Tejaswini Manogna : ప్రతి ఒకరు తెలుసుకోవాల్సిన తెలుగుమ్మాయి తేజస్విని మనోజ్ఞ సక్సెస్ స్టోరీ…!

Tejaswini Manogna : ఒక వ్యక్తి ఒక రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగితే అందరూ చాలా కష్టపడి బాగా రాణించాడు అని పొగుడుతాం. అతని విజయానన్ని స్పూర్తిగా తీసుకుంటాం. అదే వ్యక్తి ఒక రంగం కాకుండా అనేక విషయాలలో ది బెస్ట్ అనిపించుకుంటే ఖచ్చితంగా మనకు రోల్ మోడల్ అవుతారు. మనిషి సాధించలేనిది ఏది లేదు అని నిరూపించే వారిలో ఈ అందాల ముద్దుగుమ్మ ముందుంటుంది. ఆమె ఎవరో కాదు మన తెలుగుమ్మాయి తేజస్విని మనోజ్ఞ. మనోజ్ఞ సక్సెస్ స్టోరీ ఖచ్చితంగా ఇప్పటి యువతరానికి స్ఫూర్తిదాయకం.

మిస్ ఎర్త్ విజేత మనోజ్ఞ విజయగాధ…

తేజస్విని మనోజ్ఞ 1994లో తెలంగాణ రాష్టంలో జన్మించింది. హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేసిన ఈ అమ్మాయికి చిన్నతనం నుండే గొప్ప వ్యక్తుల ఆర్టికల్స్ పేపర్లో వచ్చినవాటిని కత్తిరించి దాచుకోవడం అలవాటు. అలా స్ఫూర్తిని అందుకున్న మనోజ్ఞ తల్లి సలహా మేరకు తనకు కూడా ఇలా అందరూ మేచ్చే వ్యక్తి అవ్వాలని అనుకుందట. అలా పాఠశాలలో చదివే సమయంలోనే ఎన్సిసి లో చేరింది. ఇక 16 ఏళ్లకే ఇండియా బెస్ట్ ఎన్సిసి కాడేట్ అలాగే బెస్ట్ షూటర్ గా 1.3 మిలియన్ మందిలో నిలిచింది. అప్పటి ప్రధాని, రాష్ట్రపతి చేతుల మీదుగా మెడల్స్ తీసుకుంది. ఇక భరతనాట్యంలో కూడా మనోజ్ఞ ప్రవీణ్యురాలు.

చదువులోనూ ముందుండే మనోజ్ఞ ఎన్నో మోటివేషనల్ స్పీచ్ లను స్కూల్ సమయంలోనే అనర్గళంగా మాట్లాడుతూ ఉండేది. ఇక నీట్ లో ర్యాంకర్ గా నిలిచి ఉస్మానియా యూనివర్సిటీ నుండి డాక్టర్ అయింది. ఇక అక్కడితో ఆమె పయనం ఆగలేదు, చిన్నతనంలోనే అందాల పోటీకి వెళ్లి బహుమతులు పొందిన మనోజ్ఞ డాక్టర్ అయ్యాక కూడా మిస్ దివా 2017 లో టాప్ 6 లో నిలిచింది. ఇక 2019 లో మిస్ డివైన్ బ్యూటీ గా గెలువగా అదే సంవత్సరం మిస్ ఎర్త్ 2019 గా నిలిచి ఫిలిపిన్స్ లో జరిగిన పోటిల్లో భారత్ కు ప్రతినిధిగా నిలిచింది. ఇక యోగా ట్రైనర్ గా ఆరోగ్య సూత్రాలను చెబుతున్న మనోజ్ఞ మరోవైపు సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ గా యువతకు ఆదర్శంగా నిలుస్తూ బ్యూటీ విత్ బ్రెయిన్ అని నిరూపించుకుంది.