ఇంటి కోసం దాచుకున్న డబ్బులను .. పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తా: విశాల్

సినీ పరిశ్రమలో అడుగుపెట్టి పదహారు సంవత్సరాలైనప్పటికీ తనకు సొంత ఇల్లు లేదని నటుడు విశాల్‌ అన్నారు. ఇటీవల కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ స్వర్గీయులైన విషయం తెలిసిందే. దానికి కర్ణాటక ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో పునీత్‌ సంస్మరణ సభ నిర్వహించారు. దీనికి దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు పాల్గొన్నారు.

పునీత్ తో తమకున్న అనుబంధాన్ని ప్రతీ ఒక్కరు గుర్తు చేసుకున్నారు. ఆయన చేసిన మంచి పనులను కొనియాడారు. ఇందులో భాగంగా విశాల్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. పునీత్ మరణ వార్త వినగానే షాక్ కు గురయ్యానని.. కళ్ల నుంచి నీరు ఆగలేదని.. ఆ వార్తను తాను జీర్ణించుకోలేకపోయానని విశాల్ చెప్పాడు.

పునీత్‌తో నాకు అంత అనుబంధం లేదు. కానీ, ఆయనకు నేనూ ఒక అభిమానినే అని చెప్పుకొచ్చారు. అయితే ఆయన చేసిన కార్యక్రమాలు ఎవ్వరికీ తెలియదని.. అలాంటి గొప్ప వ్యక్తి చేసిన సేవా కార్యక్రమాల్లో తాను భాగం కావాలనుకుంటున్నానని తెలిపారు. అందులో భాగంగా పునీత్‌ చదివిస్తున్న 1800 మంది పిల్లలను ఇకపై నేను చదివిస్తాను.. వాళ్ల చదువులకు అయ్యే ఖర్చు నేను భరిస్తానన్నారు.

సినిమాల్లో ఇన్ని రోజుల నుంచి తాను నటిస్తున్నప్పడికీ సొంత ఇల్లు అనేది లేదని.. ఇప్పటికీ తల్లిదండ్రుల వద్దే ఉంటున్నానని చెప్పారు. సొంత ఇంటి కోసం డబ్బులు దాచుకున్నానని.. ప్రస్తుతం ఆ డబ్బులనే పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానన్నారు. పునీత్‌ ఆత్మకు శాంతి చేకూరాలని విశాల్‌ అన్నారు. ఈ సభపైనే శరత్ కుమార్ భావోద్వేగానికి గురైన విషయం తెలిసిందే.