స్టార్ హీరోయిన్ అయిన రాధ కూతురు కార్తీక సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాకపోవడానికి అదే పెద్ద కారణమా..?

సినిమా ఇండస్ట్రీలో నట వారసులు, నట వారసురాళ్లు ఎంట్రీ ఇస్తుండటం చాలా కామన్. కానీ వారి ఇమేజ్ తమ వారసుల మీద మొదటి సినిమాకే పనిచేస్తుంది. రెండవ సినిమా నుంచి సొంతగా తెడ్డేసుకొని నావను నడపాల్సిందే. లేదంటే నావ మధ్యలోనే నిలిచిపోతుంది. అలా చాలామంది స్టార్ హీరోయిన్స్, హీరోల కొడుకులు, కూతుళ్లు హీరో, హీరోయిన్స్‌గా ఇండస్ట్రీలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చి పట్టుమని పది సినిమాలు చేయకుండానే అడ్రస్ లేకుండా మాయమై పోతున్నారు. దీనికి కారణాలు విశ్లేషిస్తే చాలానే ఉన్నాయని ప్రముఖులతో పాటు అభిమానులు, ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

ఇప్పటికే చాలామంది నటవారసులు సౌత్ సినిమా ఇండస్ట్రీకి వచ్చి ఫేడౌట్ అయ్యారు. అలాంటి వారి లిస్ట్‌లో సీనియర్ స్టార్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక కూడా చేరింది. రాధ సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ కృష్ణ, అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేశ్ లాంటి స్టార్స్ సరసన నటించి ఎన్నో బ్లాక్ బస్టర్స్ అందుకుంది. ఒక దశలో రాధ ఇటు తెలుగులో అటు తమిళంలో ఓ వెలుగు వెలిగింది. ఇద్దరు హీరోయిన్స్ ఉన్న సినిమాలో నటించినా రాధకి దక్కే క్రేజ్ దక్కించుకుంది. అంతగా తన అందంతో పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. అందుకే స్టార్ హీరోలు కూడా రాధ కావాలని అడిగి అవకాశాలు ఇచ్చిన సందర్భాలున్నాయి.

మెగాస్టార్ చిరంజీవి – రాధ కాంబినేషన్‌లో చాలా బ్లాక్ బస్టర్ సినిమాలొచ్చాయి. వీరిద్దరిది హిట్ పెయిర్. నాగార్జునతో రాధ నటించిన సినిమాలు సూపర్ హిట్ సాధించాయి. ఆ క్రేజ్ ఇప్పటికీ ఉంది. రాధ సెకండ్ ఇన్నింగ్స్ ఇస్తారని చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే తను రీ ఎంట్రీ ఇవ్వకుండా తన కూతురు కార్తీకను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అక్కినేని నాగ చైతన్య డెబ్యూ సినిమా జోష్ సినిమాతో రాధ కూతురు కార్తీక టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

అయితే ఈ సినిమా ఫ్లాప్‌గా మిగిలింది. మనవాళ్ళకి సెంటిమెంట్స్ ఎక్కువ. ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ కూతురైనా డెబ్యూ సినిమా పోతే మళ్ళీ మేకర్స్ పట్టించుకోరు. కార్తీక విషయంలో కూడా టాలీవుడ్‌లో ఇదే జరిగింది. పైగా రాధ కూతురు అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు. కానీ కార్తీక అందంలో గానీ, పర్ఫార్మెన్స్‌లో గానీ తల్లి సంపాదించుకున్న క్రేజ్‌లో ఓ పది శాతం కూడా సంపాదించుకోలేకపోయింది. ఒకరకంగా తల్లి క్రేజ్ కార్తీకకి మైనస్ అయిందనే చెప్పాలి. జనాలు పెట్టుకున్న ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌కి కార్తీక రీచ్ అవలేకపోయింది.

తమిళ డబ్బింగ్ సినిమా రంగం రెండు భాషలలో సూపర్ హిట్‌గా నిలిచినా కార్తీక మాత్రం వరుసగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది. అటు తమిళంలో గానీ, ఇటు తెలుగులో గానీ కార్తీకకి ఇప్పుడు చెప్పుకునేంత గొప్ప అవకాశాలు లేవు అని సమాచారం. మొత్తానికి టాలీవుడ్‌లో నట వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన కార్తీక ఇంత త్వరగా ఫేడౌట్ అవుతుందని మాత్రం ఎవరూ భావించలేదు. చూడాలి మరి అదృష్టం కొద్ది ఏదైనా ఓ మంచి కథా బలమున్న పాత్రలో అవకాశం అందుకొని భారీ హిట్ దక్కితే కెరీర్ ఏదైనా ఊపందుకుంటుందేమో. లేదంటే ఇక ఈమె కెరీర్‌కి ఫుల్‌స్టాప్ పడినట్టే.