GV Narayana : అన్నపూర్ణ స్టూడియోస్ కట్టడానికి కారణం మా నాన్న గారు… చిరంజీవి కి ఆ సలహా ఇచ్చింది నేనే…: నటుడు జీవి నారాయణ

GV Narayana : నవయుగ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన జీవీ ప్రసాద్ గారి కొడుకు జీవీ నారాయణ రావు గారు కే.బాలచందర్ గారి ‘అంతులేని కథ’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరోగా కొన్ని సినిమాల్లో నటించిన నారాయణ గారు, ఆ తరువాత సినిమా ప్రొడక్షన్ లో అడుగుపెట్టి యముడికి మొగుడు, చట్టానికి కళ్ళు లేవు వంటి సినిమాలను నిర్మించారు. ఇక సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను, చాలా సినిమాల్లో నటించిన ఆయన ఇంట్రస్టింగ్ విషయాలను పలు ఇంటర్వ్యూల్లో పంచుకున్నారు.

అన్నపూర్ణ స్టూడియో మా నాన్న వల్లే నాగేశ్వరావు గారు కట్టించారు…

నాగేశ్వరావు గారంటే పుట్టినప్పటి నుండి అభిమాన నటుడంటూ చెప్పిన నారాయణరావు గారు, అన్నపూర్ణ స్టూడియోస్ ఆవిర్భావం గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నాగేశ్వరావు గారి చాలా సినిమాలు సారథి స్టూడియోలోనే షూటింగ్ జరిగేవి. ఇక సారథి స్టూడియో జీవీ నారాయణ గారి తండ్రిది కావడంతో నాగేశ్వరావు గారితో ముందునుండి మంచి అనుబంధం ఉండేది. నాగేశ్వరావు గారు గుండె ఆపరేషన్ చేయించుకోడానికి అమెరికా వెళ్ళినప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు దేవదాస్ సినిమా రీమేక్ చేయాలని భావించి నవయుగ వారిని అడుగగా ఆలోచన బాగుందని ఒప్పుకున్నారు. ఒక క్లాసిక్ సినిమాను రీమేక్ చేయడం ఏమిటని నాగేశ్వరావు గారికి చాలా కోపం వచ్చి నవయుగ ప్రసాద్ గారితో గొడవ పడ్డారు. ఇక సారథి స్టూడియోలో స్ట్రైక్ కారణంగా తనే ఒక స్టూడియో నిర్మించాలని నాగేశ్వరావు గారు సంకల్పించి అన్నపూర్ణ స్టూడియోను నిర్మించారు. అలా ప్రసాద్ గారితో గొడవ అన్నపూర్ణ స్టూడియో ఏర్పాటుకు దోహదపడింది. ఇక ఇదే విషయాన్ని అక్కినేని నాగేశ్వరావు గారు చాలాసార్లు నారాయణ గారితో ప్రస్తావించేవారట. మీ నాన్న వల్లే అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించానని, నా పిల్లలకు మంచి ఆస్తి చేయగలిగానని చెప్పారట.

చిరంజీవి కి ఆ సలహా ఇచ్చాము…

జీవి నారాయణరావు గారు సౌత్ ఇండియన్ ఇండస్ట్రీ తరుపున డైరెక్టర్స్ పెట్టిన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో ట్రైనింగ్ తీసుకుని సినిమాల్లో అవకాశాలను అందుకున్నారు. అదే ఇన్స్టిట్యూట్ లో రజనీకాంత్, చిరంజీవి ఇలా ఎంతో మంది సౌత్ భాషలనుండి ట్రైనింగ్ తీసుకుని నేడు సూపర్ స్టార్లు, మెగాస్టార్లు అయ్యారు. అయితే మెగాస్టార్ కి ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వమని సలహా ఇచ్చింది నారాయణరావు గారే. చిలకమ్మ చెప్పింది అనే సినిమా షూటింగ్ కోసం పాలకొల్లు వెళ్లిన సమయంలో షూటింగ్ చూడటానికి వచ్చిన చిరంజీవి గారు రజనీకాంత్, నారాయణ రావు లను కలిసి తాను సినిమాల్లో నటించాలని అనుకుంటున్నట్లు చెబితే ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయితే బాగుంటుందని సలహా ఇచ్చారట. అలా చెన్నై వచ్చి ఇన్స్టిట్యూట్ లో చేరిన చిరు నేడు మెగాస్టార్ అయ్యారు అంటూ నారాయణ రావు తెలిపారు.