ఆహుతి ప్రసాద్ ను అదే దెబ్బతీసిందా.. అందుకే కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్నారా..?

హాస్య నటుడిగా.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎంతో మంచి నటతో ప్రేక్షకులను మెప్పించాడు ప్రసాద్. ప్రసాద్ అంటే చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఆహుతి ప్రసాద్ అంటే అందరూ అతడిని గుర్తు పడతారు. అంతగా అందులో తన పాత్ర మెప్పిస్తుంది. అతడు 300 పై చలుకు సినిమాల్లో నటించాడు. తర్వాత నిర్మాతగా కూడా మారాడు. 1958లో జన్మించిన ప్రసాద్.. మధు యాక్టింగ్ స్కూల్లో నటన నేర్చుకున్నాడు.

మొదట సీరియల్లో నటించిన తర్వాత అతడికి 1987 లో ఆహుతి సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అందులో అతడు విలన్ క్యారెక్టర్ పోషించాడు. ఆహుతి సినిమా ఘన విజయం సాధించింది. సినిమాలో ప్రసాద్ పోషించిన శంభు ప్రసాద్ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు లభించడంతో అప్పటి నుంచి ఆహుతి ప్రసాద్ గా పేరొందాడు. ఆ తర్వాత అనేక సినిమాల్లో పోలీసు పాత్రలు, రాజకీయ నాయకుని పాత్రలు చేశాడు. 1990 లో అతడు కన్నడంలో నిర్మాతగా మారి 3 సినిమాలు తీశాడు. మొదటి సినిమా విజయవంతం అయింది.. కానీ తర్వాత సినిమాలు అంతలా ఆడలేదు.

దీంతో ఆర్థికంగా నష్టపోయాడు. అటు తెలుగులో కూడా అవకాశాలు రాలేదు.. ఇలా 4 సంవత్సరాలు ఖాళీగా ఉంటూ.. పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లిపోయాడు. అంత మంచి పేరు ఉన్న అతడికి అవకాశాలు రాకపోవడానికి గల కారణం అతడు నిర్మాతగా మారడమే. నిర్మాతగా మారిన అతడు మళ్లీ సినిమాల్లో నటించమంటే.. చేస్తాడో చెయ్యడో అన్న సందేహంతో ఎంతో మంది డైరెక్టర్లు వెనుతిరిగారు.

అలా అతడు కొన్నేళ్లు ఖాళీగా ఉన్నాడు. తెలుగులోనే 1996 లో నిన్నే పెళ్లాడుతా సినిమాలో కథానాయిక తండ్రిగా చేసిన పాత్రతో తన టాలెంట్ ను నిరూపించుకున్నాడు. తర్వాత మళ్లీ సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. 2007 లో వచ్చిన చందమామ సినిమాలో అతడు పోషించిన రామలింగేశ్వరరావు పాత్ర హాస్యం, విభిన్నమైన సంభాషణ శైలితో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తర్వాత 2014 వ వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలు చేసి 2015 జనవరి 4న క్యాన్సర్ తో కన్నుమూశాడు.