మహారాష్ట్రలో జికా వైరస్ కలకలం.. అక్కడ తొలి కేసు నమోదు.. !

కరోనా కారణంగా ప్రతీ ఒక్కరి జీవన విధానంలో పూర్తిగా మార్పులు సంభవించాయి. దీనికి తోడు ఫంగస్‌లు, డేల్టా వేరియంట్ భయపెడుతోంది. సెకండ్ వేవ్ కేసులు అక్కడక్కడ నమోదవుతున్నా.. మరీ విపరీతంగా మాత్రం లేవు. వచ్చే నెల నుంచి థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నందున ప్రతీ ఒక్కరు దాని భారి నుంచి రక్షించుకునేందుకు సిద్దంగా ఉన్నారు.

ఇదిలా ఉండగా తాజాగా జికా వైరస్ కలవరపెడుతోంది. ఇటీవల కేరళలో జికా వైరస్ కేసులు రాగా.. అదీ మహారాష్ట్రకు పాకింది. మహారాష్ట్రలో తొలి జికా వైరస్ కేసు నమోదైంది. రూరల్ పుణెలోని పురందర్‌లో ఓ మహిళకు పాజిటివ్ వచ్చింది. జికా వైరస్ లక్షణాలు ఉండడంతో ఐదుగురి శాంపిల్స్‌ను ల్యాబ్‌కు పంపించి పరీక్షలు చేయగా.. ఒకరికి పాజిటివ్ వచ్చింది. బెస్లార్ ప్రైమరీ హెల్త్ సెంటర్‌లో చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకోవడంతో ఇంటికి పంపించారు. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ జులై 30వ తేదీన ఆమెకు పరీక్షలు జరిపి జికా వైరస్‌తో పాటు చికెన్ గున్యా కూడా ఉన్నట్లు నిర్ధారించింది.

జికా వైరస్ అనేది దోమల వల్ల వచ్చే ఇన్ఫెక్షన్. జబ్బు తీవ్రత అనేది చాలా తక్కువగా అనిపించొచ్చు అని స్టేట్ సర్వేలెన్స్ ఆఫీసర్ డాక్టర్ ప్రదీప్ అవాతె అంటున్నారు. బాధితురాలి కుటుంబంలో మరెవరికీ జికా వైరస్ సోకలేదని అధికారులు తెలిపారు. ఐతే ముందు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి వైద్య సిబ్బంది వెళ్లి పరీక్షలు చేశారు. వారిలో కొందరికి చికెన్ గున్యా ఉన్నట్లు తేలింది. ఇన్ఫెక్షన్ సాధారణ లక్షణాలు ఒంటి నొప్పులు, కంటి శుక్లాలు, రెట్రో ఆర్బిటల్ పెయిన్, చర్మంపై మచ్ఛలు లాంటివి కనిపిస్తాయని వైద్యులు తెలిపారు. జికా వైరస్ అనేది దోమ కుట్టిన 14 రోజుల తర్వాత బయటపడుతుందని తెలిపారు.

ఎడిస్ ఈజిప్ట్ అనే దోమల జాతి ద్వారా ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తుంది. అందుకే వర్షా కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో సిబ్బంది చర్యలు తీసుకుంటున్నారు. జికా వైరస్ వ్యాప్తి కాకుండా అడ్డుకునేందుకు కఠినంగా శ్రమిస్తున్నామని.. సాధ్యమైనంత వరకూ హెల్త్ కేర్ అందిస్తామని జిల్లా అధికారి తెలిపారు.