All posts by Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Nallari Kiran Kumar Reddy : ఏపీలో దురదృష్టవంతుడంటే ఆయనే.. అంత సునామీలోనూ ఓటమి..

కాలం, ఖర్మం కలిసొస్తే మళ్లీ వస్తానంటూ రాజకీయాల నుంచి తప్పుకున్నారు మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర విభజన అనంతరం ఆయన రాజకీయాలను వీడారు. ఇటీవలే టైం సెట్ అయిందనుకున్నారో ఏమో కానీ రాజకీయాల్లోనూ కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరి సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. అంతా బాగుంటే ఆయన రేంజ్ మరోలా ఉండేది. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టాయి. సునామీ మాదిరిగా ఈ కూటమి విజయపరంపరను కొనసాగించింది. ఇంతటి సునామీలో సైతం గెలవలేకపోయిన వారిని దురదృష్టవంతులనే చెప్పాలి. అలాంటి దురదృష్టవంతుల్లో ఒకరు కిరణ్ కుమార్ రెడ్డి. పదేళ్ల పాటు జనాలకు దూరంగా ఉండటం వల్లనో ఏమో కానీ ఆయనను జనాలు కూడా దూరం పెట్టేశారు. ఆయన గెలిచి ఉంటే కేంద్ర మంత్రి వర్గంలోకి వెళ్లి అవకాశం ఉండేదేమో.

సామాజికవర్గపరంగానూ కలిసొచ్చిన ప్రాంతమే..

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డి పదేళ్లుగా హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఏపీ వైపు చూసింది కూడా పెద్దగా లేదు. చూసినా కూడా తన పనులు తాను చేసుకోవడం సైడ్ అయిపోవడం. సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకున్నప్పుడు తొలుత కాంగ్రెస్‌లోనే చేరారు. కానీ యాక్టివ్‌గా పని చేయలేదు. ఆ తరువాత బీజేపీ లో చేరారు. లోక్‌సభకు పోటీ చేశారు. నిజానికి రాజంపేట ఆయన అడ్డానే. అక్కడి నుంచి వైసీపీ తరుఫున పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు మిథున్ రెడ్డి పోటీ చేశారు. సామాజికవర్గం పరంగానూ.. టీడీపీ, జనసేనకు మంచి పట్టున్న ప్రాంతం కావడంతో కిరణ్ కుమార్ రెడ్డికి అన్నీ కలిసి రావాలి. అయినా సరే కూటమి హోరు కానీ.. తన సామాజిక వర్గం కానీ ఆయనను నిలబెట్టలేక పోయాయి. ఫలితంగా కిరణ్ కుమార్ రెడ్డి ఓటమి పాలయ్యారు.

ఓటేసినా ఉండరన్న భావన?

ఎంపీ సీట్ల విషయానికి వస్తే.. గత ఎన్నికల్లో 20 స్థానాలను గెలుచుకున్న వైసీపీ ప్రస్తుతం కేవలం 4 స్థానాలకు పరిమితమైంది. వీటిలో టీడీపీ 16, జనసేన 2, బీజేపీ 3 పార్లమెంటు స్థానాలను గెలుచుకుంది. కూటమి కోల్పోయిన నాలుగు స్థానాల్లో రాజంపేట ఒకటి. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఈ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో కటమికి అత్యధిక శాసనసభా స్థానాలను గెలుచుకుంది. కానీ లోక్‌సభ స్థానం మాత్రం పోయింది. నల్లారికి ఓట్లు బదిలీ కాలేదు. ఆయన సోదరుడు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి మాత్రం పీలేరు నుంచి టీడీపీ తరుఫున శాసనసభ్యుడిగా పోటీ చేసి విజయం సాధించాడు. కిరణ్ కుమార్ రెడ్డి ప్రస్తుతం తన ఓటమికి కారణం లేకపోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి పదేళ్లుగా ఏపీలో లేకపోవడం.. హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. దీంతో ఆయనకు ఓటేసినా కూడా ఏపీలో ఉండరన్న భావన జనాల్లో ఉండి ఉండొచ్చు. ఇక పెద్దిరెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి గత కొంతకాలంగా రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండటం కూడా కిరణ్ కుమార్ రెడ్డికి ఇబ్బందికరంగా మారింది. మొత్తమ్మీద కిరణ్ కుమార్ రెడ్డి అయితే సెకండ్ ఇన్నింగ్స్‌లో విఫలమయ్యారు. ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో కొనసాగుతారా? లేదంటే గుడ్ బై చెబుతారా? అనేది తెలియాల్సి ఉంది.

Modi 3.0 : ఏపీకి ఐదు కేంద్ర మంత్రి పదవులు.. ఎవరెవరికంటే..

తంతే బూరెల బుట్టలో పడటమంటే ఇదేనేమో.. ఏపీలో ఏకకాలంలో ఒక పార్టీ పాతాళానికి.. మరో పార్టీ ఆకాశానికి ఎదగడం చూస్తున్నాం. వాస్తవానికి ఇలాంటి పరిస్థితిని ఎవరూ ఊహించి ఉండరు. కూటమి వర్సెస్ వైసీపీ హోరాహోరీ ఉంటుందనుకున్నారంతా కానీ ఫలితాలు చూస్తే వార్ పూర్తిగా వన్ సైడ్ అయిపోయింది. ఇదంతా అందరికీ తెలిసిన విషయమే. ఆ తరువాత కేంద్రంలోనూ టీడీపీ, జనసేనలు కీలకంగా మారాయి. ఏపీ కేంద్రాన్ని అడుక్కునే స్థాయి నుంచి శాసించే స్థాయికి వెళ్లిపోయింది. ఒక కేంద్ర పదవికే అంతకు ముందు దిక్కుండేది కాదు.. ఇప్పుడు ఏపీకి ఏకంగా ఐదు కేంద్ర పదవులు దక్కబోతున్నాయని టాక్. వీటిలో టీడీపీ నుంచి ముగ్గురికి, బీజేపీ నుంచి ఒకరు.. జనసేన నుంచి ఒకరికి కేంద్ర పదవులు దక్కబోతున్నాయని సమాచారం. మొత్తానికి కేంద్రంలో ఏపీ చక్రం తిప్పబోతోంది. ఇది ఆనందించదగిన తరుణమే.

మిత్ర పక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి?

ఏపీలో గత ఐదేళ్లుగా అభివృద్ధి శూన్యం. ఏపీని గాడిన పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. రోడ్ల నుంచి మొదలు పెడితే రాజధాని పునర్నిర్మాణం వంటివి చాలా ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో కీలకంగా మారడం కూడా ఏపీకి ప్లస్ కానుంది. కొంత మేర ఇబ్బందుల నుంచి గట్టెక్కినట్టే. ఇక టీడీపీ నుంచి కేంద్ర పదవులు దక్కించుకునే వారిలో కింజారపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఉన్నారని టాక్. జనసేన నుంచి బాలశౌరికి దక్కే ఛాన్స్ ఉంది. ఇక బీజేపీ నుంచి పురందేశ్వరికి అవకాశం లభించవచ్చని సమాచారం. ఈ మేరకు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించనున్న మోదీ మంత్రివర్గ కూర్పుపై కసరత్తు చేస్తున్నారట. ఈ క్రమంలోనే శనివారం అర్ధరాత్రి వరకూ ఎన్డీఏ కూటమి మిత్రపక్షాలకు ఎన్ని పదవులు ఇవ్వాలి? వారికి ఏ ఏ శాఖలివ్వాలన్న దానిపై ఓ నిర్ణయానికి సైతం వచ్చేశారట.

కీలక శాఖలు బీజేపీకే..

ఇవాళ సాయంత్రం మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు మరికొందరు కేంద్ర మంత్రులు సైతం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలోనే తనతో ప్రమాణ స్వీకారం చేయనున్న మంత్రుల జాబితాను ఇవాళ ఉదయమే మోదీ రాష్ట్రపతి భవన్‌కు పంపిస్తారట. ఆ వెంటనే ఆయా నేతలకు సైతం సమాచారం అందిస్తారట. కీలక శాఖలన్నింటినీ బీజేపీ తన వద్దనే పెట్టుకుంటుందట. రైల్వే, విద్య, జలశక్తి, విద్యుత్, వ్యవసాయం, గనులు వంటి శాఖలను కానీ సహాయ మంత్రి పదవులను కానీ మిత్రపక్షాలకు కేటాయిస్తుందట. ఈ సారి తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి పదవి డౌటేనని అంటున్నారు. బండి సంజయ్, ఈటల రాజేందర్, డీకే అరుణలలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక పై ముగ్గురిలో కేంద్రంలో స్థానం దక్కని వారికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందట. ఇక కిషన్ రెడ్డికి మాత్రం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం.

YS Jagan & Sharmila : అన్నాచెల్లి కలుస్తారా? ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్..

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరంటారు.. కానీ ఇది రాజకీయపరమైన వైరం కాదే.. కుటుంబపరమైన వైరం. కలతలు వస్తేనే కలవడం కష్టం. అలాంటిది అన్నీ లాగేసి రోడ్డున నిలబెట్టిన అన్నను షర్మిల క్షమించగలదా? తిరిగి అన్నకు అండగా నిలవగలదా? రాజన్న బిడ్డనంటూ జనంలోకి వచ్చి మాత్రం షర్మిల సాధించిందేముంది? కనీస జనాదరణ పొందారా? కనీసం ఆమె పుట్టిన గడ్డైనా ఆమెను ఆదరించిందా? సొంత గడ్డపై పోటీ చేసి నవ్వుల పాలయ్యారు. కడప పార్లమెంటు నుంచి పోటీ చేసి డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు. ఇంత ఘోర పరాజయం షర్మిలను కదిలించలేకపోవచ్చు కానీ ఆమె కుటుంబ చరిత్రకు ఒక రెడ్ మార్క్ పడినట్టే కదా? పీసీసీ చీఫ్‌గా ఉండి ఏపీలో ఒక్కటంటే ఒక్క సీటును సాధించలేకపోవడం ఆమె కుటుంబ చరిత్రకే పెద్ద మచ్చ. షర్మిల పగ్గాలు చేపట్టాక జరిగిన తొలి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటు శాతం 2 కంటే తక్కువకు పడిపోయింది. వైసీపీ దారుణ పరాజయంతో ఆ పార్టీలోని కొందరు నేతలకు మరింత సంకట స్థితి ఏర్పడింది. ఎన్డీఏ కూటమి వైపు కూడా ఈ నేతలెవరూ చూసే పరిస్థితి లేదు. పోనీ కాంగ్రెస్‌లోకి వెళదామా? అంటే దానికంటే రాజకీయ సన్యాసం బెటరన్న ఆలోచనలో ఉన్నారు.

కుటుంబ చరిత్రకే ఇది అవమానం..

కనీసం ఓట్లకు కూడా షర్మిల గండి కొట్టలేకపోయారు. షర్మిల సాధించింది ఈ ఎన్నికల్లో ఒక్కటే ఒక్కటే కొన్ని చోట్ల ముస్లిం ఓట్లకు గండి కొట్టి అన్న జగన్‌పై పగ అయితే తీర్చుకోగలిగారు. ఇప్పుడు సమస్య ఏంటంటే.. జగన్ పరిస్థితి కూడా షర్మిలకు ఏమాత్రం తీసిపోదు. గత ఎన్నికల్లో 151 స్థానాలు గెలుచుకుని గర్వంగా కాలర్ ఎగురవేసిన జగన్.. ఐదేళ్లు తిరిగే సరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పడిపోయారు. ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. నిజానికి జగన్ కుటుంబ చరిత్రకే ఇది అవమానం. అన్నా చెల్లెళ్లిద్దరూ కుటుంబ చరిత్రను మంటగలిపారు. ఇద్దరూ విడిపోయి సాధించింది ఇంతకు మించి ఏమీ లేదు. అసలు ఇప్పుడు ఆస్తి కోసం చెల్లిని ఇంటి నుంచి బయటకు గెంటిన జగన్ ఇప్పుడు రిగ్రెట్ ఫీలవుతారా? చెల్లితో కలిసుంటే తల్లి విజయమ్మ కూడా ఆయనతో ఉండేవారు. ఈ కష్టకాలంలో ఆయనకు కాస్త అండ దొరికేది. జగన్, షర్మిల ఇద్దరూ ఒకే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఒకరి విలువ మరొకరు తెలుసుకునే అవకాశం ఉందా? అనేది చర్చనీయాంశంగా మారింది.

తల్లి, చెల్లి ఇద్దరూ గుర్తొస్తున్నారట..

ఇన్నాళ్లు అన్నాచెల్లెల్లిద్దరి మధ్య ఆస్తి గొడవల కారణంగా నేరుగా మాట్లాడుకోవడమే మానేశారు. ఇప్పుడు పరిస్థితి బాగోలేదు కాబట్టి షర్మిలకు ఏం కావాలో అది ఇచ్చేయాలని జగన్ అనుకుంటున్నారా? త్వరలో ఆస్తుల పంపకాలు షురూ అవుతాయా? అనే ప్రశ్నలు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి. వాస్తవానికి అన్నాచెల్లెల్లిద్దరి మధ్య భారతీరెడ్డితో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి దూరం పెంచారని టాక్. భారతీ రెడ్డిని పక్కనబెడితే సజ్జలకేంటి ప్రయోజనం అంటారా? నంబర్ గేమ్.. జగన్ తర్వాత తానే నంబర్ 2గా ఉండాలనే ఆరాటం. ఆ ఆరాటంతోనే సకల శాఖలకు ఆయనే మంత్రిగా వ్యవహరించి మొత్తానికి పార్టీనే మట్టిలో కలిపేశారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ పాయే… కాంగ్రెస్ పాయే.. మొదలెత్తుకుంటే కానీ ముందుకు జరగదు. ఈ తరుణంలో జగన్ మెడకు కేసుల ఉచ్చు తిరిగి బిగించుకోకా మానదు. మరి జగన్ జైలుకు వెళ్తే పార్టీ బాధ్యతలను తిరిగి తల్లి విజయమ్మ, చెల్లి షర్మిల తీసుకుంటారా? మొత్తానికి జగన్‌కు అయితే ఇప్పుడు తల్లి, చెల్లి ఇద్దరూ గుర్తొస్తున్నారట. కష్టాలొచ్చేసరికి కన్నవాళ్లు.. తోడబుట్టినది కనిపిస్తున్నారట. మరోవైపు షర్మిలకు కూడా కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల నుంచి వ్యతిరేకత వస్తోంది. ఈ తరుణంలో ఆమె కూడా అన్నే దిక్కు అనుకునే అవకాశం ఉంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

YS Jagan : పడి లేచిన కెరటమవుతారా? పత్తా లేకుండా పోతారా?

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడే అసలు సిసలైన పరీక్ష. ఒకప్పుడు జగన్ తండ్రి, దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన సమయంలో అయినా ఆయనకు కొందరు రాజకీయ ప్రముఖులు అండగా నిలిచారు. ఇప్పుడు ఎంతమంది నిలుస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైంది. 11 అసెంబ్లీ.. 4 ఎంపీ సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది. ఇంతటి దారుణ పరాజయం వైసీపీ పెట్టిన తర్వాత ఇదే తొలిసారి. కాబట్టి ఇప్పుడు జగన్‌కు ఇది అత్యంత కష్టకాలం. ఆయన లైఫ్‌లో వరస్ట్ డేస్ తిరిగి రాబోతున్నాయనడంలో సందేహమే లేదు. జగన్ ఎందుకు ఓటమి పాలయ్యారనే విషయాలను పక్కనబెడితే ఆయనతో నిలిచేదెవరనేదే ఆసక్తికరం. వైసీపీ తరుఫున గెలిచిన వారంతా జగన్‌తో ఉంటారా? అనేది ప్రశ్నార్థకమే. వీరిలో ఎందరు ఉంటారో.. ఎందరు పక్క చూపు చూస్తారో తెలియదు. మొత్తంగా జగన్ జీరో అయినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు.

ఇదే అసలు సిసలైన పరీక్ష..

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికీ అధికారం కావాలి. అధికారాన్ని అనుభవించేందుకు అలవాటు పడిన వ్యక్తి అది లేకుండా ఒక్క క్షణం కూడా నిలవలేడు. ఇది లోక రీతి. ఈ లెక్కన చూస్తే జగన్ జీరో అయినా ఆశ్చర్యం లేదు. అలాగే కేసులు కూడా జగన్ మెడ చుట్టూ చుట్టుకునే అవకాశం ఉంది. జగన్ కూడా లేకుంటే పార్టీ పరిస్థితి ఏంటన్న ఆందోళన సైతం గెలిచిన నేతలకు ఉండొచ్చు. కాబట్టి వారంతా వైసీపీలోనే కొనసాగుతారని భావించడం తప్పే అవుతుంది. ఇప్పటి వరకూ గెలిచిన ఎమ్మెల్యేలు కానీ.. ఎంపీలు కానీ తాడేపల్లి వైపు కూడా తిరిగి చూడలేదని టాక్. కనీసం ప్రతిపక్ష హోదా కూడా జగన్‌ పార్టీకి దక్కలేదు. జగన్‌కు ఇంతకు మించిన దారుణ పరిస్థితి ఉండదేమో. ఇదే అసలు సిసలైన పరీక్ష. దీనిని జగన్ ఎలా దాటుతారు? ఈ పరిస్థితిని ఎదుర్కొని నిలుస్తారా? జీరోతో తన జీవితాన్ని మళ్లీ మొదలు పెడతారా? లేదంటే విపక్షాలు విమర్శిస్తున్నట్టుగా లండన్ వెళ్లి పోయి వ్యాపారాలు చూసుకుంటారా? ప్రతిదీ ఆసక్తికరంగానే ఉంది.

సహకరించే వారేరి?

నిన్న మొన్నటి వరకూ జగన్‌కు అండగా ప్రధాని మోదీ ఉండేవారు. ఇప్పుడు చంద్రబాబును కాదని మోదీ సైతం జగన్‌కు సాయం చేయలేరు. కాబట్టి కేంద్రం నుంచి కూడా ఎలాంటి సాయాన్ని వైసీపీ పొందలేదనడంలో సందేహమే లేదు. ఇప్పుడు జగన్ సమస్యల వలయంలో ఉన్నారు. ఒకరకంగా చెప్పాలంటే.. అంతెత్తు ఎగిసి నేలకు చేరిన కెరటం. తిరిగి అదే స్పీడుతో కాకున్నా ఆలస్యంగానైనా లేస్తారా? లేదంటే పత్తా లేకుండా పోతారా? అనేది చర్చనీయాంశంగా మారింది. ఆయనకు పట్టుదల ఉండొచ్చు కానీ సహకరించే వారేరి? నడిసంద్రంలో ఉన్నారు. ఒడ్డుకు చేర్చే నావ కోసం ఎదురు చూస్తున్నారు. గెలిచిన నేతలే తాడేపల్లి వైపు చూడటం లేదంటే.. ఓడిన నేతలు చూస్తారన్న నమ్మకం కూడా లేదు. కొంతమంది అయితే జగన్‌తో ఉండొచ్చు. వారికి కూడా వేరే దిక్కు లేదు కాబట్టి. అసలు జగన్‌ను ముంచిందే వారు కదా.. వారితో కలిసి పార్టీని పైకి లేపడమంటే సాధ్యమయ్యే పనేనా? ఏమో.. ఈ ప్రశ్నలన్నింటికీ కాలమే సమాధానం చెప్పాలి.

Chandrababu : క్లిస్టర్ క్లియర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ.. ప్రతిపక్షమే లేకుండా చేసిన ఘనత చంద్రబాబుదే..

దాదాపు 163 సీట్లా? కలలో కూడా ఊహించని విజయమిది.. క్లిస్టర్ క్లియర్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ.. ఐదేళ్ల అరాచకానికి చెంపపెట్టు… నోటి దురుసుకు తగిలిన దెబ్బ.. సంక్షేమానికి అందని ఫలాలు.. అభివృద్ధికే ఓటేసిన ఏపీ ప్రజానీకం.. పథకాలు కాదు.. ప్రాజెక్టులు కావాలన్న తపన.. రోడ్లు కూడా వేయలేని ప్రభుత్వానికి వెన్నుపూస విరిచేసిన ఏపీ ప్రజానీకం… కొండంత ఆశ చూపి.. గోరంత కూడా చేయలేని చేతకాని తనానికి పెట్టిన చెక్.. ఉద్యోగాలు.. ఉద్యోగుల వెతలు పట్టని ప్రభుత్వాన్ని రెక్కలు విరిచేసిన ఏపీ ప్రజానీకం. ఇది ఒక్క వైసీపీ ప్రభుత్వానికే కాదు.. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వానికైన అతి పెద్ద గుణపాఠమే.

చంద్రబాబు ఇంతటి మైండ్ వర్క్ చేశారా?

టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈసారి పట్టువదలని విక్రమార్కుడే అయ్యారు. తనను జైలు పాలు చేసిన వైసీపీ అధినేతకు కొట్టకుండా తిట్టకుండా దెబ్బేశారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో సైకిల్‌ను దూసుకెళ్లేలా చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి లేకుండా చేశారు. ఒక మౌనమునిలా చంద్రబాబు ఇదంతా చేశారు. 23 ఏళ్ల తర్వాత కొడాలి నానిని ఇంటికే పరిమితం చేసిన ఘనత చంద్రబాబుదే. అసలు ఇంతటి ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఎవరికీ అంతుబట్టడం లేదు. నిన్న మొన్నటి వరకూ ఎగిరెగిరి పడిన వైసీపీ నేతలు కనీసం బయటకు కూడా కనిపించడం లేదు. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది? చంద్రబాబు ఇంతటి మైండ్ వర్క్ చేశారా? ముఖ్యంగా ఏపీని అర్థం చేసుకోవడంలో ఆయన అంతలా ఎలా సక్సెస్ అయ్యారు? 1994లో టీడీపీ భారీ విజయం సాధించింది. ఇప్పుడు అంతకు మించిన విజయం దిశగా పార్టీని ఆయన ఎలా నడిపించగలిగారు? ఇదంతా ఎలా సాధ్యం?

క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్..

వైసీపీ అపజయాలన్నింటినీ జనాల్లోకి తీసుకెళ్లడంలో ముందుగా కూటమి సక్సెస్ అయ్యింది. ఆ తరువాత చంద్రబాబు అర్థం చేసుకున్న విషయం.. క్యాస్ట్ అండ్ కాంబినేషన్స్.. ఏపీ కులానికి పెద్ద పీట వేస్తుందనడంలో సందేహం లేదు. ఇక్కడ కమ్మ, రెడ్డి, కాపు సామాజిక వర్గాలదే హవా. కమ్మ కులాన్ని దాదాపుగా తన పక్కనే పెట్టుకున్నారు. జనసేన ద్వారా కాపులందరినీ ఏకం చేశారు. వైసీపీపై వ్యతిరేకతతో ఉన్న రెడ్లందరినీ టీడీపీలోకి లాగేశారు. ఇక దళితులపై జరిగిన అరాచకాలను జనంలోకి తీసుకెళ్లడంలో సక్సెస్ అయ్యారు. బీసీలకు దక్కని గౌరవాన్ని వారికి తెలిసేలా చేశారు. ఇక్కడ కులమే కాదు.. అభివృద్ధి లేమి కూడా నూటికి నూరు శాతం పని చేసింది. దీంతో పాటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంకృతం కూడా ఎన్డీఏ కూటమికి కలిసొచ్చింది. మొత్తమ్మీద రాజధాని లేకుండా వైసీపీ చేస్తే.. ప్రతిపక్షమే లేని రాష్ట్రంగా చంద్రబాబు ఏపీని మార్చేశారు.

AP Election Results : తొలి ఫలితం నగరి నుంచే.. మొదట తేలేది రోజా జాతకమే..!

మరో మూడు రోజుల్లో ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే ఇక్కడ లోక్‌సభతో పాటు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సైతం వెలువడనున్నాయి. పైగా వైసీపీ వర్సెస్ కూటమి హోరాహోరా పోరు జరిగింది. ఎప్పుడైనా హోరాహోరీ పోరు జరిగితేనే కదా.. నరాలు తెగే ఉత్కంఠ ఉండేది. ప్రస్తుతం ఏపీలో పరిస్థితి అలాగే ఉంది. ఇరు పార్టీలు విజయంపై ధీమాతోనే ఉన్నట్టు కనిపిస్తున్నాయి. లోలోపల ఎలా ఉన్నారనేది వారికే ఎరుక. జూన్ నాలుగో తేదీన ఉదయం 11 గంటల వరకూ ఏపీలో ఏ పార్టీ గెలుస్తుందనే విషయంపై పక్కాగా ఓ క్లారిటీ వస్తుంది. ఇక ఏపీలోని అన్ని ప్రాంతాల కంటే ముందుగా వెలువడేది వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా జాతకమే. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గ ఫలితం మొదట రానుందని తెలుస్తోంది. తొలి ఫలితం వైసీపీకి సక్సెస్‌ను అందిస్తుందా? లేదంటే ముంచేస్తుందా?

12 గంటల్లోపే తేలనున్న రోజా జాతకం..

చిత్తూరు జిల్లాలో మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో చిన్న నియోజకవర్గం నగరి. ఇక్కడి నుంచే ఏపీలో తొలి ఫలితం వెలువడనుందని టాక్. ఎందుకంటే ఇక్కడ మొత్తం ఓటర్లు 2,02,574 మాత్రమే. 229 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరిగింది. ఇక కౌంటింగ్ కోసం 14 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. మొత్తంగా 17 రౌండ్లలో ఫలితం తేలనుంది. తొలి ఫలితం మధ్యాహ్నం 12 గంటలలోపే వచ్చే అవకాశం ఉంది. అంటే 4వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు రోజా జాతకం తేలిపోతుందన్న మాట. వాస్తవానికి నగరి నియోజకవర్గం గతంలో అయితే వైసీపీకి చాలా బాగుండేది. అలాంటిది ఈ ఎన్నికల సమయంలో పార్టీకి అండగా నిలిచిన వారంతా టీడీపీలోకి జంప్ చేశారు. దీనికి కారణం లేకపోలేదు లెండి. అంతా రోజమ్మే చేశారు. అధికారం కట్టబెట్టినప్పుడు ఎలా ఉండాలి? కానీ ఆమె ఎవ్వరినీ దగ్గరకు రానివ్వలేదు. అధికారం తనది.. పెత్తనం అన్నలది. వారు ప్రతి పనికీ రేటు ఫిక్స్ చేసి మరీ వసూళ్లు చేశారని సొంత పార్టీ నేతలే మండిపడ్డారు.

రోజా టాక్స్.. అన్నల దందా..

వైసీపీని వీడిన నేతలు సైతం రోజా బాగోతాన్ని బయటపెట్టే వీడారు. రోజా టాక్స్ మొదలుకుని అవినీతి.. దందాలు అన్నీ బయట పెట్టారు. ఇక పార్టీ టికెట్లను కేటాయిస్తున్న సమయంలోనే రోజాకు మాత్రం టికెట్ ఇవ్వొద్దని స్థానిక నేతలంతా అధిష్టానానికి మొరబెట్టుకున్నారు. ఒకవేళ ఇచ్చినా కూడా సహకరించబోమని వెల్లడించారు. వాస్తవానికి నగరిలో రోజాకు విపక్షాల కంటే సొంత పార్టీ నేతలే ఎక్కువగా ఎదురు తిరిగారు. ఆమె ఓటమికి సొంత పార్టీ నేతలే కృషి చేశారు. రోజా టాక్స్.. అన్నల దందాలతో ఎక్కడలేని నెగిటివ్ రోజాపై వచ్చింది. మొత్తానికి రోజాను ఈసారి అసెంబ్లీ గేటును కూడా టచ్ చేయనివ్వకూడదని వైసీపీ నేతలు గట్టిగానే కష్టపడ్డారు. అలాగే నగరిలో టీడీపీ నుంచి గాలి భాను ప్రకాష్ పోటీ చేశారు. ఆయన ఈసారి గట్టిగానే కష్టపడ్డారు. కాబట్టి ఆయన ఈసారి పక్కాగా గెలుస్తారని అంటున్నారు. రోజా సవాళ్లైతే మరోలా ఉన్నాయి. గాలిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వబోనని సవాల్ చేశారు. మరి ఇంత ధీమాతో ఉన్న రోజా గెలుస్తారో.. గాలి భానుప్రకాష్ గెలుస్తారో చూడాలి.

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఎప్పుడంటే?

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రధాని మోడీ.. ఎన్టీవీతో ఈ సార్వత్రిక ఎన్నికల ముచ్చట్ల గురించి మాట్లాడనున్నారు. లోక్‌సభ ఎన్నికల వేళ మీడియాకు అతి తక్కువ సమయం మాత్రమే ఇవ్వగలిగేంత బిజీ షెడ్యూల్‌లో కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం గమనార్హం. గతంలో భక్తి టీవీ నిర్వహించిన కోటి దీపోత్సవానికి విశిష్ట అతిథిగా ప్రధాని మోడీ హాజరయ్యారు.

ఎన్నికలు దగ్గర పడుతున్న కీలక సమయంలో ఎన్టీవీకి ప్రధాని ఇంటర్వ్యూ ఇవ్వడమనేది చాలా పెద్ద విషయం. అలా చూసుకున్నా ఎన్టీవీ దేశ టెలివిజన్‌ చరిత్రలోనే అరుదైన ఘనతను సాధిస్తోందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో జరుగుతున్న కీలక పరిణామాలపై ప్రధాని మోడీ సమాధానమివ్వనున్నారు. ప్రజల మెదళ్లలో నానుతున్న ఎన్నో ప్రశ్నలు, ప్రచారంలో ఉన్న మరెన్నో సందేహాలపై తెలుగు ప్రజల తరపున ఎన్టీవీ ప్రశ్నించనుంది. ఒకే ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు ప్రధాని మోడీ దగ్గర కానున్నారు.

ప్రధాని మోడీతో ఎన్టీవీ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి: https://www.youtube.com/watch?v=9sBOhC540e8

డల్లాస్ లో అంబరాన్ని అంటిన సుస్వర మ్యూజిక్ అకాడమీ 21వ వార్షిక సంబరాలు..!

డాక్టర్ మీనాక్షి అనుపిండి.. నార్త్ అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో డల్లాస్ నగరంలో పేరుపొందిన శాస్త్రీయ సంగీత శిక్షకురాలు మరియు సుస్వర మ్యూజిక్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు. దాదాపు 21 సంవత్సరాల నుంచి ఆమె సుస్వర మ్యూజిక్ అకాడమీ పేరిట ఎంతో ఘనంగా ప్రతి ఏడాది వార్షికోత్సవ సంబరాలను నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ ఏడాది మే 5వ‌ తేదీ ఆదివారం నాడు డల్లాస్ నగరంలో గ్రాండ్ సెంటర్ అనే ఆడిటోరియంలో సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవ సంబరాలను అంబరాన్ని అంటేలా నిర్వ‌హించారు.

ఈ ఉత్సవానికి డల్లాస్ నగరంలోని ప్రముఖులు మరియు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అతిధులుగా హాజర‌య్యారు. తానా ప్రపంచ సాహిత్య వేదిక చైర్మన్ శ్రీ ప్రసాద్ తోటకూర గారు, డల్లాస్ లో ఇండో అమెరికన్ కౌన్సిల్ సభ్యులుగా ముఖ్యపాత్రను పోషిస్తున్న శ్రీ గోపాల్ పోనంగి గారు, ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ కిషోర్ కంచర్ల గారు, శ్రీమతి శారద సింగిరెడ్డి గారు, శ్రీ ప్రకాష్ రావు గారు అతిధులగా వేదికను అలంకరించారు. అలాగే తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ సినీ గేయ రచయిత, ఆస్కార్‌ అవార్డు గ్రహీత చంద్రబోస్ గారు, ప్రముఖ సంగీత దర్శకులు ఆర్. పి. పట్నాయక్ గారు, టాలీవుడ్ డైరెక్ట‌ర్ వి. ఎన్‌. ఆదిత్య‌ గారి తో సహా పలువురు సినీ ప్రముఖులు పాల్గొని సంద‌డి చేశారు.

ఈ వార్షిక సంబరాల్లో మీనాక్షి అనిపిండి గారు తన శిష్య బృందంతో 7 సిగ్మెంట్లలో దాదాపు 30కి పైగా సంప్రదాయ సంగీత కీర్తనలను ప్రదర్శన ఇచ్చారు. 10 గంటల పాటు నిర్విరామంగా సాగిన ఈ సాంస్కృతిక గాన ప్రదర్శన ప్రేక్షకులందరినీ కుర్చీల్లో నుంచి కదలకుండా కట్టిపడేసింది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అలాగే సుస్వర మ్యూజిక్ అకాడమీ వార్షిక సంబరాల వేదిక పై, చంద్రబోస్ గారికి “సుస్వర సాహిత్య కళానిధి” అనే బిరుదునిచ్చి సత్కరించారు.

చంద్ర‌బోస్ గారు త‌న స్వ‌గ్రామం చల్లగరిగెలో తల పెట్టిన ఆస్కార్ గ్రంధాల‌య నిర్మాణానికి, ఈ కార్య‌క్ర‌మం ద్వారా 15 వేల డాల‌ర్స్ కు పైగా విరాళం రావ‌డం మ‌రొక విశేషం. ఈ వార్షిక సంబరాల్లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు ఆర్. పి. పట్నాయక్ గారు త‌న మాట‌ల‌తో , పాట‌ల‌తో ప్రేక్ష‌కులంద‌రినీ అల‌రించారు. ఆయ‌న‌కు, “సుస్వర నాద‌నిధి” ,అనే బిరుదుతో మీనాక్షి అనిపిండి గారు సత్కారం చేయ‌డం జ‌రిగింది. ఇక సుస్వర మ్యూజిక్ అకాడమీ లోని విద్యార్థినీ, విద్యార్థులు వాలంటీర్లుగా పనిచేసి ఈ కార్యక్రమాన్ని ఆధ్యంతం ర‌క్తిక‌ట్టించ‌డం మెచ్చుకోదగ్గ అంశం..
కుమారి సంహితఅనిపిండి, శ్రీమతి ప్రత్యూష తమ వ్యాఖ్యానంతో కార్యక్రమాన్ని రక్తి కట్టించారు.

72 థియేటర్లతో స్టార్ట్‌ అయి 120 థియేటర్లలో హల్‌చల్‌ చేస్తున్న ‘ఇంటి నెం.13’

సినిమాలో కొత్తదనం ఉంటే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూస్తారని ‘ఇంటి నెం.13’ చిత్రం ప్రూవ్‌ చేస్తోంది. ఈమధ్యకాలంలో థియేటర్లకు వచ్చి సినిమా చూసే ప్రేక్షకుల సంఖ్య తగ్గిపోయిందనే చెప్పాలి. అలాంటిది మార్చి 1న విడుదలైన ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని అనూహ్యంగా థియేటర్లకు తరలి వచ్చి చూస్తున్నారు. 72 థియేటర్లలో ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేశారు. సినిమాకి మంచి టాక్‌ రావడంతోపాటు సినిమాలోని ట్విస్టులకు, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌కి, డైరెక్టర్‌ టేకింగ్‌కి ఆడియన్స్‌ థ్రిల్‌ అవుతున్నారు. మౌత్‌ టాక్‌ బాగా స్ప్రెడ్‌ అవడంతో కలెక్షన్లు కూడా బాగా పెరిగాయి. ఇప్పుడు ‘ఇంటి నెం.13’ చిత్రం రెండు రాష్ట్రాల్లో 120 థియేటర్లలో ప్రదర్శింపబడుతోంది.

ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్‌ గురించి దర్శకుడు పన్నా రాయల్‌ తెలియజేస్తూ ‘మార్చి 1న చాలా సినిమాలు రిలీజ్‌ అయ్యాయి. అందులో పెద్ద సినిమాలు ఉన్నాయి, చిన్న సినిమాలు ఉన్నాయి. వాటి మధ్య రిలీజ్‌ అయిన మా సినిమాకి ఇంత మంచి టాక్‌ రావడం చాలా హ్యాపీగా ఉంది. ఎంతో సైలెంట్‌గా మొదలైన మా సినిమా ఇప్పుడు రెండు రాష్ట్రాల్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఎక్కడ చూసినా హౌస్‌ఫుల్‌ కలెక్షన్స్‌ ఉన్నాయి. ముఖ్యంగా ప్రతి ఏరియాలోనూ సెకండ్‌ షోలు హౌస్‌ ఫుల్‌ అవ్వడం చూస్తే సినిమా ఏ రేంజ్‌ సక్సెస్‌ సాధించిందో అర్థమవుతుంది. థియేటర్లలో జనం లేకపోయినా సూపర్‌హిట్‌ అయిందని, కలెక్షన్స్‌ దుమ్ము రేపుతోందని పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం ‘ఇంటి నెం.13’ చిత్రానికి రాలేదు. ఎందుకంటే కేవలం 72 థియేటర్లలో ఈ సినిమాని రిలీజ్‌ చేస్తే ఈ నాలుగు రోజుల్లో అన్ని ఏరియాల్లో థియేటర్లు పెరిగి ఇప్పుడు 120 థియేటర్లలో మా సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతోంది. రిలీజ్‌ అయిన మొదటి రోజు, మొదటి షో నుంచే మౌత్‌ టాక్‌ బాగా స్ప్రెడ్‌ అవడంతో సూపర్‌హిట్‌ అనే టాక్‌ వచ్చేసింది. ఒక ఏరియా అని కాకుండా సినిమా రిలీజ్‌ అయిన అన్ని ఏరియాల్లోనూ ఇదే టాక్‌తో రన్‌ అవుతోంది. మా సినిమాకి ఇంత మంచి టాక్‌ రావడానికి సినిమాలోని థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ అయిన సస్పెన్స్‌, మిస్టరీ, ఎవరూ ఊహించలేని ట్విస్టులు ముఖ్య కారణం. ఇవన్నీ సినిమాని ఒక రేంజ్‌కి తీసుకెళ్లాయి. వీటన్నింటికీ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ తోడవ్వడంతో ఆడియన్స్‌ కొత్త అనుభూతికి లోనవుతున్నారు. సినిమాలో లెక్కకు మించిన గూస్‌బంప్స్‌ సీన్స్‌ ఉన్నాయి. వాటిని ప్రతి ఒక్కరూ ఎంజాయ్‌ చేస్తున్నారు. మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లోని ఆడియన్స్‌ సినిమాలోని అని ఎలిమెంట్స్‌ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈమధ్యకాలంలో ఇలాంటి థ్రిల్లింగ్‌ మూవీ రాలేదని మల్టీప్లెక్స్‌ ఆడియన్స్‌ చెప్పడం మాకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లో కలెక్షన్లపరంగా హై రేంజ్‌కి వెళ్ళిన సినిమా ఇది. ఇప్పుడు ఉన్న టాక్‌ చూస్తుంటే మా సినిమా డెఫినెట్‌గా ఇంకా పెద్ద రేంజ్‌కి వెళ్తుందన్న కాన్ఫిడెన్స్‌ మాకు పెరిగింది. థియేటర్లలో ఆడియన్స్‌ రెస్పాన్స్‌ని ప్రత్యక్షంగా చూసిన నాకు ‘ఇంటి నెం.13’ చిత్రం తప్పకుండా ఒక కొత్త ట్రెండ్‌ క్రియేట్‌ చేస్తుంది అనిపిస్తోంది’ అన్నారు.

రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌, డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌ పతాకాలపై పన్నా రాయల్‌ దర్శకత్వంలో హేసన్‌ పాషా నిర్మించిన ఈ సినిమాకి సంగీతం వినోద్‌ యాజమాన్య అందించారు. సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌ సమకూర్చారు.

‘నా ఇంటి నెంబరు 13…’ ప్రమోషనల్‌ సాంగ్‌తో హల్‌చల్‌ చేస్తున్న రాజలక్ష్మీ

డిఫరెంట్‌ హారర్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ‘ఇంటి నెం.13’ చిత్రానికి సంబంధించి విడుదలైన ఫస్ట్‌ లుక్‌, టీజర్‌ ఇప్పటికే ఆడియన్స్‌లో ఒక బజ్‌ క్రియేట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాకి సంబంధించి ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ఇప్పుడు మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ‘పుష్ప’ తమిళ్‌ వెర్షన్‌లోని ‘సామీ..’ పాటను పాడిన రాజలక్ష్మీ ఈ ప్రమోషనల్‌ సాంగ్‌ను ఎంతో హుషారుగా ఆలపించారు. ఈ పాటలోనే మేకింగ్‌ విజువల్స్‌ను కూడా జోడించారు. దీంతో సినిమాని ఎంత కష్టపడి తీశారు, ఎలాంటి క్వాలిటీతో చేశారు అనేది ఈ పాట చూస్తే అర్థమవుతుంది.

కాలింగ్‌బెల్‌, రాక్షసి చిత్రాలతో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసిన డైరెక్టర్‌ పన్నా రాయల్‌ ‘ఇంటి నెం.13’ చిత్రాన్ని ఆ చిత్రాలకు ఎన్నో రెట్లు క్వాలిటీతో రూపొందించారు. కంటెంట్‌ పరంగా ఇప్పటివరకు వచ్చిన హారర్‌ సినిమాలకు భిన్నంగా ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ చిత్రాన్ని మార్చి 1న చాలా గ్రాండ్‌గా రిలీజ్‌ చెయ్యబోతున్నారు. రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌ పతాకంపై డా. బర్కతుల్లా సమర్పణలో హేసన్‌ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు.

విడుదలైన ప్రమోషన్‌ సాంగ్‌ గురించి డైరెక్టర్‌ పన్నా రాయల్‌ మాట్లాడుతూ ‘సినిమా కాన్సెప్ట్‌ను, మేకింగ్‌ను తెలియజేసే ఒక ప్రమోషనల్‌ సాంగ్‌ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. అయితే ఎవరితో ఈ పాటను పాడించాలా అని ఆలోచిస్తున్నప్పుడు ‘పుష్ప’ తమిళ్‌ వెర్షన్‌లో ‘సామి..’ పాటను పాడిన రాజలక్ష్మీ అయితే బాగుంటుందని ఆమెను సంప్రదించడం జరిగింది. ఆమె ఎంతో హుషారుగా, మరెంతో అద్భుతంగా ఈ పాటను పాడారు. ఈ వీడియోలో మేకింగ్‌ విజువల్స్‌ని కూడా జోడించడం వల్ల పాటకు ఒక కొత్త అందం వచ్చింది. ఈ పాట మా సినిమా ప్రమోషన్‌కి ఎంతో ఉపయోగపడుతుందన్న నమ్మకం మాకు వుంది. మార్చి 1న విడుదలవుతున్న మా ‘ఇంటి నెం.13’ చిత్రానికి ఘన విజయాన్ని చేకూర్చి మమ్మల్ని ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. హారర్‌ జోనర్‌లో ‘ఇంటి నెం.13’ డెఫినెట్‌గా ఒక కొత్త ట్రెండ్‌ని క్రియేట్‌ చేస్తుంది. హాలీవుడ్‌ టెక్నీషియన్స్‌తో చేయించిన ఈ సినిమాకి పెద్ద ప్లస్‌పాయింట్‌ అవుతాయి. ఔట్‌పుట్‌ అద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో నిర్మాత హేసన్‌ పాషాగారు ఖర్చుకు వెనకాడకుండా ఎంతో క్వాలిటీగా ఈ సినిమా రావడానికి సహకరించారు. ‘ఇంటి నెం.13’ తప్పకుండా ఇది ప్రేక్షకులకు డిఫరెంట్‌ ఎక్స్‌పీరియన్స్‌ నిస్తుంది’’ అన్నారు.

నిర్మాత హేసన్‌ పాషా మాట్లాడుతూ ‘‘తెలుగు ఆడియన్స్‌ ఇప్పటివరకు చూడని ఒక కొత్త తరహా చిత్రం ‘ఇంటి నెం.13’. ఈమధ్యకాలంలో ఆడియన్స్‌ని థ్రిల్‌ చేసే హారర్‌ మూవీస్‌ ఎక్కువగా రాలేదు. ఈ సినిమా డెఫినెట్‌గా ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతినిస్తుంది’’ అన్నారు.

నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్‌రాజ్‌, తనికెళ్ళ భరణి, పృథ్విరాజ్‌, నెల్లూరు సుదర్శన్‌, శివన్నారాయణ, సత్యకృష్ణ, విజయ రంగరాజు, రవివర్మ, దేవియాని తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకు సంగీతం: వినోద్‌ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌, ఎడిటింగ్‌: సాయినాథ్‌ బద్వేల్‌, కొరియోగ్రఫీ: కె.శ్రీనివాస్‌, మాటలు: వెంకట్‌ బాలగోని, పన్నా రాయల్‌, పాటలు: రాంబాబు గోశాల, నిర్మాత: హేసన్‌ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్‌.