విద్యార్థులకు అలర్ట్.. పది, ఇంటర్ పరీక్షల విషయంలో విద్యాశాఖ కీలక నిర్ణయం..?

కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల పెద్దపెద్ద నగరాల నుంచి చిన్న పల్లెటూళ్ల వరకు పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఏపీలోని విద్యా సంస్థలు ఇప్పటికే తెరుచుకోగా తెలంగాణలో డిసెంబర్ నెల నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. విద్యాసంస్థలు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

2021 సంవత్సరంలో ఏప్రిల్ నెల చివరి వారం పదో తరగతి పరీక్షలు, మే నెల చివరి వారంలో ఇంటర్ పరీక్షలు నిర్వహించాలని భావిస్తోంది. గతంతో పోలిస్తే పనిదినాలు తగ్గినా ఇంటర్ ప్రశ్నాపత్రాల్లో పెద్దగా మార్పులు ఉండవని సమాచారం. అయితే పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రయోజనం చేకూర్చేలా విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. పదో తరగతి ప్రశ్నాపత్రాల్లో ఛాయిస్ ప్రశ్నలు పెరగనున్నాయి.

అధికారులు ఇతర పరీక్షల నిర్వహణ కోసం ఇప్పటికే ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ అధికారులకు ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. స్కూళ్లు, కాలేజీలు డిసెంబర్ 1న మొదలు కానుండటంతో ఐదు నెలల విద్యా బోధన జరిగిన తరువాత పరీక్షలను నిర్వహించాలని విద్యాశాఖ భావిస్తోంది.

విద్యాశాఖ తొలుత ఇంటర్ విద్యార్థులకు కూడా సడలింపులు ఇవ్వాలని భావించినా సడలింపులు ఇస్తే పోటీ పరీక్షల్లో విద్యార్థులు వెనుకబడే అవకాశం ఉందని విద్యాశాఖ ఆ నిర్ణయం విషయంలో వెనక్కు తగ్గింది.