ప్రజలకు మరో షాకింగ్ న్యూస్.. మరోసారి లాక్ డౌన్..?

గడిచిన ఎనిమిది నెలల నుంచి దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కరోనా కేసులు, కరోనా మరణాలు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పుడిప్పుడే దేశంలో పరిస్థితులు చక్కబడుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన వ్యాఖ్యలు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి.

కరోనా సెకండ్ వేవ్ కు సిద్ధంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రజలను తీవ్రస్థాయిలో హెచ్చరించింది. ప్రపంచ దేశాల్లో గతంలో కఠినంగా లాక్ డౌన్ అమలైందని.. ప్రస్తుతం లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ప్రజలు విచ్చలవిడిగా తిరుగుతున్నారని.. పరిస్థితులు ఇలాగే ఉంటే మరోసారి లాక్ డౌన్ తప్పదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. వివిధ దేశాల నేతలు, ప్రతినిధులతో డబ్లూహెచ్వో వరల్డ్ హెల్త్ అసెంబ్లీని నిర్వహించింది.

ఈ సమావేశం అనంతరం వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్వో కీలక సూచనలు చేసింది. అమెరికా, యూరప్ లాంటి దేశాలలో ప్రస్తుతం లాక్ డౌన్ అమలులో లేకపోవడంతో భారీ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం వల్ల మళ్లీ లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి ఏర్పడినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

మళ్లీ లాక్ డౌన్ విధిస్తే పలు దేశాలు ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందనడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. భారత్ సహా పలు దేశాలకు కరోనా ముప్పు ఉందని కేసులు తగ్గినంత మాత్రాన వైరస్ అదుపులోకి వచ్చినట్టు భావించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.