Maganti Murali Mohan : చిన్న వ్యాపారంతో మొదలు పెట్టి జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకున్న మురళి మొహాన్ ప్రయాణం…

Maganti Murali Mohan : మురళి మోహన్… ఈయన గురించి తెలియని తెలుగు సినీ అభిమానులు వుండరు. 1973 లో అట్లూరి పూర్ణచంద్రరావు గారు నిర్మించిన ‘జగమేమాయ’ చిత్రంతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశాడు. తరువాత వచ్చిన దర్శక రత్న దాసరి నారాయణరావు 1974లో తీసిన ‘తిరుపతి’ సినిమా ద్వారా మురళి మోహన్ కు నటునిగా మంచి గుర్తింపు వచ్చింది. దాదాపు నాలుగు దశబ్దాల పాటు సుమారు 350 సినిమాలలో నటించారు. చిరు వ్యాపారిగా తన ప్రయాణాన్ని చిన్న వయసులోనే మొదలుపెట్టి నటుడుగా అభిమానులలో చెరగని ముద్ర వేసుకొని, జీవితంలో అత్యున్నత స్థానానికి చేరుకున్నారు మురళి మోహన్.

20 ఏళ్ళ వయసులోనే వ్యాపార మొదలుపెట్టి…

బహుముఖ ప్రజ్ఞాశాలిగా తెలుగు వారిలో చెరగని ముద్ర వేసుకున్న మాగంటి మురళి మోహన్ పశ్చిమ గోదావరీ జిల్లాలోని చాటపర్రు గ్రామంలో జన్మించాడు. ఉన్నత చదువులు చదకపోయినా 20 ఏళ్ళ వయసులోనే వ్యాపారం వైపు అడుగులు వేసాడు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించడం పై అవగాహనతో ఎలెక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించాడు. వ్యాపారం చేస్తూనే సినిమాలపై మక్కువతో నాటకాల వైపు అడుగులు వేసాడు. తరువాత 1973 లో సినిమాలలో అవకాశం రావడంతో వెనుతిరిగి చూసుకునే పనిలేకుండా ముందుకు సాగిపోయారు.

అంతటితో ఆగిపోకుండా తన సోదరుడు కిశోర్‌తో కలిసి జయభేరి ఆర్ట్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, దాని ద్వారా ఇప్పటివరకు 25 చిత్రాలను నిర్మించాడు. అంతేకాకుండా నేషనల్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవెలప్‌మెంట్ కార్పొరేషన్లలో వివిధ హోదాలలో సేవలు కూడా అందించాడు. వీటితో పాటు 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా)కు గౌరవాధ్యక్షునిగా కూడా వ్యవహరించడం జరిగింది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో కూడా ప్రవేశించి జయభేరి గ్రూప్ సంస్థను స్థాపించి దానికి ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నాడు. ముందుచూపుతో అప్పట్లో కొన్న కొన్ని ఎకరాల భూమి ఇప్పుడు వేలకోట్ల విలువ చేస్తున్నాయట.

రాజకీయాల్లో కూడా ప్రవేశించి 2009లో జరిగిన 15వ లోకసభ ఎన్నికలలో రాజమండ్రి లోకసభ నియోజకవర్గం నుండి తెలుగు దేశం అభ్యర్థిగా పోటీ చేసి, ఉండవల్లి అరుణ కుమార్ చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యాడు. తిరిగి 2014లో జరిగిన ఎన్నికలలో గెలిచి రాజమండ్రి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఇలా జీవితం లో ఒక్కో మెట్టు ఎక్కుతూ అత్యున్నత స్థానానికి రావడానికి, ఆయన పడ్డ కష్టం చాలా ముఖ్యమైనది. అంతేకాదు మురళి మోహన్ గారి జీవితం సినీ పరిశ్రమలో చాలా మందికి ఆదర్శంగా ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.