టీడీపీ పగ్గాలు ఎన్టీఆర్ చేపట్టనున్నారా..? దీనిపై క్లారిటీ ఇచ్చిన టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే..

ఒకప్పుడు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపిన తెలుగుదేశం పార్టీ పరిస్థితి ప్రస్తుతం ఆగమ్యగోచరంగా తయారు అయింది. తెలంగాణలో అయితే టీడీపీ కనుమరుగైపోయిందనే చెప్పాలి. కొన్ని నెలల క్రితం తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణ టీఆర్ఎస్ లో చేరిన తర్వాత ఉన్న కాస్తంత బలగం కూడా కనపడకుండా పోయింది. అయితే ఇప్పటికీ టీడీపీ అంటే అభిమానం ఉన్నవారు ఎప్పటికైనా టీడీపీ మళ్లీ పుంజుకుంటుంది.. కానీ దానికి నాయకులు జూనియర్ ఎన్టీఆర్ ఉండాలని కోరుకున్నట్లు సమాచారం.

తెలంగాణలో పరిస్థితి ఇలా ఉంటే.. ఆంధ్రాలో ఎన్నో సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లీడ్ చేస్తున్నారు కావునా.. అక్కడ పర్వాలేదు. కానీ అక్కడ కూడా టీడీపీ నాయకులు ఎవరిదారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. టీడీపీకి మళ్లీ పూర్వవైభవం రావాలంటే.. ఆ పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రీ ఎంట్రీ ఇవ్వాల్సిందే అనే నినాదంలో టీడీపీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. కొన్నిసార్లు చంద్రబాబు పర్యటనల్లో సైతం జూనియర్ ఎన్టీఆర్ రావాలనే నినాదాలు వినిపించాయి.

కొందరైతే స్వయంగా చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ జూనియర్ ఎన్టీఆర్ రావాల్సిందే అని నినాదాలు చేశారు. అయితే టీడీపీ శ్రేణులు నిజంగానే ఎన్టీఆర్ రాకను ఆహ్వానిస్తున్నారా అనేది మాత్రం తెలియదు. అయితే ఆ మధ్య టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బచ్చయ్య చౌదరి జూనియర్ ఎన్టీఆర్ పార్టీలోకి వస్తే బాగుంటందని చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీశాయి. అప్పటి నుంచి పెద్ద దుమారం రేపింది.

దీనిని మీడియా వేరే రకంగా చూపించిందని.. తన ఉద్దేశ్యం అది కాదని.. జూనియర్ ఎన్టీఆర్ కూడా పార్టీ కోసం పని చేస్తే బాగుంటుందనే కారణంతో అన్నానని.. కానీ దానికి టీడీపీ పగ్గాలు మొత్తం ఎన్టీఆర్ తీసుకోవాలనే అర్థం కాదని వివరణ ఇచ్చారు. ఈ నిర్ణయంపై వాళ్ల కుటుంబసభ్యులే చర్చించుకోవాలన్నారు.