విద్యార్థుల సెలవుల విషయంలో జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..?

ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తున్న కరోనా మహమ్మారి వల్ల గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం విద్యారంగంలో కీలక మార్పులు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల యాజమాన్యాలు చాలా నెలల నుంచే ఆన్ లైన్ క్లాసుల ద్వారా పాఠాలు చెబుతుండగా జగన్ సర్కార్ నవంబర్ 2వ తేదీ నుంచి పాఠశాలలను తెరిచేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్రంలోని పాఠశాలలన్నీ నవంబర్ 2 నుంచి రీఓపెన్ కానున్నాయి.

విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ నవంబర్ నెలంతా హాఫ్ డే స్కూళ్లు నిర్వహిస్తారని.. ప్రతిరోజు పావుగంట సమయం కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి టీచర్లు విద్యార్థులకు బోధిస్తారని తెలిపారు. కరోనా, లాక్ డౌన్ ఇప్పటికే విద్యార్థులు నాలుగున్నర నెలల పనిదినాలను నష్టపోయిన నేపథ్యంలో సంక్రాంతి, వేసవి సెలవులను తగ్గిస్తున్నట్టు వెల్లడించారు. అయితే ప్రభుత్వం తల్లిదండ్రులు అనుమతిస్తేనే పిల్లలు పాఠశాలలకు రావాలని సూచిస్తోంది.

నెల రోజులపాటు పాఠశాలలను నిర్వహించిన తరువాత పరిస్థితులకు అనుగుణంగా జగన్ సర్కార్ తరగతుల నిర్వహణ విషయంలో ముందుకెళ్లనుంది. కరోనా వైరస్ పై ప్రజల్లో గతంతో పోలిస్తే భయం తగ్గినా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీల నిర్వహణ కోసం ప్రభుత్వం రెండు రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.

స్కూళ్లు తెరిచిన తరువాత కొన్ని రోజుల పాటు పరిస్థితులను పూర్తిస్థాయిలో సమీక్షించనుంది. టాస్క్‌ఫోర్స్‌ కమిటీల ఏర్పాటు ద్వారా జిల్లా స్థాయిలో స్కూళ్లలో పరిస్థితులను పరిశీలించనున్నారు. విద్యార్థులు కరోనా వైరస్ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు.