Tag Archives: Fine

రిజిస్ట్రేషన్ లేకుండా బైక్ నడుపుతున్నారా.. లక్షల్లో ఫైన్ కట్టాల్సిందే..?

సాధారణంగా బైక్ పై వెళ్లే వాహనదారులు లైసెన్స్, ఇతర డాక్యుమెంట్లు మరిచిపోయినా నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపినా చేసిన తప్పును బట్టి 100 రూపాయల నుంచి వేల రూపాయలు జరిమానా విధిస్తారు. అయితే ఒక వ్యక్తికి మాత్రం ఏకంగా లక్షల్లో ఫైన్ వేశారు. ఆ వ్యక్తి బైక్ రిజిస్ట్రేషన్ చేయించుకోకపోవడం వల్ల అంత భారీ మొత్తంలో జరిమానా విధించారని సమాచారం.

ఒడిశా రాష్ట్రంలోని రాయగడలో చోటు చేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే ప్రకాశ్ అనే వ్యక్తి తన బైక్ కు ప్లాస్టిక్ డ్రమ్ములను కట్టుకొని ఊరూరా తిరుగుతూ అమ్మేవాడు. అయితే అతను తిరుగుతున్న వాహనానికి రిజిస్ట్రేషన్ చేయించలేదు. రాయగడ పోలీసులు తనిఖీల్లో భాగంగా అతని వాహనాన్ని ఆపి బైక్ కు సంబంధించిన పత్రాలను అడిగారు.

అయితే ఆ వ్యక్తి దగ్గర బండికి సంబంధించిన పత్రాలు లేకపోవడంతో పాటు బైక్ కు రిజిస్ట్రేషన్ కూడా లేదు. దీంతో పోలీసులు ఏకంగా 1,13,000 రూపాయలు ఫైన్ విధించారు. భారీ మొత్తంలో ఫైన్ విధించడంతో అవాక్కైన ప్రకాష్ ఏం చేయాలో పాలుపోక చివరకు స్నేహితులు, బంధువుల దగ్గర డబ్బులను అప్పు చేసి ఫైన్ ను చెల్లించాడు. కొత్త బైక్ కు సమానమైన మొత్తాన్ని ఆ వ్యక్తి జరిమానా చెల్లించడం గమనార్హం.

అయితే పోలీసులు భారీ మొత్తంలో జరిమానా విధించడాన్ని కొందరు సమర్థిస్తుంటే మరి కొందరు మాత్రం తప్పుబడుతున్నారు. వీధివ్యాపారులకు భారీ మొత్తంలో ఫైన్ వేయడం సరికాదని కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. మరి కొందరు నెటిజన్లు వీధి వ్యాపారి ఫైన్ చెల్లించకుండా కొత్త బైక్ కొనుగోలు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మద్యం ప్రియులకు ఝలక్.. అక్కడ మందు తాగితే రూ.10,000 జరిమానా..?


మద్యం ప్రియులకు గోవా పర్యాటక శాఖ భారీ ఝలక్ ఇచ్చింది. మద్యం ప్రియులు ఇకపై గోవా బీచ్ లలో మద్యం తాగకూడదని ఆదేశాలు జారీ చేసింది. 2021 కొత్త సంవత్సరం వేడుకల సమయంలో మద్యం ప్రియుల నిర్లక్ష్యం వల్ల గోవా తీర ప్రాంతాలలో భారీ సంఖ్యలో మద్యం సీసాలు చేరాయి. దీంతో గోవా పర్యాటక శాఖ బీచ్ లలో మద్యం తాగే వ్యక్తులకు 2 వేల రూపాయలు, గుంపులుగా మద్యం తాగే వ్యక్తులకు 10,000 రూపాయలు జరిమానా విధిస్తామని పేర్కొంది.

గతంలోనే గోవా పర్యాటక శాఖ ఈ మేరకు సవరణలు చేసింది. అయితే అప్పట్లో సవరణలు చేసిన చట్టాన్ని ఇప్పుడు అమలు చేయడానికి గోవా పర్యాటక శాఖ సిద్ధమవుతూ ఉండటం గమనార్హం. బీచ్ లలో మద్యం తాగకూడదని గోవా పర్యాటక శాఖ బోర్డులను సైతం ఏర్పాటు చేసింది. పర్యాటక శాఖ కమిషనర్ తమ శాఖకు సిబ్బంది ఉంటే సొంతంగానే ఈ నిబంధనలను అమలు చేస్తామని వెల్లడించారు.

పర్యాటక శాఖ పోలీసుల ద్వారా గోవాలో ఈ చట్టం అమలు కానుందని తెలుస్తోంది. మద్యానికి సంబంధించిన నిబంధనలతో పాటు మరికొన్ని నిబంధనలను కూడా కేంద్రం అమలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గోవా పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం మద్యం ప్రియులకు ఝలక్ అనే చెప్పాలి. సాధారణంగా కొత్త సంవత్సరం వేడుకలను ఎక్కువమంది గోవాలో సెలబ్రేట్ చేసుకోవడానికి ఆసక్తి చూపుతారు.

సెలబ్రిటీలు సైతం కొత్త సంవత్సరం వేడుకలను గోవాలోనే జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. గోవా పర్యాటక శాఖ తీసుకున్న నిర్ణయం గురించి మద్యం ప్రియుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

మాస్క్ ధరించని వారికి షాకింగ్ న్యూస్.. రూ.2000 ఫైన్…?

భారతదేశంలో గతంతో పోలిస్తే కరోనా కేసుల సంఖ్య తగ్గినా వైరస్ ఉధృతి కొనసాగుతున్న సంగతి విదితమే. దేశంలో ప్రస్తుతం 40,000కు అటూఇటుగా కరోనా కొత్త కేసులు, వెయ్యి లోపు మరణాలు నమోదవుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండటంతో ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా నిబంధనలు పాటించడం ద్వారా మాత్రమే వైరస్ బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది.

అయితే దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో దేశంలోని ప్రజలు మాస్క్ ధరించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మళ్లీ దేశవ్యాప్తంగా వైరస్ విజృంభించే అవకాశం ఉందని సెకండ్ వేవ్ మొదలవుతుందని అభిప్రాయపడుతున్నారు. దేశరాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి తగ్గినట్టే తగ్గి మళ్లీ విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో నిన్న ఒక్కరోజే 7,400 కొత్త కేసులు, 131 మరణాలు నమోదయ్యాయి.

రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రజలు మాస్క్ ధరించకపోతే 2,000 రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ప్రజలు పూజలు, పండుగలు ఇంటి దగ్గరే జరుపుకోవాలని జనం ఒకేచోట గుమికూడితే వైరస్ ఒకరినుంచి మరొకరికి సులువుగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. వేడుకలను రద్దు చేయడం లేదని అయితే జనం గుమికూడటాన్ని మాత్రం నిషేధిస్తున్నామని తెలిపారు.

వైరస్ వేగంగా వ్యాప్తి చెంది పెద్దసంఖ్యలో కరోనా కేసులు నమోదైతే పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఊహించుకోవాలని వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో ప్రజలు పెద్దసంఖ్యలో కరోనా నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని.. ఢిల్లీలో నమోదైన కేసుల సంఖ్య 5 లక్షలు దాటిందని కేజ్రీవాల్ తెలిపారు. ప్రభుత్వం భారీగా జరిమానా విధిస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇకనైనా కరోనా నిబంధనలు పాటిస్తారో లేదో చూడాల్సి ఉంది.