మాధురిదీక్షిత్ తో బాలయ్య బాలీవుడ్ ప్రయాణానికి ఎందుకు బ్రేక్ పడిందో తెలుసా?!

అప్పటి స్టార్ హీరోలైన చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున తెలుగులో విజయవంతమైన చిత్రాలు తీస్తూ.. బాలీవుడ్ లో కూడా అడుగు పెట్టారు. అయితే ఈ హీరోల బాలివుడ్ ప్రయాణం 1990 సంవత్సరంలో ప్రారంభమైంది. తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన అంకుశం చిత్రం ఘనవిజయం సాధించింది. ఇదే చిత్రాన్ని హిందీలోకి రీమేక్ చేస్తూ గీతాఆర్ట్స్ నిర్మాణం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ‘ప్రతిబంద్’ చిత్రం 1990 సెప్టెంబర్ లో విడుదల అయింది. హిందీలో చిరంజీవి తన మొదటి చిత్రంతో ఒక విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

ఆ తర్వాత 1989, అన్నపూర్ణ బ్యానర్, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో శివ చిత్రం విడుదలైంది. తెలుగులో అఖండ విజయం సాధించిన ఈ చిత్రాన్ని.. దాదాపుగా అదే నటినటులు, టెక్నీషియన్స్ తో హిందీలో శివ అనే పేరుతో 1990 డిసెంబర్ లో విడుదల చేశారు. అక్కడ ఈ చిత్రం ఘన విజయం సాధించింది.

ఆ తర్వాత 1992, కె.ఎస్.రామారావు నిర్మాణం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన చంటి ‌చిత్రంలో వెంకటేష్ మీనా హీరో, హీరోయిన్లుగా నటించారు. తెలుగులో ఈ సినిమా ఘన విజయం సాధించడంతో, హిందీలో 1993 సురేష్ ప్రొడక్షన్స్, మురళీ మనోహర్ రావు దర్శకత్వంలో ‘అనారి’ చిత్రం విడుదల అయ్యింది. సినిమాలో వెంకటేష్ కరిష్మకపూర్ హీరో, హీరోయిన్లుగా నటించారు. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పరాజయం పొందింది.

ఇదే సమయంలో ప్రముఖ నిర్మాత ఏఎం.రత్నం, బాలకృష్ణతో హిందీలో ఒక చిత్రాన్ని నిర్మించాలని, తేజాబ్ చిత్ర దర్శకుడైన ఎన్.చంద్రాను కలవడం జరిగింది. బాలకృష్ణతో సినిమా తీయడానికి దర్శకుడు ఎన్.చంద్ర అంగీకరించారు. ఇకపోతే తేజాబ్ చిత్రంలో ఎంతో పేరుపొందిన హీరోయిన్ మాధురి దీక్షిత్ ను ఈ సినిమాలో బాలకృష్ణతో జోడిగా తీసుకోవాలనుకున్నారు. తెలుగు చిత్రాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ మాధురి దీక్షిత్ వాటిని తిరస్కరించింది. ఆ క్రమంలో ఏఎం. రత్నం, ఎన్ చంద్ర ఆమెను కలిసి చివరికి ఒప్పించారు. అలా ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లడంలో కొంత ఆలస్యం అయ్యింది. అయితే దర్శకుడు చంద్ర డేట్స్ రెండు సంవత్సరాల వరకు ఖాళీ లేకపోవడంతో సినిమా కాస్త వాయిదా పడింది. తర్వాత దర్శకుడు ఎన్.చంద్ర డేట్స్ దొరికినప్పటికీ మళ్లీ బాలకృష్ణ తెలుగు సినిమాలతో బిజీ అయ్యారు. అలా బాలయ్య బాలీవుడ్ ‌సినిమాకు మధ్య లోనే బ్రేక్ పడింది.