Transgender Marriage : హిజ్రాని ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడు…!

Transgender Marriage : ప్రేమకు మతం, కులం, వయసు ఉండదు అంటారు. అయితే ఈ ప్రేమికులు మాత్రం వారి ప్రేమకు జెండర్ కూడా అడ్డురాదని నిరూపించారు. జగిత్యాలకు చెందిన హర్షద్ తాను ప్రేమించిన అమ్మాయి ఒక ట్రాన్స్జెండర్ అని తెలిసినా తననే పెళ్లి చేసుకోవాలని వారి పెళ్లి కి ఎన్ని అడ్డంకులు వచ్చినా అవన్నీ దాటుకుని పెళ్లి చేసుకుని తన ప్రేమ నిజాయితీ నిరూపించుకున్నాడు.

ప్రేమకు మతం అడ్డుకాదు…

కరీంనగర్ వీణవంక కు చెందిన దంపతులకు రెండో కుమారుడిగా జన్మించిన సంపత్ చిన్న వయసు నుండి ఆడపిల్లలా ప్రవర్తించేవాడు. ఇక పద్దెనిమిదేళ్ల వయసులో తనకు ఆడపిల్లగా బతకగలనని అర్థం చేసుకుని ఇంట్లో నుండి వెళ్ళిపోయి ట్రాన్స్ జెండర్ గా మారిపోయాడు సంపత్. దివ్యగా పేరు మార్చుకుని జమ్మికుంట లో జీవనం సాగించాడు. ఒకసారి జగిత్యాల లో టాక్సీ డ్రైవర్ గా పనిచేస్తున్న హర్షద్ అనే యువకుడితో దివ్యకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ ఫోన్లో గంటలు గంటలు మాట్లాడుకునేవారు.

ఇక దివ్య తన జీవితంలో ఉంటే ఎంతో బాగుంటుందని భావించిన హర్షద్ పెళ్లి చేసుకుందామని దివ్యను అడిగాడు. అయితే తాను అందరిలాంటి అమ్మాయిని కాదని తెలిసినా పెళ్లి చేసుకుందామని అడగడంతో మతం వేరు అంటూ కుదరదని దివ్య చెప్పింది. అయినా వదలని హర్షద్ నా మతమే నిన్ను నాకు దూరం చేస్తుందంటే ఆ మతం నాకు వద్దు అని తాను మతం మారి పేరును హర్షిత్ గా మార్చుకున్నాడు. తన కోసం ఇంత చేస్తున్న హర్షిత్ ప్రేమను అర్థం చేసుకున్న దివ్య పెళ్ళికి ఒప్పుకుంది. తోటి హిజ్రాల సహాయంతో వారిద్దరూ పెళ్లి బంధంతో ఒక్కటైయ్యారు.