పాట రాసినందుకు డబ్బులు అడిగితే.. నీకు చాన్స్ ఇవ్వడమే ఎక్కువ మళ్ళీ డబ్బులు అడుగుతావా అని వెళ్లగొట్టారు..?! – మిట్టపల్లి సురేందర్

“రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్త బంధం నీకు తెలియదురా.. తెలిసుంటే చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చి చేయగలవా నీ మహిమలు..!! అనే పాట తెలంగాణ ఉద్యమ కాలంలో లో ప్రతి ఒక్కరిని కదిలించింది. ఆ తర్వాత ఈ పాటను నారాయణమూర్తి దర్శకత్వంలో వచ్చిన పోరు తెలంగాణ చిత్రంలో పొందుపరిచారు. అలా ఆ పాటకి ప్రముఖ రచయిత మిట్టపల్లి సురేందర్ కి నంది అవార్డు వచ్చింది.

ఆ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చదువుకుంటూ తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేసిన జార్జిరెడ్డి జీవిత కథను ఆధారంగా చేసుకుని జీవన్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన జార్జిరెడ్డి చిత్రంలో “వాడు నడిపే బండి రాయల్ ఎన్ ఫీల్డ్.. వాడి చూపుల్లో ఉంది చేగువేరా ట్రెండ్..” అనే పాట అందరికీ తెలిసిందే. ఈ పాటను కూడా ప్రముఖ గీత రచయిత మిట్టపెల్లి సురేందర్ రాశారు.

ఇలాంటి అద్భుతమైన పాటలు రాసిన ఈ రచయిత తెలుగు సినిమా పాట రాసే తొలిరోజుల్లో కొన్ని దురదృష్టకరమైన సంఘటనలు ఎదుర్కొన్నారు. 2005 తేజ దర్శకత్వంలో వచ్చిన ‘ధైర్యం’ చిత్రం కోసం ‘బైపిసి బద్మాష్ పోరి బాగుంది మామ..” అనే పాట మిట్టపల్లి సురేందర్ రాశారు. ఆ తర్వాత రికార్డింగ్ జరిగి పాటలు విడుదలయ్యాయి. ఆ పాటకు మంచి పేరు వచ్చింది. అయితే దర్శకుడు తేజ ఆ పాట రాసినందుకు డబ్బులు పంపించానని మిట్టపెల్లి సురేందర్ కు చెప్పారు. అయితే మిట్టపెల్లి సురేందర్ ను దర్శకుడు తేజకు పరిచయం చేయించిన మధ్యవర్తికి కాయిన్ బాక్స్ నుంచి ఫోన్ చేసి డబ్బుల గురించి సురేందర్ అడిగాడు.

దర్శకుడు తేజను కల్పించడం.. పైగా పాట రాసే అవకాశం ఇవ్వడం నీకు ఎక్కువ.. డబ్బుల విషయం వస్తే నువ్వే నాకు ఇవ్వాలన్నారు. తిరిగి ఇంటికి (వరంగల్) వెళదామంటే కనీసం నా దగ్గర బస్సుకు డబ్బులు లేవని చెప్పినా కూడా.. సదరు మధ్యవర్తి డబ్బుల విషయంలో ఇంకొకసారి నాకు ఫోను చేయకని చెప్పడంతో.. మిట్టపల్లి సురేందర్ అవాక్కయ్యారు. ఒక్కసారిగా ఈ రచయిత కళ్ళలో నీళ్ళు తిరిగాయి. కన్నీళ్లను దిగమింగుకుని కాలును తన ఊరి వైపు తిప్పాడు.

సినిమా అవకాశాలు కొందరికి తివాచీ పరిస్తే.. మరి కొందరికి ముళ్లబాటల దర్శనమిస్తాయి. ఏవగింపు ఈసడింపుల ఈ సినీ రంగుల ప్రపంచంలో ఇమిడిపోయి ఇరుకు జీవితాన్ని అనుభవించడం కంటే జానపదాలతో జనాలకు దగ్గరయ్యాను వెళ్లి వారితోనే మమేకమై కొనసాగుతానని తిరిగి ఇంటికి వచ్చినప్పటికీ.. మళ్లీ సినీ కళామతల్లి తిరిగి మిట్టపెల్లి సురేందర్ ని ఆహ్వానించింది. అలా రాజన్న, అనగనగా ఒక చిత్రం, తుపాకి రాముడు, జార్జి రెడ్డి అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చే ‘లవ్ స్టోరీ’ చిత్రం లో “నీ చిత్రం చూసి నా చిత్తం చెదిరి…నే చిత్తరువైతిరయ్యో”.. అనే పాటతో మిట్టపల్లి సురేందర్ సినీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు.