Talangana Congress Leaders : ‘బలగం’ సినిమా చూపించిన కాంగ్రెస్ పెద్దలు.. అవాక్కవుతున్న జనం.. ఇలాగే ఉంటే కేసీఆర్ కు చుక్కలే..!

Talangana Congress Leaders : ‘బలగం’ సినిమా చూపించిన కాంగ్రెస్ పెద్దలు.. అవాక్కవుతున్న జనం.. ఇలాగే ఉంటే కేసీఆర్ కు చుక్కలే..!బలగం సినిమా చూశారా? చూసే ఉంటారులే.. ఊరు వాడా.. ఒక్కచోట చేరి మరీ ఈ సినిమాను చూసింది. మంచి సక్సెస్ టాక్ రావడంతో థియేటర్లకు వెళ్లలేని వారు సైతం ఓటీటీలో రాగానే బుల్లితెరపై వీక్షించారు. అన్నదమ్ముల అనుబంధం గురించి కుటుంబం కలిసి ఉండాలనేది ఈ సినిమాలో ప్రముఖంగా చూపించారు. ఇది చూసి విడిపోయిన అన్నదమ్ములు, సోదర, సోదరీమణులు కలిసిపోతున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత కలిసిపోయిన చాలా మందిని వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇదెందుకు అనుకుంటున్నారా? మన తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం ‘బలగం’ సినిమా చూసినట్టున్నారు. ఇన్నాళ్లు ఉప్పు – నిప్పులా ఉన్న నేతలు అంతా ఒక్కసారిగా కలిసిపోయారు. ఇలాంటి అరుదైన దృశ్యం చూస్తామని బహుశా గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉండే నేతలు, కార్యకర్తలు ఊహించి ఉండరేమో. మొత్తానికి నల్లగొండ సాక్షిగా బలగం మూవీ ఎండింగ్‌లో అంతా కలిసిపోయే సీన్ ఉంటుందే దాన్ని చూపించేశారు..

కుమ్ములాటల పార్టీ అని టాక్..

నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరుద్యోగ నిరసన ర్యాలీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. కలిసి ఉంటే ఎలాంటి ప్రయోజనం ఉంటుందో నేతలకు తెలిసి వచ్చి ఉంటుంది. ఈ నిరుద్యోగ నిరసన ర్యాలీ అనంతరం జరిగిన సభలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ ఎంపీలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, సీనియర్ నేత జానారెడ్డితో పలువురు పెద్దలు పాల్గొన్నారు. మిగిలిన వారి సంగతేమో కానీ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్‌లను ఒక వేదికపై కనిపించిన సందర్భాలు చాలా తక్కువే.. సడెన్ గా ఇలా వారిని చూడటంతో కాంగ్రెస్ శ్రేణులకు కొండంత బలాన్నిచ్చింది. చూడటానికి కన్నుల పండువగా అనిపించింది. వీరంతా ఇలాగే కలిసి ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం పెద్ద కష్టమేమీ కాదనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొన్నటి వరకూ కాంగ్రెస్ పార్టీ అంటేనే కుమ్ములాటలకు కార్ ఆఫ్ పార్టీ అనే టాక్ ఉంది. ఈ సభ దానిని కొంతమేర చెరిపేసింది. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన నల్లగొండ సాక్షిగా అంతా ఒక్కటయ్యారు. మిగిలిన నేతలంటారా? పెద్దగా లెక్కలోకి తీసుకోవాల్సిందేమీ లేదు. వీరు కలిసొస్తే వారు కూడా కలిసి రావడం ఖాయం.

అధికార పార్టీకి చెమటలు పట్టడం ఖాయం..

కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్లి.. రేవంత్ రెడ్డిని ఆలింగనం చేసుకుంటుంటే.. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఈలలో కేకలతో సభా ప్రాంగణాన్ని హోరెత్తించారు. అసలు వీరంతా కలిసి రావడం అనే మాట జనాల్లో విపరీతమైన ఉత్సాహాన్ని తీసుకొచ్చినట్టుంది.. ఈ సభకు ఇసుకేస్తే రాలనంత మంది జనం వచ్చారు. ఇది కదా మనకు కావాల్సిందను అభమానుకు, కార్యకర్తలు అనుకున్నారు. మొత్తానికి కర్ణాటక ఎన్నికల ప్రభావమో.. మరొకటో కానీ అంతా కలిసిపోయారు. ఇది చూస్తే అధికార పార్టీకి చెమటలు పట్టడం ఖాయమని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. నిజానికి తెలంగాణను ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అంటే జనానికి అభిమానమే. కానీ నేతల మధ్య కుమ్ములాటలే ఆ అభిమానాన్ని కప్పేస్తున్నాయి. ఇప్పటికైనా ఇలా ముందుకు వెళితే అంతా కాంగ్రెస్ పార్టీకి మంచే జరుగుతుంది. అధికారాన్ని చేజిక్కించుకోకున్నా కూడా సీట్లను భారీగా పెంచేసుకుని సెకండ్ ప్లేస్‌లో తిష్ట వేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఎన్నికల ముందు కాంగ్రెస్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయ్.. ఈ కలయిక.. ఇదే పరిస్థితి కొనసాగితే చెయ్యి పార్టీకి మంచి రోజులు వచ్చినట్లే.. బీఆర్ఎస్ గడ్డుకాలమే అని విశ్లేషకులు అంటున్నారు.

ఈ ముచ్చట ఎన్నాళ్ళో..!

ఇక కాంగ్రెస్ నేతల కలయిలకపై ట్రోల్స్ కూడా భారీగానే వస్తున్నాయి. ఇదంతా కొన్ని గంటలకే పరిమితమని కొందరు.. జనం ముందు బాగానే నటిస్తున్నారని మరి కొందరు.. ఇది ఉత్సాహమా.. అత్యుత్సాహమా? అని ఇంకొందరు.. ఎవరికి తోచిన విధంగా వారు పోస్టులు పెడుతున్నారు. ఇక ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఒక వర్గం జనాల్లో ఎంత చులకన అయిపోయిందో తెలుసుకుని నేతలు నడుకుంటే బాగుండునని పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఈ కలయికను ఈ సభ వరకూ మాత్రమే పరిమితం చేయకుండా.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే వరకూ సాగించాలని కోరుకుంటున్నారు. మరి పార్టీ నేతలు ఏం చేస్తారో చూడాలి. ఇలాగే కలిసి కట్టుగా ఉంటే మాత్రం అధికార పార్టీకి చుక్కలు చూపించడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. మరి ఈ కలయికను నిలుపుకుంటారా? లేదంటే మళ్లీ జనాల్లో చులకనవుతారా? అనేది తెలియాల్సి ఉంది.