Shekhar Master : తిండి లేక దొంగచాటుగా ఫంక్షన్స్ కి వెళ్లి తినేవాళ్ళం.. సెక్యూరిటీ గార్డ్ గా పనిచేయమన్నారు : శేఖర్ మాస్టర్

Shekhar Master : బ్యాక్ గ్రౌండ్ డాన్స్ మాస్టర్ గా కెరీర్ మొదలు పెట్టి కొన్ని సంవత్సరాలు బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ గా పనిచేసి ప్రస్తుతం కోరియోగ్రాఫర్ గా టాప్ పొజిషన్ లో ఉన్నాడు శేఖర్ మాస్టర్. అటు సినిమాల్లో డాన్స్ కంపోజ్ చేస్తూ హిట్స్ ఇస్తూనే మరోవైపు బుల్లితెర పై పలు షోలలో జడ్జిగా వ్యవహారిస్తున్నాడు. ముఖ్యంగా ఈటీవీ లో వస్తోన్న ఢీ డాన్స్ ప్రోగ్రామ్ ద్వారా బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు శేఖర్ మాస్టర్. ఆ షో లో మొదలు పెట్టి జడ్జి గా కొనసాగుతు, ఇక అప్పుడప్పుడు జబర్దస్త్ వంటి షోలలో కూడా జడ్జిగా వ్యవహారిస్తూ ఉండేవాడు. ప్రస్తుతం ఈటీవీ నుండి వెళ్ళిపోయి మా టీవీ లో కామెడి స్టార్స్ కామెడీ షోలో నాగబాబు తో కలిసి జడ్జిగా వ్యవహారిస్తున్నాడు. తన డాన్స్ కంపోజిషన్ కి సినిమాల్లో ఎన్నో అవార్డులు అందుకున్న శేఖర్ మాస్టర్ తన వ్యక్తిగత విషయాలను ఇటీవల ఇంటర్వ్యూ ల్లో పంచుకున్నారు.

కెరీర్ మొదట్లో తిండి కోసం కష్టాలు…

ఇంటర్మీడియట్ అయిపోయాక, డిగ్రీ చేరాల్సిన వాడిని డాన్స్ కోసం హైదరాబాద్ వచ్చేసాను. ఇక ఇంట్లో వాళ్ళని అడిగితే డబ్బులిస్తారు, కానీ వాళ్లకు నేను ఇబ్బందులు పడుతున్నట్లు తెలియడం నాకిష్టం లేదు. నీకెందుకు ఆ కష్టం వచ్చేయ్ అంటారు అందుకే వాళ్లకు నా ఇబ్బందులను చెప్పేవాడిని కాదు అంటూ శేఖర్ చెప్పారు. ఇక ఒక పూట బాగా తింటే చాలు అని ఆలోచించేవాళ్ళం. ఎక్కడైనా ఫంక్షన్స్ ఉంటే అక్కడికి వెళ్లి దొంగచాటుగా తినేవాళ్ళం. ఇక జూనియర్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాల్లో నటించాను.

అప్పుడు రోజుకి డెబ్భైఐదు రూపాయలు ఇచ్చేవారు, ఆది చాలా ఎక్కువ అనిపించేది. ఇక అలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులలో చాలా మంది స్నేహితులు, తెలిసిన వారు ఏదైనా జాబ్ చెయ్ నువ్వు ఇండస్ట్రీ లో సెటిల్ అయ్యేవరకు అంటూ చెప్పేవారు. సెక్యూరిటీ గార్డ్ లాగా పని ఇప్పిస్తానని నాకు చెప్పే వాళ్ళు కానీ నాకు డాన్స్ నుండి పక్కకి పోయి జాబ్ చేస్తే డైవర్ట్ అవుతానని భయం వేసేది, అందుకే ఇబ్బంది పడినా ఇందులోనే ఉండాలని అనుకునే వాడిని. ఇక గ్రూప్ డాన్స్ లో కూడా డాన్స్ చేశాను లారెన్స్ మాస్టర్, సుచిత్ర మాస్టర్ దగ్గర చేశాను అంటూ కెరీర్ లో పడిన కష్టాలను శేఖర్ మాస్టర్ చెప్పారు.