వాహినీ స్టూడియో అధినేత బి.నాగిరెడ్డి తన కొడుకు పోయిన దుఃఖంలో కూడా అలా చేశాడంటే.!!

విజయ వాహినీ స్టూడియో అధినేతల్లో ఒకరైన బి.నాగిరెడ్డి అంటే తెలియని ఆనాటి నటులు ఎవరూ ఉండరు.వారు నాటిన విజయ వాహిని అనే చెట్టు నీడలో అనేక ఉత్తర, దక్షిణాది సినిమాలు చిత్రీకరణ జరిగాయి.అలా అనేక సినిమాలు ఘన విజయాన్ని సాధించాయి.ఆ తర్వాత తెలుగు చిత్రాల్లో మాత్రమే కాకుండా తమిళ, కన్నడ, హిందీ చిత్రాలను కూడా విజయ ప్రొడక్షన్స్ వారు నిర్మించడం జరిగింది.

చక్రపాణి మరణించిన తర్వాత బి.నాగిరెడ్డి హీరో సంజీవ్ కుమార్ తో నిర్మించిన యెహీ హై జిందగీ హిందీ చిత్ర నిర్మాణ క్రమంలో తన కొడుకు బి.ఎల్.ఎన్. ప్రసాద్ కూడా జోక్యం చేసుకొనేవాడు. ఈ సినిమా తరవాత సంజీవ్ కుమార్ తో స్వయంవర్ అనే మరో హిందీ చిత్రం నిర్మించిన అనంతరం విశ్రాంతి కోసం కొడైకెనాల్ వెళ్ళినప్పుడు బి.నాగిరెడ్డి పెద్దకొడుకు బి.ఎల్.ఎన్ ప్రసాద్ గుండెపోటుతో మరణించాడు.

ఈ సమయంలోనే ఏ.వి.ఎమ్ బ్యానర్ లో శరవణన్, సుబ్రహ్మణ్యన్ నిర్మాణంలో రాజశేఖర్ దర్శకత్వంలో చిరంజీవి నటించిన ‘పున్నమినాగు’ చిత్రం విడుదలకు సెన్సార్ బోర్డు నిరాకరించింది. ఆ తర్వాత సెన్సార్ బోర్డు వారు ఆ సినిమాని రివైజింగ్ కమిటీకి పంపించారు.

రివైజ్ కమిటీ సభ్యుల్లో ఎవరు కూడా అందుబాటులో లేకపోవడంతో తన కొడుకు చనిపోయి నాలుగైదు రోజులు మాత్రమే అయినా పుట్టెడు దుఃఖంలో కూడా బి.నాగిరెడ్డి స్పందించి సినిమా ఆగిపోతే నిర్మాతకు లక్షల్లో నష్టం జరుగుతుందని రివైజింగ్ కమిటీకి హాజరై ఆ సినిమా విడుదలకి సహకరించారు. 1980 జూన్ 13న ‘పున్నమినాగు’ విడుదలై సూపర్ హిట్ అయింది.