కరోనా కోసం అతిగా ఆవిరి పడితే ప్రమాదమే.. ఎందుకంటే?

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎంతో మంది కరోనా వ్యాధి బారిన పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చాలామంది తరచూ ఆవిరి పట్టుకోవడం చేస్తుంటారు. అయితే తరచూ ఆవిరి పట్టుకోవడం ఎంతో ప్రమాదమని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం కరోనా వల్లభయభ్రాంతులకు చెందుతున్న ప్రజలు ఈ విధంగా ఎక్కువగా ఆవిరి పట్టడం వల్ల ప్రమాదం కొని తెచ్చుకుంటున్నారని నిపుణులు తెలియజేస్తున్నారు.

కరోనా బారిన పడినవారు ఆవిరి పట్టకుండా కేవలం సరైన వైద్యుల సలహాలను పాటించడం ద్వారా ఇంట్లో ఉంటూ కరోనా నుంచి బయటపడవచ్చు. మనలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటే కేవలం వైరస్ వ్యాప్తి చెందిన తొమ్మిది రోజులకు కరోనా నుంచి బయటపడవచ్చని నిపుణులు తెలుపుతున్నారు. కేవలం ముక్కుదిబ్బడ సమస్యతో బాధపడే వారు మాత్రమే ఆవిరిపట్టాలని,అది కూడా కేవలం రోజుకు రెండుసార్లు మాత్రమే రెండు రోజులపాటు ఆవిరిపట్టాలి అని తెలిపారు.

కొందరు ఆవిరి నీటిలోకి కర్పూరం వేయడం ద్వారా మన శరీరంలో ఆక్సిజన్ స్థాయిలు పెరుగుతాయని భావిస్తున్నారు. ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని నిపుణులు కొట్టిపారేస్తున్నారు. తరచూ ఆవిరి పట్టుకోవడం ద్వారా మన ముక్కులో ఉండే మ్యూకస్‌ పొరతో పాటు దానిపై ఉండే సీలియా పాడైపోయి వైరస్ తొందరగా మన శరీరంలోకి వెళ్ళడానికి దోహదపడుతుందని, అందుకోసమే ఆవిరి ఎక్కువగా పెట్టడం మరింత ప్రమాదకరం అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.