Kodanda Ramireddy : హీరో కృష్ణతో ఖైదీ చిత్రం తీయాలనుకోలేదు.. అసలు ఏం జరిగిందంటే.. : కోదండరామిరెడ్డి.

Kodanda Ramireddy : చిరంజీవి – కోదండరామిరెడ్డి కాంబినేషన్ లో న్యాయం కావాలి, కిరాయి రౌడీలు శివుడు శివుడు శివుడు, ప్రేమ పిచ్చోళ్ళు.. చిత్రాలు విడుదలయ్యాయి. మరొక బ్లాక్ బస్టర్ సినిమా వీరి కాంబినేషన్లో వచ్చింది… అసలు ఖైదీ చిత్రం విడుదల కంటే ముందు ఏం జరిగిందంటే… “కిరాయి రౌడీలు” లాంటి హిట్ చిత్రంతో చిరంజీవి.. కృష్ణతో “కిరాయి కోటిగాడు” లాంటి సూపర్ హిట్టుతో కోదండరామిరెడ్డి మంచి స్వింగ్ లో ఉన్నారు. ఒకరోజు నెల్లూరుకు చెందిన ప్రముఖ డాక్టర్ తిరుపతిరెడ్డి తమ వాస్తవ్యుడైన దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డిని కలవడం జరిగింది. వీరిద్దరు కలిసి ఒక సినిమాను రూపొందించాలనుకున్నారు. తమ ప్రాంతంలో కొంతకాలం నివాసం ఉన్న చిరంజీవి హీరోగా ఒక సినిమా రూపొందించాలనుకున్నారు.

యాక్షన్ చిత్రాల కథా రచయిత “వియత్నం వీడు సుందరం” ఎన్నో రకాలైన కథలను దర్శక నిర్మాతలకు వినిపించారు. కానీ అవేవి వారికి నచ్చలేదు. చిరంజీవి గారు అంతకుముందే దర్శక, నిర్మాతలకు 1983 జూన్ 15 నుంచి డేట్స్ ఇవ్వడం జరిగింది. జూన్ 8వ తేదీ వరకు కూడా కథ ఫైనలైజ్ కాలేదు.అప్పుడు నిర్మాతలు తిరుపతిరెడ్డి, ధనుంజయ రెడ్డి, నరసారెడ్డి పరుచూరి బ్రదర్స్ ని కలవడం జరిగింది.

జూన్ 10వ తేదీన తిరుపతిరెడ్డి తను చూసిన “ఫస్ట్ బ్లడ్” అనే ఆంగ్ల చిత్రం సీడీని పరుచూరి బ్రదర్స్ కి చూపించి దీన్ని ఆధారంగా చేసుకొని ఒక కథ రాయండని చెప్పడం జరిగింది. జూన్ 15 కు కేవలం ఐదంటే ఐదు రోజులు మాత్రమే సమయం ఉంది. మద్రాసులో నివాసం ఉంటున్న ప్రముఖ నటుడు నూతన్ ప్రసాద్ మేడపై గదిలో రాత్రింబవళ్ళు కష్టపడి పరుచూరి బ్రదర్స్ ఒక కథ సిద్ధం చేశారు. అలా వారు రాసిన కథే ఖైదీ చిత్రం.

1982 లో “ఫస్ట్ బ్లడ్” విడుదలయిన ఆ చిత్రంలోని కొన్ని సన్నివేశాలు ఖైదీ చిత్రంలో కొద్ది మార్పులతో కనిపిస్తాయి. మిగతా చిత్రంలో కథానాయకుని ఆహార్యం, శారీరక భాష, ఖైదీ చిత్రం అడవిలో చిరంజీవి చేసిన సాహసాలు, సంఘటనలు ఆంగ్ల చిత్రం ఫస్ట్ బ్లడ్ ను పోలి ఉంటాయి.. 1983 అక్టోబర్ 28న విడుదలైన ఈ ఖైదీ సినిమా యాక్షన్ చిత్రాలకు ఎర్రతివాచీ పరిచింది. ఇంకా చెప్పాలంటే చిరంజీవి సినీ చరిత్రలో ఒక మైలు రాయిగా మిగిలిపోయింది.

అయితే కోదండరామిరెడ్డి ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. హీరో కృష్ణతో ఖైదీ చిత్రం రూపొందించాలనుకున్నారని యాంకర్ అడగగానే… ఆనాటి జ్ఞాపకాలను వివరిస్తూ.. చిరంజీవి అప్పుడు నిర్మాతలకు ఇచ్చిన డేట్స్ దగ్గర పడడంతో ఖైదీ చిత్ర కథ కేవలం ఐదు రోజుల్లో రూపొందించబడిందని.. ముహూర్తపు సన్నివేశాన్ని జైలులో సాధారణంగా జైలు ఖైదీకి షర్ట్, ప్యాంట్ కాకుండా డిఫరెంట్ గా మరొకటైతే బాగుంటుందని చిరంజీవి చెప్పడంతో.. అప్పటికప్పుడు ఆయన ఇంటి నుంచి నల్ల టీ షర్ట్, నల్లటి ప్యాంట్ తెప్పించారు. ఆ టీ షర్ట్ రెండు చేతులు కత్తిరించి అదే ప్యాంట్ పై టీ షర్ట్ వేసుకొని చిరంజీవి బెల్టు పెట్టుకున్నారని.. ఆ కాస్ట్యూమ్స్ పూర్తిగా చిరంజీవి ఆలోచనేనని.. ఇకపోతే ఖైదీ చిత్రాన్ని మరో హీరోతో నిర్మించాలనుకోలేదని ఆ ఇంటర్వ్యూలో దర్శకుడు కోదండరామిరెడ్డి వివరించారు.