Director Dasarath : 300 ఎకరాలు ఎలా పోయాయాంటే… యండమూరి గారితో పనిచేయడం చాలా కష్టం…: డైరెక్టర్ దశరథ్

Director Dasarath : సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ వంటి సూపర్ హిట్ ఫ్యామిలీ ఎంటరటైనర్స్ ను అందించిన డైరెక్టర్ అలాగే రచయిత అయిన దశరథ్ గారు ప్రస్తుతం డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. మంచు మనోజ్ హీరోగా వచ్చిన ‘శౌర్య’ సినిమా తరువాత ఆయన సినిమాలను చేయలేదు. మనసుకు తృప్తి కలుగకపోతే ఆ పని చేయలేమని చెప్పే దశరథ్ గారు బ్లాక్ బస్టర్ సినిమా నువ్వునేను కి రచయితగా పనిచేసారు. ఇక అయన బాల్యం నుండి అనేక కష్టాలను పడ్డానంటూ తన వ్యక్తిగత జీవితం గురించి దశరథ్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

భూమి మొత్తం పోయింది… బాగా కష్టపడ్డాం…

కొండపల్లి దశరథ్ కుమార్ గారి స్వస్థలం ఖమ్మం కాగా నాన్నగారికి 300 ఎకరాల భూములు ఉన్నా అవన్నీ ప్రభుత్వం అటవీ భూమి కిందకు చేర్చడంతో భూమి పోయి ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొన్నారట. బాల్యంలోనే ఒకవైపు షాప్స్ లో పనికి వెళుతూ మరోవైపు చదువుకున్న దశరథ్ గారు అప్పుడు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నట్లు తెలిపారు. తన తమ్ముళ్లు చిన్నవాళ్లు కావడంతో కుటుంబం బాధ్యత తాను తీసుకున్నట్లు చెప్పారు. ఇక చదువుకునే రోజుల్లో వార్తా పత్రికలలో వచ్చిన ప్రకటన చూసి ఒక కథ పంపితే బాగుంటుందని పంపగా 1500 కథలలో తన కథ ఎంపిక చేసినట్లు ఫోన్ చేశారట. అది యండమూరి దగ్గరి నుండి రావడంతో డబ్బులు సంపాదించి హైదరాబాద్ వెళ్లి ఆయనను కలిసి పని అడగాలని భావించారట దశరథ్. ఫోన్లో విషయం అడిగితే నేనేమి సినిమాలకు పనిచేయడం లేదు నిన్ను పనిలో పెట్టుకుని నేనేం చేయాలని చెప్పారట.

ఆ తరువాత యండమూరి గారు ఒక సీరియల్ కు పనిచేస్తున్నట్లు తెలిసి ఫోన్ చేసి అడిగితే జీతం ఇవ్వను ఏం చూసి ఇవ్వాలి, పని చేస్తావా అని అడిగారట. సరే చేద్దామని హైదరాబాద్ వెళ్లి యండమూరి వద్ద పనిలో కుదురుకున్నారట దశరథ్. ఇక ఆయన వద్ద స్క్రిప్ట్ రాయడం వంటివి చేస్తూ మొదటి సారి అయినా ఆయనకు నచ్చే విధంగా రాయడంతో కొన్ని సీరియల్స్ కు పనిచేసినపుడు దశరథ్ గారి పేరే స్క్రీన్ మీద వేయించారట యండమూరి. అయితే ఆయనతో పనిచేయడం కాస్త కష్టం, ఆయన రాత్రి పూట ఎక్కువగా పనిచేస్తారు. అయన ఉన్నంత సేపు ఆయనతో ఉండి పనిచేసి వెళ్ళాలి మళ్ళీ ఉదయాన్నే మన పనిచేసుకోవాల్సి వస్తుంది అంటూ చెప్పారు. అయితే ఆయన మన పనికి తగిన గుర్తింపు ఇస్తారు అంటూ దశరథ్ అభిప్రాయపడ్డారు.