ఆఫీసుల చుట్టూ చెప్పులరిగేలా తిరిగారు.. ఏడుపు కొట్టు కథ అన్నారు.. చివరికి ఆమెతో తీసి హిట్ కొట్టారు.!!

సినీ పరిశ్రమలో ఒక్కో దర్శకుడికి ఒక్కో బ్రాండ్ ఉంటుంది. పౌరాణిక, సాంఘిక, జానపద, కౌబాయ్, మాస్, కుటుంబ, ప్రేమ కథా చిత్రాల దర్శకులని పేరు ఉంటుంది. అలాంటి కోవలోకే ముత్యాల సుబ్బయ్య వస్తారు. ఆయన కుటుంబ కథా చిత్రాలకు పెట్టింది పేరు. ఆయన చిన్న, పెద్ద అందరి హీరోలతో సినిమాలు తీసి హిట్ కొట్టారు.

సురేష్, వినోద్ కుమార్, రాజశేఖర్, చంద్రమోహన్, వెంకటేష్, చిరంజీవి ఇలా అందరితోనూ విజయవంతమైన చిత్రాలను తీసి ఉత్తమ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. 1980 ప్రాంతంలో సినిమాల్లో ముత్యాల సుబ్బయ్య యాక్టివ్ గా ఉన్నప్పటికీ చిరంజీవితో సినిమా తీయడానికి దాదాపుగా చాలా సమయాన్ని తీసుకున్నారు. 1996 వచ్చేసరికి చిరంజీవితో హిట్లర్ సినిమా తీసే అవకాశం వచ్చింది. ఆయనతో సినిమా తీయడంతో దర్శకుడు ముత్యాల సుబ్బయ్య దాదాపుగా అందరి హీరోలతో సినిమా రూపొందించినట్టుగా భావించారు.

అయితే విషయంలోకి వెళితే.. ముత్యాల సుబ్బయ్య సుమన్ తో జయసింహ, మోహన్ బాబుతో మా ఇంటికథ.. ఈ రెండు చిత్రాలు కూడా విజయాన్ని సాధించలేకపోయాయి. ఆ క్రమంలో ఆయన శ్రీరాజ్ చక్రపాణి వారి యువ మాసపత్రికలో వచ్చిన ఓ కథకు బహుమతి వచ్చింది. కొన్ని రోజులకు ఆ కథ నాటకమైంది. ఆ నాటకాన్ని చూసిన దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఆ కథతోనే సినిమా తీయాలనుకున్నారు. సినిమాకు అనుగుణంగా కథకు స్క్రిప్టును రూపొందించుకొని నిర్మాతల ఆఫీస్ వద్దకు వెళ్లారు. ఆసక్తిగా లోపలికి ఆహ్వానించిన నిర్మాతలు కథ వినగానే ఇది ఒక ట్రాజెడీ, ఏడుపుగొట్టు కథ అని… తిరస్కరించారు.

అలా ఎన్నో సార్లు నిర్మాతల చుట్టూ ‌తిరిగి వేసారిపోయిన ముత్యాల సుబ్బయ్య, ఆ కథను సహజనటి జయసుధకు వినిపించారు. అప్పటికే ఆమె జె.ఎస్.కే ప్రొడక్షన్స్ తో సినిమాలను నిర్మిస్తున్నారు. ఆమెకు కథ నచ్చడంతో తన సొంత బ్యానర్ లో నిర్మిస్తానంటూ ముందుకు వచ్చారు. అలాగే కథకు సంబంధించిన ప్రధాన పాత్రలో జయసుధ నటించి విమర్శకుల ప్రశంసలను పొందారు. 1991లో విడుదలైన గ్యాంగ్ లీడర్, అసెంబ్లీ రౌడీ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను తట్టుకొని.. మధ్యతరగతి కుటుంబాల జీవితాలను ప్రతిబింబిస్తూ వచ్చిన ‘కలికాలం’ చిత్రం వంద రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడింది. ఈ సినిమాకి గాను ముత్యాల సుబ్బయ్య కళావాహిని పురస్కారాన్ని అందుకున్నారు.