ఆ సంవత్సరం “ఆరు పదుల వయసు” దాటిన హీరోలందరు వెండితెరపై అదరగొట్టారు..!!

యుక్తవయసులో ఈ హీరోలందరూ హిట్, సూపర్ హిట్ సినిమాలు తీసి తమ అభిమానుల చేత కీర్తించబడ్డారు. సాధారణంగా హీరోలు వయసు మళ్లడంతో తండ్రి, తాత పాత్రలకు పరిమితమవుతారు. అక్కినేని మినహా, ఎన్టీ రామారావు, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు తమ సినిమాలతో సందడి చేశారు.

1993 సంవత్సరం సీనియర్ హీరోల అందరికి కలసి వచ్చిందని చెప్పవచ్చు. లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్,కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో మేజర్ చంద్రకాంత్ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో ఎన్.టి.రామారావు ప్రధాన పాత్ర పోషించారు.

మోహన్ బాబు, నగ్మా, రమ్యకృష్ణలు హీరో, హీరోయిన్లుగా నటించారు. అన్ని కమర్షియల్ హంగులతో ఈ సినిమా రావడంతో అభిమానులు ఎన్టీ.రామారావుకు బ్రహ్మరథం పట్టారు. బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా ఘన విజయం సాధించింది.

తమ్మారెడ్డి భరద్వాజ దర్శకత్వంలో “పచ్చని సంసారం” సినిమా విడుదల అయ్యింది. ఈ సినిమాలో సూపర్ స్టార్ కృష్ణ, ఆమని హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇదే సంవత్సరం ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో “ఏవండీ ఆవిడ వచ్చింది” చిత్రం విడుదల అయింది. ఈ సినిమాలో శోభన్ బాబు, వాణిశ్రీ, శారద హీరో, హీరోయిన్లుగా నటించారు. చక్కటి కుటుంబ కథా చిత్రంగా వచ్చి సినిమా విజయాన్ని సాధించింది.

ఇదే సంవత్సరంలో ఎం.ఎం.మూవీ ఆర్ట్స్, శరత్ దర్శకత్వంలో “బావా బావమరిది” చిత్రం విడుదలయింది. ఇందులో కృష్ణంరాజు, జయసుధ, సిల్క్ స్మిత ప్రధానపాత్రలు పోషించగా సుమన్, మాలశ్రీ హీరో, హీరోయిన్లుగా నటించారు. రాజ్ కోటి అందించిన చక్కటి పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.

1993 గీత ఆర్ట్స్, బి.గోపాల్ దర్శకత్వంలో ‘మెకానిక్ అల్లుడు’ చిత్రం విడుదల అయ్యింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు ప్రధాన పాత్ర పోషించారు. చిరంజీవి, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీసు వద్ద పరాజయం పొందడంతో.. ఒక నాగేశ్వరరావు‌ మాత్రమే 1993 లో విజయాన్ని అందుకోలేక పోయారు.