పవన్ కళ్యాణ్ పాటపై పోలీసుల అభ్యంతరం.. కారణం ఎంటంటే..?

పవన్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజు సందర్బంగా ఆయన తాజాగా నటిస్తున్న భీమ్లా నాయక్‌ సినిమాలోంచి ఓ పాటను విడుదల చేశారు. ఐతే అనూహ్యంగా ఈ పాట వివాదాల్లో చిక్కుకుంది. దీనిని తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పాడారు.

పవన్ కళ్యాన్ పుట్టినరోజు సందర్భంగా ఆ పాటను యూట్యూబ్‌లో విడుదల చేయగా.. 10 గంటల్లోనే లక్షల వ్యూస్ వచ్చాయి. బీమ్లా నాయక్ లోని ఈ పాటలోని కొన్ని పదాలపై తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పాట లిరిసిస్ట్ రామ‌జోగ‌య్య శాస్త్రి పోలీసుల‌ని కించ ప‌రిచే విధంగా ప‌దాలు రాసార‌ని హైదరాబాద్‌ ఈస్ట్‌జోన్ డీసీపీ త‌న ట్విట్ట‌ర్ ద్వారా అభ్యంత‌రం వ్య‌క్తం చేశారు.

తమ రక్షణ కోసం మాకు జీతాలు ఇస్తున్న ప్రజల బొక్కలు మేం విరగ్గొట్టం.. పోలీసుల గురించి వివరించేందుకు రచయితకు ఇంతకంటే గొప్ప పదాలు దొరకనట్టు ఉన్నాయి.. అంటూ డీసీపీ రమేష్‌రెడ్డి ట్వీట్‌ చేశారు. ప్ర‌స్తుతం ఈ ట్వీట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గామారింది. మ‌రి దీనిపై ర‌చ‌యిత‌, చిత్ర నిర్మాత నుండి ఏదైన స్పంద‌న వ‌స్తుందా అని ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ ఎస్ థమన్ ఈ పాటకు ట్యూన్ కంపోజ్ చేశారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తుండగా, ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రం వ‌చ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకానుంది. దీనిపై పవన్ సినీ బృందం ఎలా స్పందిస్తారనే దానిపై ఆసక్తి నెలకొంది.