Dasari Narayana Rao : ఐదు నందులు తెచ్చి అందరినీ ఆశ్చర్య పరిచిన ఆడవాళ్ళ చిత్రం… కంటే కూతురునే కనాలి…!

Dasari Narayana Rao : సినిమా అనగానే భారీ ఫైట్లు, హీరో తొడగొట్టే సన్నివేశాలు, హీరోయిన్ తో రొమాన్స్ ఇలాంటి కమర్షియల్ సినిమాలకు కొదవ లేదు. మరీ ముఖ్యంగా హీరోల ఎలివేషన్ లో ఎక్కడో కొన్ని సన్నివేశాల్లో హీరోయిన్ ను చూపించి గ్లామర్ కోసం మాత్రమే అన్నట్టుగా పెట్టుకునే సినిమాలకు తెలుగులో కొదవలేదు. అలాంటి సినిమాలే వస్తున్నాయి అంటే ప్రేక్షకులు కేవలం హీరో సెంట్రిక్ సినిమాలనే ఇష్టపడుతున్నారా..? కొత్తగా కథ చెబితే ప్రేక్షకులు ఊ కొట్టరా..? ఇలాంటి ప్రశ్నలకు సమాధానంగా వచ్చిన చిత్రాలే కర్తవ్యం, ప్రతిఘటన, ప్రతిధ్వని, ఒసేయ్ రాములమ్మ, కంటే కూతురినే కనాలి. ఈ చిత్రాలు సూపర్ హిట్లుగా నిలిచి హీరోయిన్ సెంట్రిక్ సినిమాలు కూడా జనాలు ఆదరిస్తారని నిరూపించుకున్నాయి.

కానీ ఇటువంటి సినిమాలు ఎపుడో ఒకసారి అలా వచ్చిపోతుంటాయి. కానీ ఆ సినిమాల ప్రభావం మాత్రం జనాలపై పోదు. ఇక అలాంటి ఒక చిత్రం గురించే ఇపుడు చెప్పబోయేది. అదే దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన కంటే కూతురినే కనాలి సినిమా. దాసరి నారాయణరావు గారు అప్పటికే ఒసేయ్ రాములమ్మ అంటూ తెలంగాణ బిడ్డ సినిమా తీసి 1998 లో సంచలనం సృష్టించారు. ఇక ఆతరువాత ఆయన తన కుమారుడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ గ్రీకు వీరుడు అనే సినిమా తీసినా అది జనాలకు ఎక్కలేదు. ఇక మరోసారి లేడీ ఓరియెంటెడ్ చిత్రానికే ఆయన మొగ్గుచూపారు. పురుషాధిక్య సమాజంలో ఆడవాళ్ళ గొప్పతనం సునిశితంగా చెప్పిన చిత్రం అది.

ఐదు నందులు అందుకున్న కంటే కూతురినే కనాలి….

ఇక రమ్య కృష్ణ , జయసుధ ముఖ్య పాత్రలలో నటించిన ఈ చిత్రంలో దాసరి, జయసుధ భర్తగా ప్రభుత్వ మాస్టారు పాత్రలో నటించారు. ఇక బ్రహ్మానందం, నర్రా, బ్రాహ్మజీ, పృథ్వీ, జే వి సోమయాజులు, పీ జే శర్మ, ఆలీ, తనికెళ్ల భరణి, అల్లు రామలింగయ్య నటించారు. కేవలం 25 రోజుల షూటింగ్ ప్రణాళికతో తక్కువ బడ్జెట్ తో సినిమా రూపొందించారు దాసరి. కథా, స్క్రీన్ ప్లే దాసరి గారైతే, ఆయన శిష్యుడు మధు తోటపల్లి సంభాషణలు రాసారు. ఇక ఈ సినిమాలో కంటే కూతురినే కనాలిరా… అంటూ సాగే పాట ఇప్పటికి వింటూనే ఉన్నాం. అటువంటి గుర్తుండిపోయే సంగీతాన్ని అందించింది వందేమాతరం శ్రీనివాస్ గారు. ఇంటికి వారసుడు ఉండాలి, తండ్రి పేరును నిలబెట్టేది, వృధాప్యంలో తోడుండేది కొడుకే అంటూ కొడుకును మాత్రమే కనాలి, కూతుర్లు భారం అని తలచే చాలామంది భావనలు తప్పు అని చాలా సున్నితంగా చూపించిన చిత్రం ఇది.

కూతురు వంటింటికే పరిమితమని చదివించడం అనవసరం అనే రోజుల్లో ఒక కూతురు కూడా తల్లిదండ్రుల భాద్యత తీసుకోగలదని, పురుషాధిక్య సమాజాన్ని ఆలోచింపగలిగేలా చేసిన చిత్రం. అందుకే ఈ సినిమాకు జనాల నీరాజనాలతో పాటు ఐదు నందులు కూడా వచ్చాయి. ఈ తరం వారికి ఇలాంటి సమాజానికి ఉపయోగపడే చిత్రాలు తీసే దర్శకుల కోసం సినీ పరిశ్రమ కచ్చితంగా ఎదురుచూస్తోంది. అప్పుడైనా ఇప్పుడైనా కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులు కచ్చితంగా ఆదరిస్తారు. కేవలం సినిమాను ఒక వ్యాపారంలా చూసే ధోరణి నుండి బయటికి వచ్చి ఇలాంటి సమాజానికి ఉపయోగపడే చిత్రాలను తీయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.