మెగాస్టార్, ఈ హీరోయిన్ తో నటించిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి..!!

సినీరంగంలో కొన్ని ‘పేయిర్స్’ అద్భుతమైన హిట్స్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్ని పేయిర్స్ చతికిల పడిన సందర్భాలు ఉన్నాయి. చిరంజీవి-రాధిక, చిరంజీవి-విజయశాంతి, చిరంజీవి-రాధ.. ఈ ముగ్గురితో వచ్చిన అన్ని సినిమాలు దాదాపుగా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించాయి. 1980 దశకంలోని హీరోయిన్స్ తో ఎక్కువ చిత్రాల్లో నటించినప్పటికీ, అంతకుముందు వచ్చిన జయసుధ, జయప్రద, సుజాత.. లాంటి హీరోయిన్స్ తో నటించిన చిరంజీవి సినిమాలు పెద్దగా ఆడలేదనే చెప్పవచ్చు.

1970వ దశకంలో జయసుధ తో చిరంజీవి ప్రాణం ఖరీదు, ఆడవాళ్లు మీకు జోహార్లు, పులి బెబ్బులి, మగధీరుడు లాంటి చిత్రాల్లో హీరోగా నటించారు. ఇక జయప్రద 1975, ప్రాంతంలో సినీ పరిశ్రమలోకి ప్రవేశించింది. ‘భూమి కోసం’ చిత్రంతో తన కెరియర్ ని ప్రారంభించినప్పటికీ ఎన్టీఆర్ తో నటించిన అడవిరాముడు చిత్రంతో అందనంత ఎత్తుకు జయప్రద ఎదిగిపోయారు. నటనా ప్రకారంగా ‘అంతులేనికథ’ సిరిసిరిమువ్వ, సాగర సంగమం లాంటి చిత్రాలు జయప్రదకు మంచి పేరును తీసుకువచ్చాయి. 1980 దశకం వచ్చేసరికి కుర్ర హీరోలతో నటించే అవకాశం జయప్రదకు వచ్చింది. ఆక్రమంలో చిరంజీవి, జయప్రద కాంబినేషన్లో కొన్ని సినిమాలు విడుదలయ్యాయి.

1980, అంజలి పిక్చర్స్, వి.మధుసూదన్ రావు దర్శకత్వంలో ‘చండీప్రియ’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాని ఒక నవల ఆధారంగా నిర్మించారు. ఈ ముక్కోణపు ప్రేమకథా చిత్రంలో శోభన్ బాబు, జయప్రద, చిరంజీవి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందింది.

1981 ప్రేమాలయ పిక్చర్స్, కె.బాలచందర్ దర్శకత్వంలో ’47 రోజులు’ సినిమా విడుదలైంది. ఈ చిత్రంలో చిరంజీవి, జయప్రద కలిసి నటించారు. ప్రతి కథానాయకుడి ఛాయలతో చిరంజీవి ఈ సినిమాలో కనిపిస్తారు. జయప్రదతో నటించిన రెండో సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద చతికిలపడింది. ఆ తర్వాత వచ్చిన ముచ్చటగా మూడవ సినిమా వేట.

1986, సంయుక్త బ్యానర్, కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వేట చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవి, జయప్రద హీరో, హీరోయిన్లుగా నటించారు. బ్రిటిష్ కాలం నాటి కథతో వచ్చిన ఈ చిత్రం పూర్తిగా అడ్వెంచర్ ఎంటర్టైన్మెంట్ చిత్రంగా రూపొందింది. చక్రవర్తి స్వరపరిచిన బాణీలు పర్వాలేదు అనిపించుకున్న డిఫరెంట్ క్లైమాక్స్ తో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. అలా చిరంజీవి,జయప్రద కాంబినేషన్ లో వచ్చిన చండీప్రియ, 47 రోజులు, వేట చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకున్నాయి.