Sharmila: కాంగ్రెస్ గూటికి చేరిన వైయస్ షర్మిల.. పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన రాహుల్ గాంధీ?

Sharmila: దివంగత రాజకీయ నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తెగా తెలంగాణలో వైయస్సార్టీపీ పార్టీ స్థాపించినటువంటి షర్మిల పెద్ద ఎత్తున తెలంగాణలో పాదయాత్ర చేస్తూ అధికార ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. అయితే తీరా ఎన్నికల సమయంలో ఈమె మౌనం వహించడమే కాకుండా ఎన్నికల పోటీ నుంచి కూడా తప్పుకున్నారు.

ఇకపోతే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను అంటూ గత కొద్దిరోజుల క్రితం ఈమె వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక నిన్న సాయంత్రం తాడేపల్లిలో సీఎం జగన్ మోహన్ రెడ్డిని తన కుమారుడి పెళ్లికి ఆహ్వానించినటువంటి షర్మిల అటు నుంచి అటే ఢిల్లీకి వెళ్లారు అయితే నేడు ఉదయం 10:55 నిమిషాలకు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలోకి విలీనం చేశారు.

ఈ క్రమంలోనే ఆమెకు ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీలు పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. వైఎస్ షర్మిలతో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇలా కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తర్వాత వైఎస్ షర్మిల దంపతులు ఇద్దరు కూడా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు అనంతరం ఈమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాను కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడంతో తన తండ్రి గారు చాలా సంతోషపడతారని ఈమె వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉంది…

రాజశేఖర్ రెడ్డి బిడ్డగా నేను కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం తనకు చాలా సంతోషంగా అనిపించిందని వెల్లడించారు. ఇక కాంగ్రెస్ అధిష్టానం తనకు ఏ పదవి అప్పగించిన శక్తివంచన లేకుండా పనిచేస్తానని షర్మిల తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశంలోనే అతిపెద్ద సెక్యులర్ పార్టీ.. దేశంలోని అన్ని వర్గాలను ఏకం చేసిన పార్టీ కాంగ్రెస్ అని షర్మిల అన్నారు. ఇలా ఈమె కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ పార్టీ గురించి గొప్పగా చెప్పడంతో కొందరు వైయస్సార్ అభిమానులు ఈమె వ్యవహరి శైలి పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.