భారత్ లో కరోనా కొత్తరకం కేసులు నమోదు.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?

2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి విజృంభణ వల్ల ప్రజలు ఆరోగ్య పరంగా, ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో గత కొన్ని రోజుల నుంచి కరోనా కేసులు తక్కువ సంఖ్యలో నమోదవుతున్నాయి. మరికొన్ని రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుండటంతో వైరస్ ను అంతం చేయవచ్చని శాస్త్రవేత్తలు, ప్రజలు భావిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో భారత్ లో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కేసులు వెలుగులోకి వస్తుండటంతో ప్రజల గుండెల్లో గుబులు పుడుతోంది.

బ్రిటన్ నుంచి వచ్చిన ఆరుగురికి కొత్తరకం కరోనా సోకినట్లు వైద్య పరీక్షల్లో నిర్ధారణ అయింది. కరోనాతో పోలిస్తే కొత్తరకం కరోనా మరింత ప్రమాదం కాబట్టి ప్రజలు వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. నమోదైన ఆరు కేసులలో బెంగళూరులో మూడు కేసులు, హైదరాబాద్ లో రెండు కేసులు, పుణెలో ఒక కేసు నిర్ధారణ అయింది. కొత్తరకం కరోనా నిర్ధారణ అయిన వారిని అధికారులు ఐసోలేషన్ గదుల్లో ఉంచి వైద్య చికిత్స అందిస్తున్నారు.

ఆరు కేసులు వెలుగులోకి రావడంతో అధికారులు ఆ ఆరుగురితో కలిసి ప్రయాణించిన వారి వివరాలను, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరిస్తున్నారు. కరోనా వైరస్ తో పోలిస్తే కొత్తరకం కరోనా 70 శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఇప్పటికే అధికారులు బ్రిటన్ కు విమానాల రాకపోకలను నిలిపివేయడంతో పాటు పలు రాష్ట్రాల్లో రాత్రి సమయంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నారు.

భారీగా కొత్తరకం కరోనా కేసులు నమోదైతే మళ్లీ లాక్ డౌన్ అమలు చేయాల్సిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్లను వినియోగించడం, ప్రయాణాలకు వ్యక్తిగత వాహనాలను వినియోగించడం, వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావడం ద్వారా వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు.