ఏపీ విద్యార్థినులకు శుభవార్త.. ఉచిత శిక్షణతో పాటు ఉద్యోగం..?

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రాష్ట్రంలోని విద్యార్థినులకు, నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ సహాయంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా చేస్తోంది. తాజాగా పాలిటెక్నిక్ విద్యార్థినులకు ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పాలిటెక్నిక్ చదివిన విద్యార్థినులకు ఉచితంగా శిక్షణతో [పాటు ఉద్యోగం కల్పిస్తామని ప్రకటన చేసింది.

స్కిల్ డెవలప్‌మెంట్ మేనేజింగ్ డెరైక్టర్ అర్జా శ్రీకాంత్ ఒక ప్రకటనలో భాగంగా మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. శిక్షణ అనంతరం విద్యార్థినులకు శ్రీసిటీ లోని ఆల్‌స్టామ్ సంస్థలో ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ డిప్లొమా లేదా ఎలక్ట్రికల్ డిప్లొమా పూర్తి చేసిన 2019 విద్యార్థినులు ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఎంపికయిన విద్యార్థినులకు ఫ్రీ ట్రైనింగ్ తో పాటు ఫ్రీగా హాస్టల్ వసతి కల్పిస్తామని పేర్కొన్నారు.

http://engineering.apssdc.in/siemenplacements/ విద్యార్థినులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని.. ఈ నెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకున్న విద్యార్థినులు మాత్రమే అర్హులని తెలిపారు. మొత్తం 30 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సమాచారం. జిల్లాల నైపుణ్యాభివృద్ధి సంస్థ దరఖాస్తు చేసుకున్న విద్యార్థినుల దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి అర్హతలు ఉన్నవారిని శిక్షణకు ఎంపిక చేస్తారు.

ఎంపికైన విద్యార్థినులు శ్రీ సిటీలో శిక్షణ పూర్తి చేసుకున్న తరువాత వారికి ఆల్‌స్టామ్ సంస్థ, స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థ సర్టిఫికెట్లను అందజేస్తాయి. శిక్షణ సమయంలో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినులకు సంవత్సరానికి 3 లక్షల రూపాయల వేతనంతో ఆల్‌స్టామ్‌ సంస్థ ఉద్యోగావకాశాలను కల్పిస్తోంది.