ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ శుభవార్త.. పింఛన్ పెరిగేది ఎప్పుడంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెన్షన్ తీసుకునే వాళ్లకు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో పింఛన్ ఎప్పటినుంచి పెరుగుతుందనే అంశం గురించి స్పష్టతనిచ్చారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,250 రూపాయలు పింఛన్ ఇస్తున్నామని ఆ పింఛన్ ను 2,500 రూపాయలకు పెంచుతున్నట్టు సీఎం జగన్ వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన తరువాత వృద్ధాప్య పింఛన్ వయస్సును 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గించామని సీఎం చెప్పారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం రాష్ట్రంలో పింఛన్ పెంపు జరుగుతుందని వెల్లడించారు. ఎన్నికల ముందు వైసీపీ మేనిఫెస్టోలో 2,000 రూపాయల నుంచి 3,000 రూపాయల వరకు పింఛన్ పెంచుకుంటూ పోతామని పేర్కొందని ఆ హామీ ప్రకారం పింఛన్ ను పెంచుకుంటూ పోతున్నామని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్ పెంచామని మళ్లీ జులై 8 2021న పింఛన్ పెంపు ఉంటుందని తెలిపారు.

గత ప్రభుత్వం 44 లక్షల మందికి మాత్రమే పింఛన్ పంపిణీ చేసిందని తమ ప్రభుత్వం 61 లక్షల మందికి పింఛన్ ఇస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తున్నామని తెలిపారు. సీఎంగా పింఛన్ల పెంపుపై తొలి సంతకం చేశానని అప్పటినుంచి రాష్ట్రంలో 2,250 రూపాయల పింఛన్ పంపిణీ జరుగుతోందని జగన్ పేర్కొన్నారు.

మళ్లీ 2021 సంవత్సరం జులై 8వ తేదీ తరువాత నుంచి 2,500 రూపాయల పింఛన్ ఇస్తామని తెలిపారు. టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడుపై జగన్ అసెంబ్లీలో తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పదే పదే అబద్దాలు చెబుతూ సభను నిమ్మల రామానాయుడు తప్పుదారి పట్టిస్తున్నాడని పేర్కొన్నారు.