16 వారాల తర్వాతే కరోనా రెండో డోసు..?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా కొనసాగుతుంది. ఈ క్రమంలోనే ప్రముఖ ఫార్మా సంస్థ సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా తయారుచేసిన కొవిషీల్డ్‌ టీకాను కూడా మనదేశంలో ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు మొదటి డోసు కొవిషీల్డ్‌ వేసుకున్న తర్వాత 28 రోజులకు రెండవ డోస్ వేసుకోవాలని తెలిపింది.

కానీ తాజాగా రెండో డోస్ వ్యవధిని 12-16 వారాలకు పెంచొచ్చన్న నిపుణుల కమిటీ సిఫార్సులను ప్రభుత్వం అంగీకరించింది. అయితే కేవలం ఈ 12 నుంచి 16 వారాల వ్యవధి ఒక కొవిషీల్డ్‌ టీకాకి మాత్రమే కానీ,కొవాగ్జిన్‌కు సంబంధించి డోసుల మధ్య అంతరంలో కేంద్రం ఎలాంటి మార్పులు చేయలేదు.

ఈ విధంగా రెండు డోస్ ల వ్యవధి పెంచడం వల్ల మెరుగైన ఫలితాలను పొందవచ్చునని నేషనల్‌ టెక్నాలజీ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ నిపుణుల బృందం తెలిపింది. రెండవ డోసు 28 రోజుల తర్వాత తీసుకోవడం వల్ల కేవలం 55.1 శాతం మాత్రమే సమర్థవంతంగా పనిచేస్తుందని, ఈ డోస్ వ్యవధిని 12-16 వారాలకు పెంచడం వల్ల ఇది 81.3 సమర్థవంతంగా పనిచేస్తుందని అంతర్జాతీయ ది లాన్సెట్‌ పత్రిక ప్రచురించింది.

కొవిషీల్డ్‌ టీకా డోస్ ల మధ్య వ్యవధి పెంచడం ఇది రెండో సారి కావడం గమనార్హం.ఈ విధంగా విభజించడం వల్ల ఇది సమర్థవంతంగా పని చేస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించగా…మరి కొందరు మాత్రం వ్యాక్సిన్ కొరత కారణం వల్లనే ఈ విధంగా వ్యాక్సిన్ మధ్య వ్యవధి పెంచుతున్నారని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.