Super Star Krishna : మా ఇంట్లో ఆడుకున్న ఈ చిన్నపాప నాతో 31 సినిమాల్లో హీరోయిన్ గా చేసింది. : హీరో కృష్ణ.

మా నాన్న నిర్దోషి 1970 లో కె. వి. నందనరావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో కృష్ణ, విజయ నిర్మల ముఖ్య పాత్రల్లో నటించారు. అన్యాయంగా జైలు పాలైన తండ్రిని చిన్న పిల్లవాడైన అతని కొడుకు ఎలా విడిపించాడన్నది ఈ చిత్ర కథాంశం. ఈ సినిమా శ్రీదేవికి బాలనటిగా మొదటి సినిమా. ఇందులో శ్రీదేవి కృష్ణ, విజయ నిర్మలకు మేనకోడలు గా నటించింది. అలా సూపర్ స్టార్ కృష్ణ చిత్రంలో బాలనటిగా కనిపించిన శ్రీదేవి… అనేక చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత “పదహారేళ్ళ వయసు” సినిమాతో హీరోయిన్ గా ఆమెకు బ్రేక్ వచ్చింది. 1979లో కృష్ణ- శ్రీదేవి కాంబినేషన్ మొదలయ్యింది. అలా వీరి మొదటి చిత్రం.

“బుర్రిపాలెం బుల్లోడు” సినిమా బీరం మస్తాన్‌ రావు దర్శకత్వంలో కె. విద్యాసాగర్ నిర్మాణంలో ఘట్టమనేని కృష్ణ, శ్రీదేవి హీరోహీరోయిన్లుగా రూపొందిన 1979 నాటి తెలుగు చలన చిత్రం. ఇది బీరం మస్తాన్ రావు దర్శకత్వం వహించిన తొలి సినిమా. నిర్మాత విద్యాసాగర్ మస్తాన్ రావుకు తొలి సినిమా అవకాశం ఇస్తామన్నాకా ఆయనకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో మస్తాన్ రావు చొరవ తీసుకుని ఓ తమిళ చిత్రం డబ్బింగ్ చేయించి లాభాలు రప్పించారు. దాంతో ఈ సినిమా ప్రారంభమైంది.

మొదట “కష్మేవాదే” అన్న హిందీ సినిమాను కృష్ణ, జయప్రద జంటగా పునర్నిర్మిద్దామని భావించారు. అయితే ఆ సినిమా తెలుగు హక్కులున్న సుందర్ లాల్ నహతా, ఆయన కుమారుడు శ్రీకాంత్ మొదట రూ.60వేలకు ఇస్తామన్నారు. తర్వాత తామే స్వయంగా తీస్తామని మాట మార్చడంతో కథానాయికగా చేస్తానన్న జయప్రద కూడా వెనక్కితగ్గారు.

అలా అనూహ్యంగా శ్రీదేవి ఈ సినిమాలో హీరోయిన్ గా కృష్ణతో జత కట్టింది. అలా వీరి కాంబినేషన్ లో దాదాపు 31 సినిమాలు విడుదలయ్యాయి. అయితే హీరో కృష్ణ ఓ ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తూ.. శ్రీదేవి చెన్నైలో తమ పక్కింట్లో ఉండేదని ఆడుకోవడానికి తమ ఇంటికి వస్తుండేదని.. తాను సినిమా షూటింగులకు వెళ్తున్నప్పుడు లేదా వస్తున్నప్పుడు శ్రీదేవి మా ఇంటి ముందు ఆడుకుంటూ కనిపించేదని అలా మొదటగా “మా నాన్న నిర్దోషి” చిత్రంలో బాలనాటిగా కనిపించి “బుర్రిపాలెం బుల్లోడు” చిత్రంతో నాతో మొదటిసారి హీరోయిన్ గా చేసిందని అలా మా ఇద్దరి కాంబినేషన్లో 31 చిత్రాలు వచ్చాయి. శ్రీదేవి 85 తెలుగు చిత్రాల్లో నటించారని మిగతా హీరోల కంటే నాతోనే ఎక్కువ సినిమాలు చేసిందని సూపర్ స్టార్ కృష్ణ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన 31 చిత్రాలలో కొన్ని చిత్రాలు మినహాయిస్తే.. మిగతావన్నీ బాక్సాఫీస్ వద్ద విజయవంతం అయ్యాయి.