వర్షాల కారణంగా కొట్టుకుపోయిన కోళ్ల ఫాం.. డజన్ల కొద్ది కోళ్లను పట్టుకెళ్లిన గ్రామస్తులు..

ప్రస్తుతం వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అయితే తెలంగాణలోని ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ వర్షాల కారణంగా కుంటలు, చెరువులు నిండిపోయి పొంగి పారుతున్నాయి. ఈ నేపథ్యంలో జాక్రాన్ పల్లి మండలం చింతలూరులో భారీ వర్షాలకు ఆ ఊరి చెరువు అలుగు ఉప్పొంగుతోంది.

చెరువు నిండి భారీగా మత్తడి దూకుతోంది. అయితే ఆ చెరువు పక్కనే ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించి కోళ్ల ఫాం ఉంది. ఇది ఆ నీటి ప్రవాహానికి కొట్టకుపోయింది. దీంతో అందులో ఉండే కోళ్లు ఆ పొలాల్లోకి వెళ్లి కొట్టుకుపోయాయి. అక్కడ పొలాలు అన్నీ నీట మునిగిపోయాయి. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు.. గుంపులు గుంపులుగా ఆ ప్రదేశానికి చేరుకున్నారు.

ఒక్కొక్క వ్యక్తి ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను ఇంటికి పట్టుకొని వెళ్లారు. దీంతో చింతలూరు గ్రామస్తులు కోడి కూరతో సంతోషంగా దావత్ చేసుకుంటున్నారు. కిలోల చొప్పున కాకుండా ఏకంగా డజన్ల కొద్ది కోళ్లను పట్టుకెళ్లి పండగ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయం తెలియడంతో ఆ గ్రామ చుట్టు పక్కల గ్రామస్తులు కూడా ఆ ప్రదేశానికి చేరుకొని కోళ్ల కోసం వెతకడం మొదలుపెట్టారు. అయితే బాధితుడు ప్రదీప్ రెడ్డి మాత్రం తమను ఆదుకోవాలని.. ఆ వరద ప్రవాహానికి తీవ్రంగా నష్టపోయినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.