ఇల్లు ఇలా ఉంటే.. ఎలాంటి రోగం వచ్చినా భయం ఉండదు..

గత కొన్ని రోజుల వరకు కేవలం ఒక చిన్న ఇంటిలో కుటుంబం మొత్తం కలిసి జీవించే. అందరూ ఒకే చోట కూర్చుని భోజనం చేయటం, ఒకే చోట పడుకోవడం వంటివి చేసేవారు. కానీ గత ఏడాది కరోనా వైరస్ అన్ని దేశాలకు వ్యాప్తి చెందడంతో ఇల్లు ప్రాముఖ్యత తెలిసివచ్చింది. సొంత ఇల్లు లేకుండా కిరాయి ఇళ్లలో ఉండే వారికి కరోనా సోకితే ఇంటి యజమానులు ఇంటిని ఖాళీ చేయించడంతో సొంత ఇంటి విలువ తెలిసి వచ్చింది. ఈ క్రమంలోనే కరోనా మొదటి దశ సొంత ఇంటి ప్రాముఖ్యత తెలియజేస్తే రెండవదశ మాత్రం ఎలాంటి ఇల్లు అవసరమో గుర్తు చేస్తుంది.

కరోనా వ్యాధి కారణంగా ఆఫీసులకు వెళ్లేవారు సైతం ఇంట్లోనే విధులు నిర్వర్తిస్తున్నారు, పాఠశాలకు వెళ్లే పిల్లలు కూడా ఆన్లైన్ క్లాసులు ద్వారా ఇంటికే పరిమితం కావడం వల్ల ఎక్కువ సమయం ఇంట్లోనే గడపాల్సి ఉంటుంది కనుక నాలుగు గోడల మధ్య కరోనా వ్యాధి వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మన ఇంటిలోకి ఎక్కువగా గాలి వెలుతురు వచ్చే విధంగా ఉండాలి.

కొత్తగా ఇంటిని నిర్మించాలి అనుకునేవారు, లేదా నిర్మించిన ఇంటిని కొనుగోలు చేయాలనుకునే వారు కొన్ని విషయాలను దృష్టిలో పెట్టుకుని ఇంటిని కొనుగోలు చేయాలి. విశాలమైన ఇంటిలో ఉండటం వల్ల కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులలో ప్రతి ఇంటికి రెండు పడక గదిలు ఉన్న సొంత ఇల్లు ఉండాలనే అవసరాన్ని చాలామంది గుర్తించారు. విశాలమైన ఇల్లు ఇంట్లోకి గాలి వెలుతురు ఎక్కువగా వచ్చే విధంగా జాగ్రత్త పడాలి.

మనం నివసిస్తున్న ఇంటిలో గాలి వెలుతురు అధికంగా ఉన్నప్పుడు మన ఇల్లు ఎప్పుడు ఎంతో చల్లగా ఉండటమే కాకుండా మన ఇంటిలో ఎటువంటి హానికర బ్యాక్టీరియాలు పెరగడానికి అవకాశం ఉండదు. కనుక మనం నిర్మించుకున్న ఇంటిలో ఎక్కువగా గాలి వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. అదేవిధంగా స్నానాల గదులు, చీకటిగా, ఇరుకుగా కాకుండా ఎంతో విశాలంగా గాలి, వెలుతురు వచ్చే విధంగా చూసుకోవాలి. ఈ విధమైన ప్రశాంతమైన, విలాసవంతమైన ఇల్లు ఉండటం వల్ల మనకు ఎలాంటి రోగాలు వచ్చినా భయపడాల్సిన పనిలేదు.