Telangana activist Sai Chand death : ఆయన గానం, ఆమె నాట్యం… సాయి చంద్, రజనిల లవ్ స్టోరీ… మూగబోయిన ఉద్యమ గానం…!

Telangana activist Sai Chand death : తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన వేళ తన గాత్రంతో వేల మందిని ఉత్తేజపరిచి ఉద్యమ వైపు నడిపిన గొంతు నేడు మూగబోయింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటలు పాడి తెలంగాణ ధూమ్ ధామ్ అంటూ ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపరచిన 39ఏళ్ల సాయి చంద్ బుధవారం నాడు గుండెపోటుతో మరణించారు. తెలంగాణ ఉద్యమం తరువాత బిఆర్ఎస్ పార్టీలో చేరి ప్రస్తుతం రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన సాయి చంద్ మరణం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. చిన్న వయసులోనే ఆయన మృతి ఆయన భార్య, పిల్లలకు తీరని లోటు. నిజానికి సాయి చంద్ గాయకుడయితే ఆయన భార్య రజని నాట్యకారిని. వారిది ప్రేమ వివాహం కావడం విశేషం.

ఆయన గాత్రం… ఆమె నాట్యం…

సాయి చంద్ గారు రజని గారికి సీనియర్ కాగా కాలేజీ రోజుల్లోనే ఉద్యమానికి సంబంధించిన పాటలను రాస్తూ పడుతూ అప్పటికే సాయి చంద్ బాగా ఫేమస్ కాగా ఆయనను కనుచూపు తిప్పుకోకుండా కట్టిపడేసిన నాట్యం రజని గారిది. ఒకరోజు ఆమె స్టేజి మీద నాట్యం చేస్తుంటే ఆలా చూస్తూ ఉండిపోయారట సాయి చంద్. ఇక వెంటనే ఆమెతో ఒక ఫోటో తీసుకున్నారట. అందరూ ఆయనతో ఫోటో కోసం ఎదురుచూస్తే ఆయన మాత్రం రజని గారితో ఫోటో తీసుకున్నారు. ఆలా ఏర్పడిన పరిచయం కొన్నేళ్లకు ప్రేమగా మారింది. సాయి చంద్ పెళ్లి చేసుకుందాం అని అడిగారు, రజని గారు ఒప్పుకున్నారు. ఇక పెద్దలు వారి పెళ్ళికి అంగీకరించి పెళ్లి చేసారు.

2002లో మొదలయిన పరిచయం 2011లో పెళ్లి పీటలెక్కింది. ఇద్దరూ పెళ్లయ్యాక కూడా వారి వారి రంగాలలో బిజీ అయ్యారు. ఇద్దరికీ ఇద్దరు పిల్లలు, చూడచక్కని కుటుంబం చూసి దిష్టి తగిలినట్టుంది, అందుకే 39 ఏళ్ల వయసులోనే తనను ఎంతగానో ప్రేమించే భార్య రజనీని ఒంటరిని చేసి సాయి చంద్ వెళ్లిపోయారు. ఆయన పాటకు గజ్జె కట్టి నాట్యం చేసే రజని గారిని ఒంటరిని చేసి వెళ్లిపోయారు. బుధవారం నాడు నాగర్ కర్నూల్ లోని ఫామ్ హౌస్ కి కుటుంబంతో వెళ్లిన సాయి చంద్ అక్కడే గుండె పోటు రావడంతో తొలుత లోకల్ హాస్పిటల్ ఆపైన హైదరాబాద్ గాచ్చిబౌల్ కేర్ హాస్పిటల్ తరలించినా అప్పటికే మృతి చెందారిని నిర్ధారించారు. రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా పాటతో సాయి చంద్ ఎక్కువ గుర్తింపు పొందారు.