తల్లిదండ్రులకు చెప్పకుండా సినిమా చాన్సుల కోసం ఇంటి నుంచి మద్రాసు వెళ్లిన సిల్క్ స్మిత !

సినిమాలలో నటించాలనే తపన ఆశ ఎంతోమందిని ఇండస్ట్రీ వైపు మళ్లించింది. ఈ క్రమంలోనే చాలామంది నటీనటులు ఇండస్ట్రీలోకి వచ్చి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా గుర్తింపు సంపాదించుకున్న వారిలో నటి సిల్క్ స్మిత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సిల్క్ స్మిత ఎన్నో సినిమాలలో వ్యాంప్ ఆర్టిస్ట్ గా, పలు సినిమాలలో ఐటెం సాంగ్ లో నటిస్తూ ఎంతో మందిని ఆకర్షించింది.

ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సిల్క్ స్మిత ఆత్మహత్య చేసుకోవడం అందరిని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈమె తనకు నటన పై ఉన్న ఆసక్తి తనని ఇండస్ట్రీ వైపు నడిచేలా చేసింది. నిజానికి సిల్క్ స్మిత అసలు పేరు విజయలక్ష్మి. ఈమె తల్లిదండ్రులు శ్రీరామమూర్తి, నరసమ్మ. వీరు ఏలూరు దగ్గర ఓ గ్రామంలో నివసించే వారు.అయితే సిల్క్ స్మిత సమీప బంధువు అన్నపూర్ణమ్మ అనే మహిళకు పిల్లలు లేకపోవడంతో విజయలక్ష్మిని దత్తత తీసుకుంది.

స్కూల్ కి వెళ్తున్న సమయంలో విజయలక్ష్మిని చూసి అన్నపూర్ణమ్మ తను సినిమాల్లో నటిస్తే ఎంతో మంచి పేరు సంపాదించుకుంటుంది. ఆమె మత్తుగా కళ్ళు అందరిని ఆకర్షిస్తాయి, ఎలాగైనా తనని సినిమా ఇండస్ట్రీ వైపు తీసుకువెళ్లాలని భావించింది. ఈ క్రమంలోనే విజయలక్ష్మి కూడా తనకు సినిమాల్లో నటించాలని ఉందని చెప్పడంతో తనకు మార్గం సులభం అయింది.

అలా విజయలక్ష్మి తన తల్లిదండ్రులకు చెప్పకుండా తన పెంపుడు తల్లితో కలిసి మద్రాస్ బయలుదేరారు. మద్రాసు వెళ్ళిన తర్వాత ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ ఉండే సిల్క్ స్మితను తమిళ దర్శకుడు విను చక్రవర్తి చూసి ఈమెకు భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది అంటూ చక్రవర్తి తన భార్య కూడా ఆర్టిస్ట్ కావడంతో ఆమెకు కొన్ని మెలకువలు నేర్పించారు.

ఈ క్రమంలోనే విను చక్రవర్తి దంపతుల సహకారంతో సిల్క్ స్మిత 1979లో ‘ఇనయేటేడి’ అనే మలయాళ చిత్రంలో క్యాబరే డాన్సర్ కేరక్టర్ చేసింది. ఈ సినిమా తన జీవితాన్ని మార్చి వేసిందని చెప్పవచ్చు.ఆ తర్వాత ఇండస్ట్రీలో వరుస అవకాశాలను సంపాదించుకుంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న సిల్క్ స్మిత కొన్ని కారణాల వల్ల 1996 మద్రాసులోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.