తెలంగాణ రైతులకు కేసీఆర్ శుభవార్త.. ఖాతాల్లో నగదు జమ..?

తెలంగాణ రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ అదిరిపోయే శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో రైతు బంధు స్కీమ్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. పంటలు సాగు చేసినా, చేయకపోయినా రైతుల ఖాతాల్లో నగదు జమ కానుంది. ఎకరాకు 5 వేల రూపాయల చొప్పున ప్రభుత్వం కోటీ 45 లక్షల ఎకరాలకు రైతుబంధు సాయం అందించింది. రబీ సీజన్ రెండు నెలల క్రితమే ప్రారంభమైనా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా సీఎం కేసీఆర్ పెట్టుబడి సాయం అందించేందుకు సిద్ధం కాలేదు.

మరికొన్ని రోజుల్లో 2020 ముగుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ రైతులకు పెట్టుబడి సాయం అందించే దిశగా అడుగులు వేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎకరాకు 5వేల రూపాయల చొప్పున ప్రభుత్వం రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనుంది. ఖరీఫ్ సీజన్ లో ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ అమలు కోసం ఏకంగా 7,251 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఇప్పుడు కూడా అంతే మొత్తం నిధులను ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుందని సమాచారం.

గత ఏడాది అందాల్సిన రైతుబంధు సాయం ఈ సంవత్సరం జనవరి మొదటి వారంలో జమైంది. గత రెండు నెలలుగా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నారు. రేపు వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. సీఎం సమీక్ష అనంతరం రైతుబంధు నిధులకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 65.70 లక్షల ఎకరాల సాగు లక్ష్యాన్ని వ్యవసాయ శాఖ ప్రణాళిక రూపొందించినా సాయం మాత్రం విస్తీర్ణం మొత్తానికి అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

రైతుబంధు స్కీమ్ ద్వారా అందుతున్న సహాయం రైతులకు పెట్టుబడి సాయంగా పనికి వస్తోంది. విత్తనాలు, పురుగుమందుల కోసం వెచ్చించే ఖర్చులు రైతులపై భారాన్ని కొంతవరకు తగ్గిసున్నాయి. రాష్ట్రంతో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుస్తున్న సంగతి తెలిసిందే.