Director K. Viswanath : క్లాసిక్ సినిమాలకు కేరాఫ్ గా నిలిచిన దర్శకుడు… మొదటి సినిమాకే నంది… కళాతపస్వి సినీ ప్రయాణం…!

Director K. Viswanath : ఓ శంకరాభరణం, ఓ సాగర సంగమం, ఓ స్వర్ణ కమలం, ఓ సప్తపది ఇలా ఏ సినిమా తీసుకున్నా అందులో ఒక సందేశం అలాగే భారతీయ సంస్కృతి ముడిపడి ఉంటాయి. అంతేకాకుండా అవి జనాలను ఆకట్టుకునేలా తీసి కమర్షియల్ సినిమా హవా ఉన్న సమయంలో క్లాసిక్ హిట్ అందుకున్న దర్శకుడు కే.విశ్వనాధ్ గారు. ఆయన డైరెక్టర్ గా తీసిన మొదటి సినిమా ‘ఆత్మ గౌరవం’ కే నంది అవార్డు అందుకున్న అయన ఆ తరువాత అనుదుకున్న అవార్డులకు లెక్క లేదు. ఇప్పుడు ఆస్కార్ గురించి మాటలాడుతున్న చాలా మందికి తెలియని విషయం విశ్వనాధ్ గారి డైరెక్షన్లో వచ్చిన ‘సాగర సంగమం’ సినిమా 52వ ఆస్కార్ నామినేషన్స్ లో ఉత్తమ ఫారిన్ చిత్రంగా ఆఫీషియల్ ఎంట్రీ అందుకుంది. అంతే కాకుండా రష్యన్ లోకి విశ్వనాధ్ గారి ఎన్నో సినిమాలు డబ్ చేయబడ్డాయి. అలా చూసుకుంటే ఎన్నో అవార్డులు సత్కారాలు ఆయన సినిమాలకు లభించిన ఆయన 92 ఏళ్ల వయసులో ఫిబ్రవరి 2 న వృధాప్య సమస్యలతో బాధపడుతూ అపోలో హాస్పిటల్ లో శివైక్యం చెందారు.

మొదటి సినిమాతోనే అవార్డులు…

విశ్వనాధ్ గారి స్వస్థలం గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా లోని పెద్ధ పులివర్రు గ్రామం. అయితే ఎక్కువ కాలం విశ్వనాధ్ గారి కుటుంబం అక్కడ లేరు, ఆయన చదువంతా విజయవాడ లో జరిగింది. ఇక ఆయన తండ్రి వాహిని స్టూడియోస్ చెన్నై లో పని చేస్తుండగా విశ్వనాధ్ గారు కూడా సౌండ్ రికార్డర్ గా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. అలా మొదలైన ప్రయాణంలో సినిమా డైరెక్షన్ మీద మక్కువ అలాగే అదుర్తి సుబ్బారావు గారి సాన్నిహిత్యంతో ఆయన వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా 1961 నుండి 1964 వరకు మూగ మనసులు, ఇద్దరు మిత్రులు, డాక్టర్ చక్రవర్తి సినిమాలకు పనిచేసారు. ఆ సమయంలోనే విశ్వనాధ్ గారి పనితనం నచ్చిన నాగేశ్వరావు గారు ఆయనకు నెక్స్ట్ సినిమా నీతో చేస్తానని మాటిచ్చారట. అలా నాగేశ్వరావు గారితో 1964 లో ‘ఆత్మ గౌరవం’ సినిమాకు డైరెక్షన్ చేసారు.

అయితే దర్శకత్వం కంటే ముందు రైటర్ గా కొన్ని సినిమాలకు పనిచేసిన ఆయన ‘చదువుకున్న అమ్మాయిలు’ సినిమాకు స్క్రిప్ట్ రాసారు. ఇక ‘సుడిగుండాలు’ సినిమాకు రచయిత గా మంచి ప్రశంసలు అందుకున్నారు. విశ్వనాధ్ గారు అదుర్తి సుబ్బరావు గారి వద్ద అసిస్టెంట్ గా పనిచేసినా ఆయనకు బాపు రమణాల వద్ద అసిస్టెంట్ గా పనిచేయాలని ఉండేది అని చాలా సందర్భాల్లో చెప్పడం విశేషం. ఇండస్ట్రీలో విశ్వనాధ్ గారు, బాలసుబ్రమణ్యం గారు, అలాగే నటుడు చంద్రమోహన్ గారు దగ్గరి బంధువులు. విశ్వనాధ్ గారు రైటర్, డైరెక్టర్ గానే కాకుండా నటుడుగా కూడా పలు భాషల్లో నటించి మెప్పించారు.

ఇక ఆయన తీసిన క్లాసిక్ సినిమా ‘శంకరాభరణం’ సినిమా విడుదల అయిన రోజు ఖాళీగా ఉండి ఆ తరువాత హౌస్ ఫుల్ గా సాగింది, ఒక క్లాసిక్ సినిమా 100 రోజులు ఆడి ఇండియన్ టాప్ 100 సినిమాల్లో చోటు దక్కించుకుంది. విశ్వనాధ్ గారి కెరీర్ ఆ సినిమాతో శంకరాభరణం ముందు ఆ తరువాత అన్నట్లుగా మారిపోయింది. ఇక ఆయన చిరంజీవి గారితో శుభలేఖ, ఆపద్బాంధవుడు, స్వయం కృషి వంటి సినిమాలను తీశారు. వారిద్దరి మధ్య గురుశిష్యుల అనుబంధం ఉంది. విశ్వనాథ్ గారి సినిమాలు హిందీలో కూడా కొన్ని రీమేక్ కాగా ఆయన కొన్ని హిందీ సినిమాలను తీశారు. విశ్వనాధ్ గారి చివరగా తీసిన చిత్రం అల్లరి నరేష్ హీరోగా చేసిన ‘శుభప్రదం’. ఆ తరువాత ఆయన డైరెక్షన్ కి అలానే నటనకు దాదాపు దూరం అయ్యారు. చివరగా ఆయన ఒక తమిళ సినిమాలో నటించారు. ఇక దాదాసాహెబ్ ఫాల్కె అవార్డు అందుకున్న అతి తక్కువ మంది తెలుగు ప్రముఖులలో విశ్వనాథ్ గారు ఒకరు. ఆయన మన మధ్య భౌతికంగా లేకపోయినా ఆయన తీసిన కళాత్మక సినిమాల ద్వారా బ్రతికే ఉంటారు.