చిరంజీవి చేతికి గాయం.. ఆందోళనలో అభిమానులు..?

మెగస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకగా చెప్పాల్సిన అవసరం లేదు. అటు తన వ్యక్తిగత జీవితంలో తన పని తాను చేసుకుంటూ.. ఇటు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్ లాంటి సేవా కార్యక్రమాలను ప్రారంభించి పేదలకు ఎంతో అండగా నిలిచాడు. కరోనా మహమ్మారి విజృంభించి తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ ఇబ్బంది పెడుతున్న సమయంలో ఆక్సిజన్ బ్యాంకు ద్వారా సేవలు అందించిన మెగా అభిమానులతో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు.

అన్ని జిల్లాల మెగా అభిమాన సంఘాల ప్రతినిధులు ఇందులో పాల్గొన్నారు. వారిని చిరంజీవి ప్రత్యేకంగా అభినందించారు. హైదరాబాద్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో చిరంజీవి పాల్గొనగా ఆయన కుడి చేతికి బ్యాండేజ్ కనిపించింది. దీంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ గురయ్యారు. కొన్ని క్షణాలపాటు ఆ బ్యాండేజ్ అభిమానులందరినీ కలవరపెట్టింది. ఏమైంది అని అభిమానులు చిరంజీవిని ప్రశ్నించగా చిరంజీవి అసలు విషయం చెప్పారు.

తన అరచేతికి చిన్నపాటి సర్జరీ అయినట్లు పేర్కొన్నాడు. కుడిచేతితో ఏ పని చేయాలన్నా కొద్దిగా నొప్పి, తిమ్మిరి అనిపిస్తుందని.. దానికి వైద్యుడిని సంప్రదించగా.. కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ అనే నరం మీద ఒత్తిడి పడటం వల్ల అలా అనిపిస్తోందని చెప్పారని చిరంజీవి అన్నారు. దానిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని డాక్టర్లు వెల్లడించినట్లు పేర్కొన్నారు. దీనికి వైద్యులు సర్జరీ చేయాలని చెప్పడంతో.. అపోలో ఆసుపత్రిలో కాస్మోటిక్ సర్జన్ వైద్యుడు సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగిందన్నారు.

ఈ సర్జరీ వల్లనే ప్రస్తుంతం జరుగుతున్న గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కి కూడా గ్యాప్ ఇచ్చానని అతడు వెల్లడించారు. ఫైట్ సీక్వెన్స్ చేయాల్సి ఉందని.. దానికి తాను 15 రోజుల పాటు గ్యాప్ తీసుకున్నానని.. నవంబర్ లో గాడ్ ఫాదర్ షూటింగ్ లో రెగ్యూలర్ గా పాల్గొంటానని ఆయన పేర్కొన్నాడు. ప్రస్తుతానికి అంతా సెట్ అయింది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదన్నారు. ఇక దీనిపై చిరంజీవి క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.