Jayaprakash Reddy : సమరసింహారెడ్డి షూటింగ్ లొ‌కేషన్ లో ఒకే ఒక్క కుర్చీ.. బాలయ్య సంస్కారానికి అది ఒక నిదర్శనం. : జయప్రకాశ్ రెడ్డి

Jayaprakash Reddy : ప్రముఖ నటుడు జయప్రకాశ్ రెడ్డి ఏసీ కళాశాలలో ఉన్నప్పుడు ఓ సీనియర్‌ స్టేజీ రాచరికం అనే నాటకంలో అడవేషం వేసే అవకాశం ఇచ్చాడు. అది రాజూ, రాణీ, సేవకీ, సేవకుడు ఉండే నాటకం. పాటలూ, ఆటలూ అన్నీ నేర్చుకొని సేవకి పాత్ర చేశాడు. నాటకం అయ్యాక అబ్బాయిలు ఎత్తుకుని ముద్దులు పెట్టేసుకున్నారు. మూడు నాలుగు రోజుల తర్వాత నోటీసు బోర్డు చూస్తే, యూనివర్సిటీ ప్రకటించిన బహుమతుల్లో ఉత్తమ నటుడు జయప్రకాశ్‌‌రెడ్డి అని రాసి ఉంది. అప్పటి నుంచి నాటకాలు వేయడం, వేయించడమే ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఉద్యోగంలో చేరాక కూడా నాటకాలను వదులుకోలేదు.

ఒకసారి జయప్రకాష్ రెడ్డి నల్గొండలో డాక్టర్ రాజారావు మెమోరియల్ ఆర్ట్స్ అసోషియేషన్ తరపున అనేక నాటికలలో నటించి, దర్శకత్వం వహించాడు. నల్లగొండ జిల్లా పరిషత్ ఆవరణలో ప్రజా పోరు పత్రిక మొదటి వార్షికోత్సవం సందర్భంగా మాడభూషి దివాకర్ బాబు రాసిన గప్ చుప్ అనే నాటకాన్ని ప్రదర్శిస్తుండగా దాసరి నారాయణరావుకు అతని నటన నచ్చి నిర్మాత రామానాయుడుకు పరిచయం చేశాడు. అప్పుడు హైదరాబాదులో రామానాయుడు, అతని కుటుంబసభ్యుల ముందు ఆ నాటకాన్ని ప్రదర్శించాడు. అలా ఈయన 1988లో విడుదలైన “బ్రహ్మపుత్రుడు” చిత్రంతో తెలుగు సినీరంగానికి పరిచయమయ్యాడు. అప్పటినుండి 1992 వరకు 25 సినిమాల్లో నటించాడు. కానీ ఆర్థికంగా ఒడిదుడుకులు రావడంతో మళ్లీ గుంటూరుకు వెళ్లి మున్సిపల్ స్కూల్‌లో టీచర్‌గా పనిచేశాడు. ఉదయం ఆరింటి నుంచి ట్యూషన్లు చెప్పడం, బడికి వెళ్లడం, మళ్లీ రాత్రి తొమ్మిదింటి వరకూ ట్యూషన్లు ఇలా జీవితం సాగింది.

అనుకోకుండా ఓసారి హైదరాబాదు వచ్చినప్పుడు రామానాయుడు కలిసి 1997లో “ప్రేమించుకుందాం రా” అనే సినిమా ద్వారా మరో అవకాశం కల్పించగా, ఆ చిత్రం ప్రతినాయకునిగా ఇతనికి మంచి పేరు తీసుకునివచ్చింది. తరువాత 1999లో బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు. ఆమధ్య ఓ ప్రముఖ ఛానల్ కి జయప్రకాశ్ రెడ్డి ఇంటర్వ్యూ ఇస్తూ… సమరసింహారెడ్డి చిత్ర షూటింగ్ జరుగుతున్న సమయంలో లొకేషన్ లో ఒకే ఒక కుర్చీ అందులో బాలయ్య కూర్చున్నాడు.

నేను సినిమాలోని నా సీన్ పూర్తి చేసుకుని అక్కడికి వచ్చాను. బాలయ్య కంటే నేను వయస్సులో కొద్ది సంవత్సరాలు సీనియర్ అయినప్పటికీ రండి గురువుగారు కూర్చుండని వినయంగా బాలయ్య పిలిచారు. అలా ఆయన నా పట్ల గౌరవాన్ని చూపడం నాకు సంతోషాన్ని ఇచ్చింది. అలాగే సమరసింహారెడ్డి సినిమా విజయవంతమైన తర్వాత ప్రెస్ మీట్ పెట్టి నంది అవార్డు ఆయనకు (బాలయ్య) రాకపోయినా ఫర్వాలేదు. కానీ నాకు రావాలంటూ చెప్పడం మరింత ఆనందాన్నిచ్చిందని జయప్రకాశ్ రెడ్డి ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.