అబ్బా.. తెలుగులో ఒకడున్నాడు.. అని ఇతర భాషా నటులు మాట్లాడుకున్నా ‘కోట’ నటించిన ఆ మూడు చిత్రాలు.!!

సినిమా నాటి నుండి నేటి వరకు ఎంతోమంది కొత్త నటులను పరిచయం చేయడం జరిగింది.ఆ క్రమంలో కథానాయకులు, కథానాయికలు, ప్రతి కథానాయకులు, హాస్యాభినయ నటులు ఇలా ఎందరో, ఎందరెందరో.. సినీ పరిశ్రమలో తమదైన నటనా శైలిని కనబరుస్తూ ఒక్కోమెట్టు అధిగమిస్తూ ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందారు. ఎస్.వి.రంగారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, అల్లు రామలింగయ్య, కైకాల సత్యనారాయణ, నిర్మలమ్మ వంటి నటీనటులు పాత్రకే వన్నెతెచ్చే వారు. అలాంటి వారి నటనతో కూడిన ఎన్నో చిత్రాలు ప్రేక్షకులను వారి అభిమానులను ఎంతగానో మెప్పించాయి. అలాంటి కోవలోకి కోట శ్రీనివాసరావు వస్తారు.

కృష్ణా జిల్లాకు చెందిన ‘కోట’ ప్రారంభంలో బ్యాంకులో ఉద్యోగం చేస్తూండేవారు. నాటకాలపై అభిమానంతో వీలు దొరికినప్పుడల్లా స్టేజి ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ క్రమంలో 1978 ఆ ప్రాంతంలో ‘ప్రాణంఖరీదు’ నాటకం వేస్తుండగా.. అది చూసిన నిర్మాత, దర్శకుడు క్రాంతి కుమార్ ఆ చిత్రాన్ని సినిమాగా తీయాలనుకున్నారు. అలా చిరంజీవి హీరోగా ‘ప్రాణం ఖరీదు’ చిత్రాన్ని రూపొందించారు. ఇక అక్కడ నుండి మొదలైన కోట ప్రయాణం అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు.

ఆ తర్వాత దేవాంతకుడు, తాండ్రపాపారాయుడు, ప్రతిఘటన, వారసుడొచ్చాడు, ఖైదీ నెంబర్ 786, ఆహా నా పెళ్ళంట, శివ చిత్రాల అనంతరం.. 1991, సుమంత్ ఆర్ట్స్ బ్యానర్, కోడి రామకృష్ణ దర్శకత్వంలో శత్రువు చిత్రం విడుదలైంది. ఈ సినిమాలో వెంకటేష్, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. ప్రతి కథానాయకుడు పాత్రలో వెంకటరత్నంగా కోట శ్రీనివాసరావు నటన డిఫరెంట్ గా ఉంటుంది. అవినీతి రాజకీయ నాయకుడి పాత్రలో కోట అదరగొట్టారు. కనిపించిన ప్రతి సన్నివేశంలో ఇలా జరిగిందేమిటిరా బాబు.. “అని చెప్పే డైలాగు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.. ఆ తర్వాత 1993 రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘గాయం’ చిత్రం విడుదలయ్యింది.

ఈ సినిమాలో జగపతిబాబు,ఊర్మిళ హీరో,హీరోయిన్లుగా నటించారు. స్థానిక ఎమ్మెల్యే పాత్రలో కోట శ్రీనివాసరావు గురునారాయణ్ గా నటించారు. రాజకీయ నాయకుడిగా తెలంగాణా స్లాంగ్ లో కోట శ్రీనివాసరావు చెప్పిన డైలాగ్స్ కొత్త విలనిజాన్ని బయటకి చూపించాయి. 1998 సురేష్ ప్రొడక్షన్స్, డి.సురేష్ బాబు నిర్మాణం తిరుపతి స్వామి దర్శకత్వంలో గణేష్ చిత్రం విడుదలయ్యింది. ఈ సినిమాలో వెంకటేష్, రంభ, మధుబాల హీరో, హీరోయిన్లుగా నటించారు. దర్శకుడు సురేష్ కృష్ణ శిష్యుడైన తిరుపతి స్వామి లోగడ విలేఖరి, ఒక అభ్యుదయవాది. ఆయన అతని జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకున్న కథను సురేష్ బాబుకు చెప్పడంతో ఆయనకు నచ్చి తిరుపతి స్వామితో సినిమా చేయడానికి ఒప్పుకున్నారు…

మెడికల్ మాఫియా నేపథ్యంగా సాగే కథలో.. ఆరోగ్య శాఖ మంత్రిగా సాంబశివుడు పాత్రలో కోట శ్రీనివాసరావు నటించిన తీరు.. అనన్య సామాన్యం. గణేష్ చిత్రంలో ఒక సన్నివేశంలో.. గుడ్లగూబ లాంటి కళ్ళు.. పూర్తిగా వెంట్రుకలు లేని గుండుతో కోటా కనిపించిన తీరు… ప్రేక్షకులను భయబ్రాంతులకు గురి చేసిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కుప్ప తోట్లో దొరికిన.. ఎండకు ఎండిన.. వానకు తడిసిన.. 14 ఏళ్లకే హత్య చేసిన.. అంటే చెడ్డీ మీద మర్డర్ అన్నట్టు.. నేను బతకాలి తమ్మి… అని కోట సంభాషణ చెప్పిన తీరు, ఆయన నటన నభూతో నభవిష్యత్ అన్న రీతిలో ఉంటుంది. అందుకే ఆయన అభినయాన్ని చూసిన కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది. గాయం, గణేష్ చిత్రాల గాను రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట నంది పురస్కారం అందుకున్నారు. ఆయన నటనకు పరభాషా నటులు సైతం దాసోహం అన్నారు.