థైరాయిడ్, నీటి బుడగలతో బాధపడే వారికి సంతానం ఉండదా.. దానికి ఏం చేయాలి?

గర్భం దాల్చేందుకు ఎక్కువగా మహిళలకు ఇబ్బంది కలిగించేది పాలిసిస్టిక్ ఓవరీ (PCO). దీనినే మనం వాడుక భాషలో నీటి బుడగలు అంటారు. ఇవి గర్భాశయం ఇరువైపుల ఉండే అండాశయాలలో పేరుకుపోతాయి.

వీటి వల్ల శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి, ఒక్కొక్కరి శరీరతత్వాన్ని బట్టి.. కొందరిలో పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, కొందరిలో మొటిమలు రావడం, జుట్టు రాలడం, పెదవులు, గడ్డం పైన అవాంఛిత రోమాలు రావడం, మెడచుట్టూ చర్మం నల్లగా మారడం వంటి ఎన్నో లక్షణాలు ఏర్పడవచ్చు. ఈ సమస్య ఉన్న వాళ్లు బరువు పెరిగే కొద్ది అవి కూడా ఎక్కువ అవుతాయి. అందుకే వైద్యులు బరువు తగ్గాలని సలహా ఇస్తుంటారు.

ఇదిలా ఉంటే.. కొంతమందికి థైరాయిడ్ సమస్య ఉంటే పిల్లలు పుట్టరేమో అనే అనుమానం ఉంటుంది. ఇది శరీరంలోని హార్మోన్ల సమతుల్యత లోపం వల్ల ఇలాంటివి వస్తుంటాయి. ఇది ఈస్ట్రోజెన్‌, ప్రొజెస్టరాన్‌ హార్మోన్ల పనితీరును ఆటంకపరుస్తుంది. దీని వల్ల అండం విడుదల ఆలస్యం అవ్వడంతో సంతాన సాఫల్య అనే శాతం తగ్గుతుంది.

అంతే గానీ 100 శాతం సంతానం ఉండదు అనేది అవాస్తవం అంటూ నిపుణులు చెబుతున్నారు. చిన్నపాటి మార్పులు, వైద్యుల పర్యవేక్షణలో మందులు వాడితే మంచిదని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఈ వ్యాధి ఉన్న వాళ్లకు గర్భం నిర్ధారణ అయిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. లేదంటే పుట్టబోయే బిడ్డ విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.