ఆరోగ్యానికి మేలు చేసే రాగి అంబలి.. ఎలా తయారు చేయాలంటే?

ఇటీవల కాలంలో చాలా మంది చిరుధాన్యాల్లోని పోషక విలువలను గుర్తించి తమ రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటున్నారు.అయితే ఇప్పుడు చిరుధాన్యాల్లోని ముఖ్యమైన రాగులు గురించి, ఈమధ్య బాగా ప్రాచుర్యం పొందిన రాగి అంబలి తయారీ విధానం ,అందులో పోషక విలువలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి చిరుధాన్యములో మన శరీరానికి అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ ఎక్కువ ఉంటాయి.అన్ని ఆహార ధాన్యాలు కంటే రాగిలో 7-35 రెట్లు అధికంగా కాల్షియం ఉంటుంది. కావున ఎముకలు దృఢంగా తయారయ్యి, కీళ్ళ సంబంధిత వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చు.మొలకెత్తిన రాగులలో రోగ నిరోధక శక్తి వచ్చే విటమిన్-సి సమృద్ధిగా లభిస్తుంది. ప్రతిరోజు ఒక్క గ్లాస్ రాగి అంబలి తాగినా కడుపు నిండిన భావన కలిగి ఆహారం తక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్య తగ్గించుకోవచ్చు. అలాగే బీపీ, షుగర్ నియంత్రణలోకి వస్తాయి. రాగి అంబలి తరచూ తాగడం వల్ల చిన్న పిల్లల్లో మెదడు అభివృద్ధి సక్రమంగా జరిగి చురుగ్గా పనిచేస్తుంది.

ఇప్పుడు రాగి అంబాలికి తయారీ విధానం గురించి తెలుసుకుందాం. మొదట నాణ్యమైన రాగులను మనకు కావాల్సిన పరిమాణంలో తీసుకుని కొన్ని గంటల పాటు శుభ్రమైన నీటిలో నానబెట్టాలి.తర్వాత వీటిని తీసి శుభ్రమైన వస్త్రంలో కట్టి ఉంచితే అవి మొలకెత్తుతాయి. మొలకెత్తిన రాగులను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి.రాగి పొడిని కావలసిన పరిమాణంలో నీటిలో వేసి బాగా ఉడికిన తర్వాత అందులోకి మీకు ఇష్టమైన జీడిపప్పు,కిస్మిస్‌, తేనె వంటివి కలుపుకోవచ్చు. లేదంటే ఉప్పు, కారం వేసుకుంటే వేడి వేడి రుచికరమైన రాగి అంబలి తయారవుతుంది. దీన్ని ప్రతి రోజూ సేవిస్తే సకల వ్యాధి నివారణగా పనిచేస్తుంది.