ఒకే పేరుతో ఇద్దరు దర్శకులు.. వారి సినిమాలు కూడా ఒకే పేరుతో వచ్చాయని మీకు తెలుసా.?!

నిజ జీవితంలో కొన్ని సంఘటనలు కాకతాళీయంగా జరుగుతూ ఉంటాయి. అందుకు సినీ పరిశ్రమ ఏ మాత్రం తీసిపోదు. ఒకే పేరుతో ఉన్న సినీ హీరోలు ఉన్నారు. (సీ.నరేష్ జూ.నరేష్) అలాగే హీరోయిన్స్ ఉన్నారు (సీ.శ్రీదేవి, జూ.శ్రీదేవి), (సీ.జయలలిత, జూ.జయలలిత), (కె.ఆర్.విజయ, వై.విజయ) అలాగే కమెడియన్స్ ఉన్నారు. (సీ.సుధాకర్, జూ.సుధాకర్) ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టు ఉంటుంది. అయితే ఒకే పేరుతో ఇద్దరు దర్శకులు ఉన్నారు. కానీ వారిద్దరి సినిమాలకు ఒకే టైటిల్ వుండడం అరుదు. అలాంటి రేర్ ఫీట్ తెలుగు సినీ పరిశ్రమలో జరిగింది.

తెలుగు తెరకు పరిచయమైన సీనియర్ వంశీ, జూనియర్ వంశీ ఇద్దరు దర్శకులు తమ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆదరణ పొందారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన సీనియర్ వంశీ మొదటగా శంకరాభరణం చిత్రానికి సహాయ దర్శకుడిగా పని చేశారు. ఆ తర్వాత చిరంజీవితో పనిచేసే అవకాశం లభించింది. సీనియర్ వంశీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా మంచు పల్లకి సినిమా వచ్చింది. ఆ తర్వాత భానుప్రియను హీరోయిన్ గా పరిచయం చేస్తూ సితార చిత్రాన్ని రూపొందించారు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది. ఆ రోజుల్లో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను పొందింది. సీనియర్ వంశీకి ఎంతగానో ఈ సినిమా పేరు తీసుకువచ్చింది. ఆ తరువాత ఆయన ఆలాపన, అన్వేషణ, లేడీస్ టైలర్, డిటెక్టివ్ నారద లాంటి చిత్రాలను రూపొందించారు. 1987 శ్రీ స్రవంతి మూవీస్, వంశీ దర్శకత్వం లో ‘మహర్షి’ చిత్రం విడుదలయింది. ఈ సినిమాలో మహర్షిరాఘవ, శాంతి ప్రియ హీరోహీరోయిన్లుగా నటించారు.

ఇక పోతే మరో దర్శకుడు జూనియర్ వంశీ పైడిపల్లి, అదిలాబాదులో జన్మించి, హైదరాబాదులో ఉన్నతవిద్యను అభ్యసించారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాన్ని వదిలి.. వర్షం, భద్ర సినిమాలకి అసిస్టెంట్ డైరెక్టర్ గా వంశీ పైడిపల్లి పనిచేశారు. ఆ తర్వాత ప్రభాస్ హీరో మున్నా సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత బృందావనం, ఎవడు, ఊపిరి లాంటి చిత్రాలను ఆయన రూపొందించారు. జూనియర్ వంశీ దర్శకత్వంలో 2019, దిల్ రాజు, అశ్వినీదత్ నిర్మాణం, ‘మహర్షి’ చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో, హీరోయిన్స్ గా నటించారు. అలా ఒకే పేరుతో గల ఇద్దరు దర్శకులు ఒకే టైటిల్ తో గల రెండు సినిమాలు రూపొందించడం గమనార్హం.