కరోనాను జయించిన 110 ఏళ్ల వృద్ధుడు.. గాంధీ ఆస్పత్రిలో దిక్కు?

దేశవ్యాప్తంగా కరోనా రెండవ దశ తీవ్రంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో రోజు రోజుకు కేసుల సంఖ్య అధికమవుతున్నాయి. ఈ క్రమంలోనే రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మొదటి దశలో ఎక్కువగా వృద్ధులు మృత్యువాత పడగా రెండవ దశలో యువకులు సైతం అధిక సంఖ్యలో మృత్యువాత పడుతున్నారు. కానీ,ఇంతటి భయంకరమైన మహమ్మారి నుంచి 110 ఏళ్ల వృద్ధుడు కరోనాను జయించి ఎంతో ఆరోగ్యంగా బయటపడ్డాడు.

హైదరాబాద్ లో కరోనా కేసుల తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ ఎంతో మంది మరణిస్తున్నారు. ఈ క్రమంలోనే గాంధీ ఆస్పత్రిలో కరోనా బారిన పడి చికిత్స తీసుకుంటున్న 110 సంవత్సరాల రామానంద తీర్థ అనే వ్యక్తి కరోనాను జయించి ఆరోగ్యంగా ఉండడంతో ఎంతో మందిని ఆశ్చర్యానికి గురి చేసింది.

రామానంద తీర్థ(110) కీసరలోని ఓ ఆశ్రమంలో ఉంటున్నారు. ఇటీవల ఆయనకు స్వల్ప కోవిడ్ లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. వైద్యుల సూచనల మేరకు ఏప్రిల్ 24న గాంధీ ఆస్పత్రిలో చేరిన రామానందతీర్థకు ఆక్సిజన్ స్థాయిలు 92 గా ఉండడంతో అతనికి ఐసియు వార్డులో కోవిడ్ చికిత్స అందించారు. దాదాపు మూడు వారాల చికిత్స అనంతరం రామానందతీర్థకి మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా అతనికి నెగిటివ్ వచ్చింది.

110 ఏళ్ల వయసులో కరోనా బారినపడి విజయవంతంగా కరోనా నుంచి బయటపడిన రామతీర్థ కి ఇతర ఎటువంటి జబ్బులు లేకపోవడంతోనే అతను తొందరగా కరోనా నుంచి కోలుకొని బయటపడినట్లు
గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు వెల్లడించారు.