మోచేతితో అతడి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి.. ఫెన్సింగ్ ఎక్కి..!

కేబీఆర్‌ పార్కుబయట వాకింగ్‌కు వచ్చిన సినిమా నటి షాలూ చౌరాసియాపై గుర్తుతెలియని దుండగుడు దాడికి పాల్పడి.. ఆమె నోటికి గుడ్డలు అడ్డుపెట్టి ఆమె వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, గోల్డ్ రింగ్ లాక్కుని పరారయిన విషయం తెలిసిందే. దీనిపై మీడియాతో చౌరాసియా మాట్లాడారు.

కొండా పూర్‌లోని బొటానికల్‌ గార్డెన్స్​ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్స్​‍లో నివాసం ఉంటున్న తాను గత మూడు సంవత్సరాలుగా బంజారాహిల్స్​‍లోని కేబీఆర్‌ పార్కుకు వాకింగ్‌కు వెళ్తున్నానని.. ఆదివారం సాయంత్రం 6.30 ప్రాంతంలో కేబీఆర్‌ పార్కు బయట ఉన్న జీహెచ్‌ఎంసీ వాక్‌వేలో వాకింగ్ చేస్తున్నానని.. రాత్రి 8.40 ప్రాంతంలో వాకింగ్‌ చేస్తున్న తనను కొంతదూరం గుర్తు తెలియని యువకుడు అనుసరించాడని తెలిపింది.

నిర్మానుష్య ప్రాంతంలోకి రాగానే తనను వెనుక నుంచి అతడు గట్టిగా పట్టుకున్నాడని.. రెండు చేతులు వెనక్కి నెట్టి.. నోటికి గుడ్డలు అడ్డుపెట్టి.. బండారాయికి అదిమాడని తెలిపింది. భయపడిపోయిన తాను డబ్బులు ఇస్తానని చెప్పడంతో ఒక చేయిని వదిలాడని.. ఫోన్ పే చేస్తానని ఫోన్ తీసుకొని రెండు సార్లు 100 కు ఫోన్ చేశానని చెప్పింది.

అది గమనించిన దుండగుడు తన ఫోన్ ను లాక్కున్నాడని తెలిపింది. హెల్ప్ అని అరుస్తుండగా.. ముఖంపై దాడి చేసి.. బండరాయిపై తోశాడని తెలిపింది. ఈ క్రమంలో తాను మోచేతితో అతడి ప్రైవేట్ పార్ట్స్ పై కొట్టి ప్రధాన రహదారి వైపు ఉన్న ఫెన్సింగ్ వద్దకు చేరుకొని.. ఫెన్సింగ్ పైనుంచి దూకి హెల్ప్ అని అరవగానే కాఫీ షాప్ లో ఉన్న కొంతమంది అక్కడకు చేరుకున్నారని తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేబీఆర్ పార్క్ లో లైటింగ్ అమర్చాలని నటి కోరింది. ఇక దుండగుల దాడిలో డైమండ్ రింగ్, సెల్ ఫోన్ పోయినట్లు తెలిపారు.