవి అయితే మరికొన్ని పాటలు ప్రతి ఒక్కరి చేత కంట కన్నీరు తెప్పిస్తాయి. ఒకానొకసారి తాను రాసిన పాటలే తనకు కన్నీళ్లు పెట్టించాయని చంద్రబోస్ చాలా సార్లు తెలిపారు.

రచయిత ఆవేశాన్ని ఆపడం ఎవరి వల్లా కాదంటూ తన పాటల ద్వారా ఎన్నో సార్లు నిరూపించారు. తాజ్‌మహల్ చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు చంద్రబోస్‌. ఈ చిత్రంలో మంచు కొండల్లోని చంద్రమా చల్లగాలి చల్లిపో అన్న పాట రాసింది చంద్రబోసే. ఆ పాటను అప్పట్లో ప్రేక్షకులు ఆదరించారు. ఆ తరువాత కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన పెళ్ళిసందడి సినిమాలోనూ పాటలు రాసే అవకాశం వచ్చింది. ఆ సినిమా మ్యూజికల్ హిట్ కావడంతో చంద్రబోస్‌కు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. అలా తాజ్ మహల్ తో మొదలైన ఆయన సినీ ప్రస్థానంలో సుమారు 800 సినిమాల్లో 3300లకు పైగా పాటలు రాశారు.

మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు ఎన్నో స్ఫూర్తిదాయకమైన పాటలు రాశారు చంద్రబోస్‌. ఆ పాటలన్నీ మంచి ప్రేక్షకాధరణ పొందాయి. చిరంజీవి నటించిన చూడాలని ఉంది చిత్రంలో ఓ మారియ ఓమారియా సాంగ్ ను రాశారు చంద్రబోస్. ఇది మంచి ఇన్‌స్పిరేషనల్ సాంగ్. ఠాగూర్‌ సినిమాకు రాసిన కొడితే కొట్టాలిరా సిక్సు కొట్టాలి పాట యూత్‌లో మంచి వేడిని రగిలించింది. అప్పట్లో ఈ పాట అందరి నోట వినిపించింది. ఇక డాడీ చిత్రంలో లక్కీ లక్కీ ఎంతెంతో లక్కీ పాటకు మంచి ప్రేక్షాకాధరణ లభించింది. చిరు సినిమాలకే కాదు ఇలాంటి ఇన్‌స్పిరేషనల్ సాంగ్స్ చాలా రాశారు చంద్రబోస్. బడ్జెట్ పద్మనాభంలో ఏవరేమి అనుకున్నా నువ్వుండే రాజ్యాన రాజువు నువ్వే బంటూ నువ్వే అన్న స్ఫూర్తిదాయకమైన పాట అందరినీ ఆలోచింపజేసింది. నేనున్నాను చిత్రంలో చీకటితో వెలుగే చెప్పెను నేనున్నాని పాట ఇప్పటకీ అందరూ పాడుతూనే ఉంటారు. గుడుంబా శంకర్‌లోనూ ఇంతే ఇంతింతే సాంగ్‌ కూడా మంచి సెన్సేషన్ అయ్యింది.

ఇక ఇప్పటికీ మదర్స్ డే వచ్చినా ప్రతి ఒక్కరు స్టాటస్ పెట్టుకునే పాట ఏదైనా ఉందా అంటే అది పెదవే పలికిన మాటల్లోన తియ్యని మాటే అమ్మ అన్న సాంగ్. నాని చిత్రంలో మంచి సూపర్ డూపర్ హిట్ సాధించిన ఈ పాటను రాసిందే చంద్రబోసే. ఆ పాటలో ప్రతి పదం ఎంతో తేలికగా ఉన్నా తల్లి ఒక్క గొప్పతనాన్ని చాటి చెప్పారు. ఈ సాంగ్ ఆ సినిమాకే మంచి హైలెట్ గా నిలిచింది. ఢమరుకం చిత్రంలోనూ తల్లి పాటను రాశారు చంద్రబోస్. లేలేలే ఇవ్వాళే లే అన్న పాట కూడా ప్రేక్షకులను అలరించింది. మనం చిత్రంలోనూ కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా సాంగ్ కూడా సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది.

ప్రేమ పాటల స్పెషలిస్ట్ చంద్రబోస్. ఈయన రాసిన ప్రతి పాటను యూత్‌ ఓ రేంజ్ లో ఆధరించింది. ఆది సినిమాలో నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది అన్న సాంగ్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. నువ్వొస్తావని చిత్రంలో కలలోనైన కలనగనలేదే నువ్వొస్తావని అన్న పాట ఆ చిత్రంలో స్పెషల్ సాంగ్. ఆ పాటకి కూడా మంచి క్రేజ్ లభించింది. ఒకరికొకరులో నువ్వే నా శ్వాస మనసున నీకై అభిలాష అన్న పాట ఇప్పటికీ ప్రేమికులు పాడుకుంటుంటారు. విరహ వేదన నిండిన ఈ పాట ఎందరినో కదిలించింది. మగధీరలో పంచదార బొమ్మ సాంగ్ తో ఎనలేని క్రేజ్‌ను సొంతం చేసుకున్నారు ఈ లిరిసిస్ట్. ఆ సాంగ్ విమర్షకులను సైతం మెప్పించింది.

శోకంతో నిండిన పాటలను రాయగలరు ఈయన. రంగస్థలంలో ఈయన రాశిన ఓరయ్యో నా అయ్యా.. ఓరయ్యో నా అయ్యా..ఈ చేతితోనే బువ్వ పెట్టాను.. అన్న పాట విన్న ప్రతీ ఒక్కరిని కంటతడి పెట్టించాయి. సన్నివేశాలకు తగ్గట్లుగా పాటలు రాయగల నేర్పరి ఈ రచయిత. ఎంత ఏడ్పించగలరో అంతగా ఎంటర్‌టైన్ చేయగలరు. రంగస్థలంలోనే ఐటం సాంగ్ రాశారు. కుర్రకారును రెచ్చగొట్టారు. జిగేలు రాణి సాంగ్ సూపర్ హిట్ అయ్యింది. అదే విధంగా లేటెస్ట్‌గా పుష్పలోనూ మంచి ఐటమ్ సాంగ్ రాశారు చంద్రబోస్. సమంత స్పెషల్ అట్రాక్షన్‌గా చేసిన ఊ అంటావా..ఊహూ అంటావా సాంగ్ రాసింది చంద్రబోసే. ఈ సాంగ్‌పైన అనేక విమర్షలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు రచయితకే ఓటేసి ఆ పాటను సోషల్ మీడియా సెన్సేషన్‌గా నిలబెట్టారు.