ఆ రోజుల్లో చిరంజీవికి ఈ కన్నడ విలన్స్ లో ఎవరు సమవుజ్జీలుగా నిలిచారు.?!

1980 దశకంలో చిరంజీవి ఒకే సంవత్సరంలో అనేక చిత్రాల్లో నటించేవారు. అయితే రావు గోపాలరావు, సత్యనారాయణ వంటి విలన్స్ తో కూడా చిరంజీవి నటించారు. అప్పటి సమకాలీన హీరోలందరితో ఈ విలన్స్ కలిసి నటించారు.

అయితే ప్రేక్షకులకు విసుగు పుట్టడమో లేదా ఏదైనా మార్పు కోసమో దర్శకులు ఇతర భాష చిత్రాల్లో నటించే విలన్స్ ని తెలుగు పరిశ్రమలోకి ఆహ్వానించడం జరిగింది. అలా 1985లో టి.కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ప్రతిఘటన చిత్రంలో కొత్త ప్రతి కథానాయకుడి కోసం టి.కృష్ణ వేట ప్రారంభించారు.

ఆ క్రమంలో టి.కృష్ణ కన్నడ చిత్రాల్లో నటించే చరణ్ రాజు ను కలిశారు. తన సినిమాలో ఒక విలన్ పాత్ర ఉంది చేయాలని ఆయనను కోరారు. కానీ చరణ్ రాజ్ తనకు తెలుగు రాదని ముందు సున్నితంగా చేయానని చెప్పారు. కానీ టి.కృష్ణ పట్టుపట్టడంతో ప్రతిఘటన చిత్రంలో చరణ్ రాజ్ నటించారు. ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవితో “దొంగ మొగుడు”, “స్వయంకృషి”చిత్రాల్లో ప్రతి కథానాయకుడిగా కనిపించారు. ఈ రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి.

1981 శ్రీకర్ ప్రొడక్షన్స్, ఎస్.ఏ చంద్రశేఖర్ దర్శకత్వంలో “చట్టానికి కళ్ళు లేవు” చిత్రం విడుదలయింది. ఇందులో చిరంజీవి, మాధవి హీరో, హీరోయిన్లుగా నటించారు. లక్ష్మి పోలీస్ పాత్రలో కనిపించారు. జావేద్ గా కన్నడ ప్రభాకర్ విలన్ పాత్రలో కనిపించారు. ఈ సినిమాతో ప్రారంభమైన చిరంజీవి కన్నడ ప్రభాకర్ ల సినీ ప్రయాణం ఎంతో కాలం కొనసాగింది. కన్నడ ప్రభాకర్ తెలుగు లో విలన్ గా చిరంజీవితో ఎక్కువ సినిమాల్లో నటించారు. జ్వాల, పులి బెబ్బులి, బిల్లా రంగా, కిరాతకుడు, రాక్షసుడు, పసివాడి ప్రాణం, కొదమసింహం, జగదేకవీరుడు అతిలోకసుందరి వంటి సూపర్, డూపర్ హిట్ చిత్రాల్లో విలన్ గా కన్నడ ప్రభాకర్ నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టు కున్నారు.

పోరాట సన్నివేశాల్లో… కన్నడ ప్రభాకర్ ను వెనుకనుంచి గమనిస్తే.. అచ్చు చిరంజీవిని తలపించేది. ఒక విధంగా చెప్పాలంటే చిరంజీవి, కన్నడ ప్రభాకర్ ల బాడీలాంగ్వేజ్ ఒకే విధంగా ఉంటుంది. సినిమా మధ్యలో వచ్చే లాంగ్ షాట్ ఫైట్ సీన్స్ లో చిరంజీవిని, కన్నడ ప్రభాకర్ ని గుర్తుపట్టడం కష్టంగా ఉండేది. ఓకే హైట్, ఓకే వేయిట్ ఇద్దరు ఉండడంతో వారిని గుర్తుపట్టడంలో ప్రేక్షకులు తికమక పడేవారు. అయితే చరణ్ రాజ్, కన్నడ ప్రభాకర్ లు చిరంజీవితో నటించిన అన్ని చిత్రాలు దాదాపుగా ఘన విజయం సాధించాయి.